శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ttdj
Last Updated : గురువారం, 12 మే 2016 (10:27 IST)

తిరుపతి పోలీస్‌ కమిషనరేట్‌ కలేనా? మాటలకే పరిమితమా?

తిరుపతి. ఈ పేరు వింటే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చేది కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి. ప్రతిరోజు 50 నుంచి 70 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ఈ ప్రాంతానికి వస్తుంటారు. ప్రధానంగా భక్తులకు రక్షణ కల్పించడమే పోలీసులకు సవాల్‌గా మారుతున్న పరిస్థితి. 
 
రాష్ట్ర విభజన తర్వాత తిరుమల, తిరుపతికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా తిరుపతి అర్బన్‌ జిల్లా కమిషనరేట్‌ చేయాలన్న ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. తిరుపతిని అర్బన్‌ జిల్లాగా ప్రకటించి పోలీస్‌ కార్యాలయాన్ని అప్పట్లో ఏర్పాటు చేశారు. ఇక్కడ పెద్ద క్యాడర్‌ అంటే ఎస్పీ. అర్బన్‌ జిల్లా మొత్తానికి ఒకరే ఎస్పీ. కింది స్థాయిలో ఎఎస్పీలు, డిఎస్పీలు ఉంటారు. తిరుపతి అర్బన్‌ జిల్లా పరిధిలో మొత్తం 22 పోలీస్టేషన్‌లు ప్రస్తుతం ఉన్నాయి. 
 
తిరుపతిలో పోలీసులకు ఎక్కువగా ఉన్న పని విఐపిల తాకిడే. విఐపిల తాకిడితోనే ఇక్కడి పోలీసులకు సగం పని సరిపోతుంది. ప్రతి వారానికి ఇద్దరు విఐపిలు ఈ ప్రాంతానికి వస్తూ పోతూ ఉంటారు. దీంతో వారికి భద్రత కల్పించడానికే వీరికి సమయం మొత్తం సరిపోతుంది. ఇక ప్రజల రక్షణ అంటారా అందరికీ తెలిసిందే. విఐపిల వెనుక పడితే రక్షణ ఇక గాలికే. అది తిరుపతి పరిస్థితి. అయితే ఇలాంటి పరిస్థితిల్లో తిరుపతిని పోలీస్‌ కమిషనరేట్‌ చేయాలన్న ఎప్పటి నుంచో ఒక డిమాండ్‌ ఉంది.
 
విభజన తర్వాత విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలలో పోలీస్‌ కమిషనరేట్‌ను ఏర్పాటు చేస్తారని, దీని వల్ల తిరుపతికి ఎక్కువ మంది పోలీసులు వచ్చే అవకాశం ఉందని అందరూ భావించారు. అయితే అదంతా మాటలకే పరిమితమయ్యాయే కానీ, చేతల్లో ఎంతమాత్రం సాధ్యం కాలేదు. తిరుపతి అర్బన్ జిల్లాగా 2010 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య చేతులమీదుగా ఆవిర్భవించింది. చిత్తూరు, తిరుపతి పోలీస్ జిల్లాల పరిధిలో పనిచేస్తున్న సిబ్బందిని 54:46 ప్రాతిపదికన విభజనకు నిర్ణయించారు. 
 
ఈ ప్రాతిపదికనకు మాత్రం ప్రభుత్వం గతంలోనే పచ్చజెండా కూడా ఊపింది. రోజురోజుకు నగరం విస్తరిస్తుండడంతో పాటు నేరాల సంఖ్య కూడా పెరుగుతోంది. అంతే కాకుండా భక్తుల సంఖ్య కూడా అనూహ్యంగా పెరుగుతూనే ఉంది. తిరుపతి అర్బన్‌ జిల్లా పరిధిలో ప్రస్తుతం నలుగురు ఎఎస్పీలు, 15 మంది డిఎస్పీలు, 32 మంది సిఐలు, 90 మంది ఎస్‌ఐలు, 2100 మంది సిబ్బంది ఉన్నారు. 
 
రోశయ్య తర్వాత కిరణ్‌ కుమార్‌ రెడ్డి, ఆయన తర్వాత చంద్రబాబునాయుడు ఇలా ఒకరికొకరు మారుతూ వచ్చారే తప్ప తిరుపతి పోలీస్‌ కమిషనరేట్‌ అన్న విషయం మాత్రం గాలికొదిలేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పోలీస్‌ కమిషరేట్‌ విషయం ఎన్నోసార్లు తెరపైకి వచ్చింది. సీఎం సొంత జిల్లా చిత్తూరు కావడంతో పోలీస్‌ కమిషరేట్‌ చకాచకా జరిగిపోతుందని అందరూ భావించారు. అయితే అదంతా కలగానే మారిపోయింది. 
 
తిరుపతి అర్బన్‌ జిల్లా పరిధిలో ఈ మధ్య కాలంలో నేరాలు ఎక్కువగా జరుగుతుండడం అటు స్థానికులును ఇటు పుణ్యక్షేత్రాల సందర్శనకు వచ్చే భక్తులను భయబ్రాంతులకు గురిచేస్తోంది. పోలీసు సిబ్బంది పెంచితే నేరాలను అదుపుచేయవచ్చునన్న భావన ప్రజల్లో ఉంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో తెదేపా ప్రభుత్వం పోలీస్‌ కమిషరేట్‌ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.