బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pyr
Last Updated : మంగళవారం, 12 మే 2015 (14:33 IST)

పట్టిసీమ రాజకీయాలు... జగన్ వద్దంటారు.. బాబు కావాలంటారు.. సీమకేంటి లాభం?

పట్టిసీమ రాజకీయం ఇప్పుడు రాష్ట్రంలో హట్ టాపిక్‌గా మారింది. పట్టిసీమతో రాయలసీమ సస్యశ్యామలమవుతుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అంటుంటే, సీమకే కాదు రాష్ట్రానికే నష్టదాయకమని విపక్ష నేత, వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి అంటున్నారు. అసలేం జరగబోతోందోనని ప్రజలు ఆందోళనలో ఉన్నారు. అసలు సమస్య సీమకు  సాగు,తాగునీరు. శ్రీబాగ్ ఒడంబడిక నుంచి రాయలసీమకు  అన్యాయం జరుగుతూనే ఉంది. ఈ ప్రాంత నాయకులు ముఖ్యమంత్రుల నుంచి రాష్ట్రపతుల వరకూ పదవులనైతే సాధించారు. కానీ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం మాత్రం చూపలేకపోయారు. ఇది నాటి నుంచి నేటి వరకు రాయలసీమవాసులను వెంటాడుతూనే ఉంది. కానీ ప్రస్తుతం ఒకరు నష్టమంటే మరొకరు లాభమంటూ జనాన్ని అయోమయానికి గురి చేస్తున్నారు. 
 
సహజంగా రాజకీయ పార్టీలు ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు పరచడమే గగనం. అలాంటిది ఎన్నికలలో ప్రస్తావనే లేని పట్టిసీమను ఎలా తెరమీదకు వచ్చింది. వచ్చిందే ఆలస్యంగా అన్ని సమస్యలకు తారక మంత్రంగా బాబు చెబుతున్నారు. ఇక్కడ మనం ఆ ప్రకటన సందర్భం, సమయాన్ని చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజధాని ప్రకటన తర్వాత పట్టిసీమను వల్లెవేస్తున్నారు. రాయలసీమను రతనాల సీమను చేస్తామని పదే పదే చెబుతున్నారు. ఇది సాధ్యమా..! ఇక్కడే సీమవాసులకు అనుమానం. సీమవాసుల అనుమానాలను బలపరిచే విధంగా ఈ మధ్య కాలంలో మరోరెండు సంఘటనలు సంభవించాయి. మెుదటిది చిత్తురు జిల్లాకు లాభం చేకూర్చే కండలేరును మాజీ ముఖ్యమంత్రి కిరణ్  తీసుకువస్తే దాన్ని బాబు ప్రక్కన పెట్టారు. 
 
రెండోది రాయలసీమకు ప్రయోజనం చెకూర్చే హంద్రీనీవా ప్రాజెక్టు డిజైన్ మార్చి దాని స్థాయిని కుదించేశారు. దీంతో సాగు, తాగునీటి ప్రాజెక్టును ఒకరకంగా తాగు నీటికే పరిమితం చేయడమే పట్టిసీమ పరమార్థం అనేది స్పష్టమవుతోంది. సీమను సస్యశామలం చేస్తామని చెబుతూనే సాగునీటిని అందించే హంద్రీ నీవా బ్రాంచి కాలువల నిర్మాణాన్ని నిలిపేస్తూ జీఓ ఇచ్చేశారు. దీని వలన మరి రైతులకు ఏ విధంగా ప్రయోజనం ఒనగూరుతుంది..? ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చుతోంది. అంటే పట్టిసీమ సాగునీటి ప్రయోజనాల కోసం కాదు అనేది స్పష్టమై పోతోంది. 
 
సీమ, ఉత్తరాంధ్ర ప్రయెజనాలు తీరాలంటే పోలవరం ఒక్కటే పరిష్కారం. దాన్ని ప్రక్కన పెట్టి పట్టిసీమను ముందుకు తెచ్చారు. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే రాజధాని ప్రకటన తర్వాత పట్టిసీమ పుట్టుకొచ్చింది. బాబు మంచి రాష్ట్రం నిర్మించాలనే ఆలోచనను పక్కన పెట్టి గొప్ప రాజధానిని నిర్మించే పనిలో పడ్డారు. రాజధాని అవసరాలు, వచ్చే కంపెనీల అవసరాలు చుట్టూనే పట్టిసీమ తిరుగుతోంది. పైకి మాత్రం రైతుల ప్రయోజనాలు చూపి బాబు తన రాజకీయ చాణుక్యతను ప్రదర్శిస్తున్నారు. వాటికి నీటిని తీసుకు వచ్చే లక్ష్యంగా పట్టిసీమ నిర్మాణంగా కనిపిస్తుంది. 
 
అవకాశం ఉంటే సీమలో ముఖ్యపట్టణాలకు తాగునీరు అందిస్తారు. ఇక్కడ ఇది ప్రాధాన్యమైన అంశం ఏమీ కాదు. పరిశ్రమలే ప్రధానం. ఇంకా నీళ్ళు మిగిలితే తాగునీరు ఇస్తారు. ఇంకనూ నీళ్ళు మిగిలితే చెరువులు నింపుతారు. కానీ బ్రాంచీ కాలువలు మాత్రం తవ్వరు. దీని వలన సీమలో భూగర్బజలాలు పెరిగితే సేద్యం చేసుకోవచ్చు. అదీ బిందు సేద్యం పద్దతిన వాణిజ్య పంటలకే ప్రాధాన్యత ఉంటుంది. సాంప్రదాయ పంటలను పక్కన పెట్టాల్సిందే. వాటికి నీళ్ళు ఇఛ్చే అవకాశం ఉండకపోవచ్చు. 
 
సీమను తుంపర్ల (బిందు) సేద్యానికి మాత్రమే పరిమితం చేయడం లక్ష్యంగా కనిపిస్తోంది. అంటే నీళ్ళపై రాయలసీమ రైతుకు పూర్తి స్థాయిలో హక్కు లేకుండా చేయడమే బాబు లక్ష్యం అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే పట్టిసీమ రాజధానికే తప్ప రాయలసీమకు కాదు అన్న వాదనకు బలం చేకూరుతోంది. ఇక బాబు ఆలోచనలను దెబ్బ కొట్టి, వాటిని బయట పెట్టి నష్టపోయిన రైతులను తమ వైపు తిప్పుకోవడానికి ఈ బాగోతాన్ని వైఎస్సార్ సీపీ బయట వేస్తోంది. 
 
విమర్శలను గుప్పిస్తోంది. పోలవరం ప్రాజెక్టు వెనుకబడిపోతుందని గగ్గోలు పెడుతోంది. ఈ ఉద్యమాల ద్వారా లాభం పొందవచ్చుననే విషయం తెలుస్తోంది. మొత్తంపై సీమ సమస్య మళ్ళీ ఇక్కడ రాజకీయ ప్రయోజనాలకే ఉపయోగపడుతోంది తప్ప రైతు ప్రయోజనాలకు కాదనేది స్పష్టంగా తేటతెల్లమవుతోంది.