గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ttdj
Last Updated : ఆదివారం, 1 మే 2016 (19:17 IST)

టిటిడి ఛైర్మన్‌గా తిరిగి చదలవాడా...? బాబోయ్.. దండం పెడతాం... వద్దు బాబోయ్‌...

తెలుగుదేశం పార్టీలో ఒక్కసారిగా అంతర్గత పోరు బయటపడింది. టిటిడి ఛైర్మన్‌గా చదలవా క్రిష్ణమూర్తిని తిరిగి సంవత్సరం కొనసాగించడంపై స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తికి ఏ ప్రాతిపదికన టిటిడి ఛైర్మన్‌గా

తెలుగుదేశం పార్టీలో ఒక్కసారిగా అంతర్గత పోరు బయటపడింది. టిటిడి ఛైర్మన్‌గా చదలవా క్రిష్ణమూర్తిని తిరిగి సంవత్సరం కొనసాగించడంపై స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తికి ఏ ప్రాతిపదికన టిటిడి ఛైర్మన్‌గా కొనసాగిస్తారంటూ బాబుకే ఫిర్యాదు చేశారు నేతలు. టిటిడి ఛైర్మన్‌గా తిరిగి చదలవాడ క్రిష్ణమూర్తి మాకొద్దు బాబోయ్‌ అంటూ సిఎం వద్ద మొరపెట్టుకున్నారు స్థానిక తెలుగుదేశంపార్టీ నేతలు. టిడిపి నేతలు శనివారం విజయవాడకు వెళ్ళి చదలవాడపై బాబుకు ఫిర్యాదు చేయడం ప్రస్తుతం హాట్‌ టాపిక్‌‌గా మారింది.  
 
2014 సంవత్సరం జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ తరపున తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి చదలవాడ క్రిష్ణమూర్తికి టికెట్‌ ఇస్తారన్న ప్రచారం జోరుగా సాగింది. టిడిపి అధికారంలో లేని సమయంలో తెదేపాకు పెద్ద దిక్కుగా ఉన్నారు చదలవాడ క్రిష్ణమూర్తి. ఏ కార్యక్రమం జరిగినా తెదేపా తరపున అప్పట్లో ముందుండి నడిపించారు. దీంతో 2014 ఎన్నికల్లో ఖచ్చితంగా చదలవాడకే బాబు టికెట్‌ ఇస్తారని అందరూ ఊహించారు. అయితే కాంగ్రెస్‌ పార్టీలో ఎమ్మెల్యేగా ఉండి ఆ తరువాత టిడిపిలో చేరిన వెంకరమణకే టికెట్‌ ఇస్తున్నట్లు అధిష్టానం ప్రకటించింది.
 
అధినేత బాబు వెంకటరమణకు టికెట్‌ ప్రకటనతో తిరుపతి ఒక్కసారిగా రాజకీయ వేడి రాజుకుంది. చదలవాడ క్రిష్ణమూర్తి వర్గీయులందరు పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు స్వయంగా చదలవాడను బుజ్జగించే ప్రయత్నం చేశారు. అంతేకాదు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చదలవాడ క్రిష్ణమూర్తిని టిటిడి ఛైర్మన్‌గా చేస్తామని ఆయనే ప్రజల మధ్య ప్రకటించారు. తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో చదలవాడ క్రిష్ణమూర్తికి ఇచ్చిన హామీని బాబు నెరవేరుస్తారని మొదట్లో అందరు భావించారు. టిటిడి ఛైర్మన్‌గా చదలవాడను వెంటనే నియమిస్తారని భావించారు. అయితే చాలా నెలల పాటు టిటిడి బోర్డునే ప్రకటించలేదు బాబు.
 
అందుకు ప్రధాన కారణం స్థానిక తెలుగుదేశంపార్టీ నేతలే. ఎన్నికల్లో చదలవాడ క్రిష్ణమూర్తి అసలు పనే చేయలేదని, పరోక్షంగా వైసిపికి చదలవాడ సపోర్టు చేశారని చదలవాడపై అప్పట్లోనే స్థానిక నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో చంద్రబాబు నాయుడు ఆలోచనలో పడ్డారు. పాలకమండలి నియామకాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. చివరకు తాను ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలని లేకుంటే ఇచ్చిన మాట పోతుందన్న భావనతో సంవత్సరం పాటు టిటిడి ఛైర్మన్‌గా చదలవాడ క్రిష్ణమూర్తిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మొదట్లో చదలవాడ క్రిష్ణమూర్తి సంవత్సరంపైన ఉండరని, టిటిడి ప్రక్షాళన చేయడంతో పాటు చదలవాడకు తక్కువ సమయం ఇవ్వాలన్న ఆలోచనతోనే బాబు ఇలా చేసినట్లు అందరూ భావించారు. అయితే సంవత్సర పాలకమండలి ముగిసింది. 
 
ఇక ఛైర్మన్ పదవి కోసం పైరవీలు ప్రారంభమయ్యాయి. రేసులో రాయపాటి సాంబశివరావుతో పాటు రాజమండ్రి ఎంపి మురళీమోహన్‌ల పేర్లు వినిపించాయి. ఇక చదలవాడ దిగిపోతారని అందరు భావించారు. గత సంవత్సరం ఏప్రిల్‌ 27వ తేదీన పాలకమండలిని ప్రభుత్వం నియమించింది. అయితే ఏప్రిల్‌ నెల పూర్తయినా సరే ప్రస్తుతం పాలకమండలిని కొనసాగిస్తామన్న నిర్ణయం మాత్రం బాబు తీసుకోలేదు. దీంతో అందరు ఒకటే భావించారు. చదలవాడ నేతృత్వంలోని టిటిడి పాలకమండలి కథ ఇక్కడితో ముగిసిందని. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం ప్రస్తుత పాలకమండలినే తిరిగి సంవత్సరం పాటు కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయం కాస్త స్థానిక తెలుగుదేశంపార్టీ నేతలు ఆగ్రహానికి గురిచేస్తోంది.
 
రెండు రోజులకు ముందు చదలవాడను తిరిగి కొనసాగిస్తున్నామని ప్రకటన రాగానే స్థానిక తెదేపా నేతల్లో ఆగ్రహావేశాలు ఒక్కసారిగా కట్టలు తెంచుకున్నాయి. శనివారం నేరుగా విజయవాడలో ఉన్న చంద్రబాబును కలిసి చదలవాడపై ఫిర్యాదు చేశారు. చదలవాడ సంవత్సరం టిటిడి ఛైర్మన్‌గా ఉన్న సమయంలో తమ బంధువులకు కూడా కనీసం సేవా టికెట్లు ఇవ్వలేదని ఫిర్యాదు చేశారు. సేవా టికెట్లు అడిగితే ఎవరో తెలియనట్లు చదలవాడ వ్యవహరించినట్లు కూడా చదలవాడపై నేతలు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. 
 
ప్రధానంగా చదలవాడ తిరిగి సంవత్సరం పాటు కొనసాగడానికి నారా లోకేష్‌ ప్రధాన కారణమని తెలుస్తోంది. నారా లోకేష్‌తో గతంలో ఉన్న పరిచయాలతోనే చదలవాడ తిరిగి ఆ పదవిలో కొనసాగుతున్నట్లు సమాచారం. మొత్తంమీద చదలవాడపై స్థానిక నేతలు చేసిన ఫిర్యాదుపై బాబు ఏ విధంగా స్పందిస్తారన్నది వేచి చూడాల్సిందే.