శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ttdj
Last Updated : శుక్రవారం, 26 ఆగస్టు 2016 (12:15 IST)

పవన్‌ కళ్యాణ్ వీరాభిమాని హత్య వెనుక కారణమేంటి...?

అభిమానం హద్దు మీరింది. ఒకరిపై ఒకరు ప్రేమలెక్కువైనా అనర్థాలకు దారితీస్తాయనడానికి ఆ సంఘటన అద్ధం పట్టింది. గుండెల్లో గుడికట్టి పూజించే అభిమానులున్న స్థాయికి మన తెలుగు హీరోలే ఎప్పుడో ఎదిగిపోయారు. అక్కడక్క

అభిమానం హద్దు మీరింది. ఒకరిపై ఒకరు ప్రేమలెక్కువైనా అనర్థాలకు దారితీస్తాయనడానికి ఆ సంఘటన అద్ధం పట్టింది. గుండెల్లో గుడికట్టి పూజించే అభిమానులున్న స్థాయికి మన తెలుగు హీరోలే ఎప్పుడో ఎదిగిపోయారు. అక్కడక్కడ గుడిలు కొట్టిన సంధర్భాలు కూడా మనం ఎన్నో చూశాం. కానీ ఫ్యాన్స్ మధ్య ఆధిపత్య పోరు పరాకాష్టకు చేరితే బహుశా ఫలితం ఇలాగే ఉంటుందేమో, ఫ్యాన్స్ ఉన్నది సేవా కార్యక్రమాలు చేయడానికే అంటూ ఒక పక్క హీరోలు ఊదరగొడుతున్నా కటౌట్లు, పాలాభిషేకాలతో ఇప్పటికీ జేబులను గుల్ల చేసుకుంటున్నారు అభిమానులు. అది కాస్త శృతిమించితే చివరకు తమ ప్రాణాలే కోల్పోతున్నారు. తిరుపతి వినోద్‌ రాయల్‌ విషయంలో కూడా అదే జరిగింది. ఎంతో సేవాభావంతో తమ అభిమాన హీరో అడుగుజాడల్లో నడుస్తూ ముందుకెళుతున్న వినోద్‌ జీవితం అనుకోని ఆవేశంతో అర్థాంతంరంగా ముగిసిపోయింది. ఇంతకు వినోద్‌ మరణ వెనుక ఉన్నది ఫ్యాన్స్ మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరా? లేక వారిలో వారికున్న అంతర్గత పోరా? ఇప్పుడు చూద్దాం. 
 
తిరుపతికి చెందిన వినోద్‌ రాయల్‌కు బాల్యం నుంచి కూడా సినిమాలపై బాగా పిచ్చి, సినిమాల ద్వారా ఎంతో ప్రేరణ పొందిన వినోద్‌ రాయల్‌ తాను కూడా నిజజీవితంలో ఒక హీరోలాగే బతకాలనుకున్నాడు. అలాగని చదువును నిర్లక్ష్యం చేయకుండా మరోవైపు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ పవన్‌ కళ్యాణ్‌ అభిమాన సంఘంలో కీలకవ్యక్తిగా పనిచేశాడు. పవన్‌ ఒక అంశంపై పిలుపునివ్వడమే ఆలస్యం ఆ కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహిస్తూ మన్ననలను అందుకున్నాడు. సినిమా హీరోల ఫ్యాన్సంటే జులాయిగా తిరుగుతూ సినిమా హాళ్ళలో గొడవ చేసే ఆవారాగాళ్ళు అనుకునే చాలామందికి వినోద్‌ రాయల్‌ సేవా కార్యక్రమాలు చెంపపెట్టుగా మిగిలాయని చెప్పాలి. దానికితోడు పవన్‌ కళ్యాణ్‌ ఎప్పుడైతే జనసేనపార్టీ పెట్టాడో అప్పటినుంచి చురుగ్గా పాల్గొంటూ వచ్చాడు. అన్నదానాల నుంచి అవయవదానాల వరకు వినోద్‌ రాయల్‌ను నడిపించింది. ఒక్క పవన్‌ కళ్యాణ్‌ మీదున్న అభిమానమే. అందులోభాగంగా కర్ణాటక రాష్ట్రంలోని కోలార్‌లో జరిగిన అవయవదానం మీద అవగాహనా కార్యక్రమంలో పాల్గొనేందుకు వినోద్‌ అక్కడికి వచ్చిన వారందరినీ ఉద్దేశించి చాలా అద్భుతంగా మాట్లాడారు.
 
ఎలాంటి కార్యక్రమాలు చేయాలి ముఖ్యంగా అవయవదానం చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుంది అన్న విషయాలపై తమ తోటి ఫ్యాన్స్‌కు వివరించారు. అయితే ఈ మాటల మధ్యలో అక్కడికి వచ్చిన జూనియర్‌ ఎన్‌టిఆర్‌ ఫ్యాన్స్ వెకిలి చేష్టలు చేసినట్లు తెలుస్తోంది. దాంతో సీరియస్‌ అయిన పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్ ఇంత గొప్పగా కార్యక్రమం నిర్వహిస్తుంటే ఇలా గేలి చేయడం తప్పంటూ మందలించారు. అయినప్పటికీ వారు తగ్గకపోవడంతో పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్‌ కూడా కొత్తగా వస్తున్న ఎన్‌టిఆర్‌ 'జనతా గ్యారేజ్‌' సినిమాపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. దీంతో మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది.
 
అయితే గొడవను సద్దుమణిగేలా చేయడంలో వినోద్‌ రాయల్‌ కీలకంగా వ్యవహరించారు. అయినప్పటికీ దానిని మనసులోనే పెట్టుకున్న ఎన్‌టిఆర్‌ ఫ్యాన్స్ తిరిగి సాయంత్రం ఒక హోటల్‌ వద్ద గొడవకు దిగారు. అప్పుడు జరిగిన గొడవలో క్షణికావేశంలో ఎన్‌టిఆర్‌ ఫ్యాన్స్ కత్తితో వినోద్‌పై దాడి చేసినట్లు అక్కడ ఉన్నవారు తెలిపారు. అయితే దాడిలో ఎంతోమంది పాల్గొన్నారు. వారు నిజంగా ఎన్‌టిఆర్‌ ఫ్యాన్సేనా? కేవలం ఆధిపత్య పోరు కారణంగానే ఈ హత్య జరిగిందా? అనే కోణాలను ఇప్పటికీ పోలీసులు విశ్లేషించలేకపోతున్నారు. స్థానికంగా ఉన్న వారి సమాచారం ఎవరికి వారు అనుకూలంగా మాట్లాడుతుండటంతో వాస్తవ పరిస్థితి పోలీసులకు తెలియలేదనే చెప్పాలి.
 
అయితే వినోద్‌ రాయల్‌ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ అంచలంచెలుగా ఎదుగుతూ ఉండటాన్ని ఓర్వలేని అతని వర్గంలోని కొంతమందే ఈ హత్య చేయించారన్న వాదనలు లేకపోలేదు. మొత్తంమీద ఫ్యాన్స్ మీద ఆధిపత్య పోరు కారణంగానే వినోద్‌ హత్య జరిగిందా? లేక వారిలో వారికే వచ్చిన ఆధిపత్యం వల్లే వినోద్‌ హత్యకు ఎవరైనా కుట్ర చేశారా? అన్న విషయాలు తెలియాల్సి ఉంది. 
 
నిజానికి హీరోల మీద అభిమానం ఉంటేనే మాత్రం ఎదుటివారి అభిమానాన్ని చంపేంతగా వారిని ప్రోత్సహిస్తున్నారా? అన్నది ఇప్పుడు అందరి ప్రశ్న. నిజానికి చాలా సున్నితమైన అంశంగా భావించి సమగ్ర దర్యాప్తు చేయకుంటే ఇది విద్వేషాలను రెచ్చగొట్టి ఫ్యాన్స్ మధ్య మరిన్ని గొడవలకు కారణమయ్యే అవకాశం ఉంది. దీంట్లో ఇప్పటికైనా హీరోలు ప్రవేశించకుండా దీన్ని ఫ్యాన్స్ మధ్య గొడవల్లా కాకుండా ఒక హత్య కేసుగా భావించి పోలీసులు డీల్‌ చేస్తే ఇది సద్దుమణిగే అవకాశం ఉంది.