శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ttdj
Last Modified: గురువారం, 21 ఏప్రియల్ 2016 (12:25 IST)

పవన్‌ కళ్యాణ్‌ చుట్టూ పసుపులేటి ప్రదక్షిణలు... వేంకటేశుని చూపు ఎవరిమీదో...?!!

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో ఏదేని పోస్టు. ప్రపంచంలోనే పేరెన్నిగలదీ పోస్టు. ఎంతోమంది తమ పలుకుబడులతో టిటిడి పాలకమండలిలో సభ్యుడిగా చేరాలని ప్రయత్నిస్తుంటారు. కలియుగ ప్రత్యక్షదైవం వెంకన్నను దగ్గరి నుంచి దర్శించుకోవడమే కాకుండా తమ వారితో పాటు రాజక

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో ఏదేని పోస్టు. ప్రపంచంలోనే పేరెన్నిగలదీ పోస్టు. ఎంతోమంది తమ పలుకుబడులతో టిటిడి పాలకమండలిలో సభ్యుడిగా చేరాలని ప్రయత్నిస్తుంటారు. కలియుగ ప్రత్యక్షదైవం వెంకన్నను దగ్గరి నుంచి దర్శించుకోవడమే కాకుండా తమ వారితో పాటు రాజకీయ నాయకులను, పారిశ్రామికవేత్తలకు సేవా టికెట్లను సులభంగా అందించుకోవచ్చు. ఒకసారి టిటిడి పాలకమండలి స్థానం లభిస్తే ఇక కావాల్సినంత లాభం వస్తుందనే నానుడి లేకపోలేదు. 
 
తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చాలా నెలల తరువాత తిరుపతిలో టిడిపి నాయకుడిగా పనిచేసిన చదలవాడ క్రిష్ణమూర్తికి టిటిడి ఛైర్మన్‌ పదవిని కట్టబెట్టింది. ఆయనతో పాటు 14మంది బోర్డు సభ్యులకు అవకాశం కల్పించింది. అందులో తిరుపతికి చెందిన ఇద్దరికి అవకాశం లభించింది. ఒకరు బిజెపి నేత భానుప్రకాష్‌రెడ్డి కాగా మరొకరు పసుపులేటి హరిప్రసాద్‌.
 
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడికి శిష్యుడిగా ఉన్న భానుప్రకాష్ రెడ్డి, సినీనటుడు పవన్‌ కళ్యాణ్‌కు అత్యంత సన్నిహితుడు, ఆయన సామాజిక వర్గానికి చెందిన పసుపులేటి హరిప్రసాద్‌లు ఎలాగోలా టిటిడి పాలకమండలిలో స్థానాన్ని సంపాందించారు. మొదటగా భానుప్రకాష్ రెడ్డికి పాలకమండలిలో అవకాశం రావాల్సి ఉండగా ఆ స్థానాన్ని తన్నుకుపోయారు పసుపులేటి హరిప్రసాద్‌. అందుకు ప్రధాన కారణం పవన్‌ కళ్యాణ్ రెకమెండేషనే అనే వాదన అప్పట్లో బాగానే వినిపించింది. పసుపులేటి హరిప్రసాద్‌ కొన్ని రోజులు మొదట్లో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం నుంచి ఉత్సాహంగా పనిచేస్తూ వచ్చారు. అయితే ఆ పార్టీలో పనిచేసేటప్పుడు చిరంజీవితో పాటు పవన్‌కు చేరువయ్యాడు పసుపులేటి.
 
ఇంకేముంది పిఆర్‌పి మూతపడిన తరువాత టిడిపిలోకి వచ్చారు. మెల్లమెల్లగా కార్యక్రమాలు చేస్తూ వచ్చిన పసుపులేటి ఆ తరువాత టిటిడి పాలకమండలి నూతనంగా ఎన్నిక అవుతున్నట్లు తెలుసుకుని ఆ దిశగా పావులు కదిపారు. బిజెపి నేత భానుప్రకాష్‌రెడ్డికి రావాల్సిన స్థానాన్ని పసుపులేటి తన్నేసుకుపోయారు. దీంతో భానుప్రకాష్ రెడ్డి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వెనుకపడ్డారు. నూతన పాలకమండలి ఎన్నికైన 15 రోజుల్లోపే భానుప్రకాష్ రెడ్డి మరో పాలకమండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఇద్దరికి సంవత్సరం పదవీకాలం ఈ నెల 27వ తేదీకి ముగియనుంది.
 
దీంతో ఇద్దరు పాలకమండలి సభ్యులు తిరిగి ఆ పదవిలో కొనసాగేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. బిజెపి నేత భానుప్రకాష్ రెడ్డి తనకు తెలిసిన బిజెపి అగ్రనేతలను కలిసి సిఎం చంద్రబాబునాయుడుకు చెప్పించే ప్రయత్నాలు ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి. గత 15 రోజులుగా భానుప్రకాష్ రెడ్డి ఢిల్లీ, చెన్నైలు తిరుగుతూ బిజెపి అగ్రనేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారని అంటున్నారు.
 
అలాగే పసుపులేటి హరిప్రసాద్‌.. తాను ఏం తక్కువ తినలేదన్నట్లు ఆయన కూడా మరోసారి పదవి కోసం పవన్‌ కళ్యాణ్‌ సన్నిహితుల ద్వారా ప్రయత్నాన్ని ప్రారంభించారని సమాచారం. పవన్‌కు అత్యంత సన్నిహితంగా ఉండేవారికి శ్రీవారి దర్శనభాగ్యం బాగా కల్పించారంటూ పసుపులేటి మీద మంచి అభిప్రాయం ఉంది. ఈ క్రమంలో పసుపులేటి వారి ద్వారానే పవన్‌ కళ్యాణ్‌ను మరోసారి కలిసి మరో ఛాన్స్‌ను ఇప్పించాలనే ప్రయత్నం చేస్తున్నట్లు భోగట్టా. గత పదిరోజులుగా హైదరాబాద్ లోనే పసుపులేటి ఉంటున్నారని ఆయన సన్నిహితులే చెబుతున్నారు.
 
వీరిద్దరు పాలకమండలి సభ్యులే కాకుండా మిగిలిన సభ్యుల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. అందరు తిరిగి ఇదే పాలకమండలిలో కొనసాగేందుకు తమ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మొత్తంమీద వీరి ప్రయత్నాలు ఏ విధంగా ఫలిస్తుందో లేదోనన్నది మరి కొన్నిరోజుల్లో తేలిపోనుంది. మరి వేంకటేశుని చూపు ఎవరి మీద పడుతుందో...?!!