శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By PNR
Last Updated : మంగళవారం, 9 సెప్టెంబరు 2014 (16:30 IST)

నటీమణులను వ్యభిచార రొంపిలోకి ఎవరు లాగుతున్నారు?

ఇటీవలి కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హీరోయిన్లు వ్యభిచారం కేసుల్లో పట్టుబడుతూ కళామతల్లి పరువును బజారుకీడ్చుతున్నారు. వెండితెర వెలుగుజిలుగుల్లో హైటెక్ జీవితాన్ని అనుభవించిన హీరోయిన్లు, జూనియర్ ఆర్టిస్టులు అనేక మందికి క్రమంగా అవకాశాలు తగ్గిపోవడంతో ఈ కూపంలోకి వస్తున్నారన్నది వాదన. 
 
అవకాశాలు తగ్గిపోయిన సినిమా నటీమణులు వ్యభిచార కూపంలోకి ఎందుకు దిగుతున్నారు? ఆర్థిక పరిస్థితులు కారణమా? విలాసాలకు అలవాటుపడటమా? వీరిని ఎవరైనా ప్రేరేపిస్తున్నారా? మానసిక దౌర్భల్యమా? నైతిక విలువలు లేకనా? తేలికగా డబ్బు సంపాదించవచ్చని అనుకోవడమా? ఇదొక ప్రధాన సామాజిక సమస్య అయినందున అన్ని కోణాలలో దీని గురించి ప్రభుత్వాలు ఆలోచన చేయాల్సివుంది. మన దేశంలో వ్యభిచారం చట్టవ్యతిరేకం అని తెలిసి కూడా సెలెబ్రిటీలుగా ఉన్న వారు ఈ రొంపిలోకి ఎందుకు దిగుతున్నారో అంతుచిక్కదు.
 
అవకాశాలు తగ్గిపోతే బతకడానికి మరో మార్గంలేదా? ఈ వృత్తిలోకే దిగాలా? విలువలకు కట్టుబడి చట్టబద్దమైన మార్గంలో అనేక పనులు చేసుకొని బతకవచ్చు. ఆ మార్గాలను ఎందుకు ఆలోచించరు? పండు ముసలివాళ్లు కూడా బుట్టలో పల్లీలు అమ్ముతూ బతుకుతున్నారు. కూలి పని చేసుకొని జీవిస్తున్నారు. శరీరంలో శక్తి, మెదడులో ఆలోచనలు, సెలబ్రిటీగా పలువురితో పరిచయాలు ఉండి కూడా ఇటువంటి చట్టవ్యతిరేకమైన వ్యభిచార వృత్తిలోకి దిగడం ఎందుకు? అని ఆలోచన చేయరా? 
 
నటీమణులు గానీ, ఇతర యువతులు గానీ  వ్యభిచార కూపంలోకి దిగడానికి ప్రధానంగా ఆర్థిక పరిస్థితులతోపాటు విలాసవంతమైన జీవితానికి అలవాటుపడటం, నైతిక విలువలకు తిలోదకాలు ఇవ్వడం, మానసిక దౌర్భల్యం... ఇవన్నీ ప్రధాన కారణాలుగా భావించవచ్చు. స్వచ్ఛంద సంస్థలు, సామాజిక శాస్త్రవేత్తలు, ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారానికి వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం ఉంది.