గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ttdj
Last Updated : మంగళవారం, 26 ఏప్రియల్ 2016 (11:21 IST)

ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద వేడి ప్రాంతంగా తిరుపతి

మీరు వింటున్నది నిజమే. భానుడి ప్రతాపం నేరుగా తిరుపతి పట్టణంవైపే ఉన్నట్లుండి. సోమవారం 46 డిగ్రీల ఉష్ణోగ్రత, ఆదివారం 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడమే ఇందుకు నిదర్శనం. ప్రస్తుతం తిరుపతి పరిస్థితి అలా ఉంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద వేడి ప్రాంతంగా తిరుపతి వరల్డ్‌ రికార్డు సాధించిందంటే ఇక పగటి ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతున్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. 
 
తిరుపతి పట్ణణాన్ని భానుడు బెంబేలెత్తిస్తున్నాడు. ఉదయం 9 గంటలు దాటితే భానుడు విజృంభిస్తున్నాడు. తన ప్రతాపం మొత్తాన్ని ఒక్కసారిగా చూపిస్తున్నాడు. 9 గంటలకు కర్చీఫ్‌లు, టవళ్ళను చుట్టుకుని, టోపీలు పెట్టుకుని బయటకు వెళ్ళే తిరుపతి ప్రజలు ఆ తర్వాత బయటకు వెళ్ళలేకపోతున్నారు. కాలు బయటపెడితే వేడి సెగ. ఒళ్ళంతా మంటలు. దీంతో పట్టణ ప్రజలు బయటకు రావడానికే భయపడిపోతున్నారు.  
 
వాహనదారులైతే గొడుగులు బండికి కట్టుకుని ఆ నీడలో వాహనాలను నడుపుతున్నారు. పాదాచారులు గొడుగులు లేకుంటే బయటకు రావడం లేదు. చిన్నపిల్లలను రోడ్లపైకే తీసుకురావడం లేదు. సోమవారం ఒక్కరోజే చిత్తూరు జిల్లాలో వడదెబ్బకు 16 మంది మృతి చెందారు. ఎండ తీవ్రతను తట్టుకోలేక విలవిలలాడుతూ ప్రాణాలు వదిలారు మరో 16 మంది. చనిపోయిన వారిలో ఎక్కువ మంది తిరుపతికి చెందిన వారే ఉన్నారు. పైగా చనిపోయిన వారంతా నడివయస్కులే కావడం ప్రస్తుతం గమనార్హం. 
 
సాధారణంగా ఎండ తీవ్రతకు 50 యేళ్ళు పైబడిన వారు చనిపోతుంటారు. అయితే అందుకు విరుద్ధంగా ఈ సారి నడివయస్కులు, చిన్నారులు చనిపోతుండడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఎండ గాలుల తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. ఉదయం 11 గంటలు దాటితే వేడి గాలి వీస్తోంది. ఈ వేడిగాలితో ముఖం మొత్తం మాడిపోయినట్లు అనిపిస్తోంది. దీంతో జనం అసలు బయటకు రావడమే మానేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలు దాటితే పట్టణ వీధులు నిర్మానుషంగా మారిపోతున్నాయి. 
 
శ్రీవారి భక్తుల గురించి అసలు చెప్పనవసరం లేదు. అసలు తిరుపతికి ఎందుకు వచ్చామా దేవుడా.. అనిపిస్తోంది భక్తులకు. ఎండ తీవ్రతను తట్టుకోలేక తిరుమల శ్రీవారిని దర్శించుకుని వెంటనే వెనుతిరుగుతున్నారు. ఇంతమంది చనిపోతున్నా జిల్లా యంత్రాంగంలో మాత్రం చలనం లేదు. ఎక్కడ కూడా ప్రభుత్వం తరపున చలివేంద్రాలు ఏర్పాటు చేసిన పాపాన పోలేదు. 
 
ప్రైవేటు వ్యక్తులే చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం నుంచి కూడా వేడి గాలులు తిరుపతిలో ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండ వేడిమి ఎక్కువగా కనిపిస్తోంది. గతంలో ఎప్పుడు చూడని ఎండ తీవ్రత తిరుపతిలో కనిపిస్తోంది. 47 డిగ్రీల ఉష్ణోగ్రత తిరుపతిలో నమోదైనట్లు వాతావరణ శాఖ చెబుతోంది.