శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ttdj
Last Updated : మంగళవారం, 1 నవంబరు 2016 (12:32 IST)

తిరుమలకు నడకదారి - హాకర్లకు అడ్డదారి

తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్రమాన్ని సక్రమంగా చేసుకోవడానికి ప్రయత్నాలు కొనసాగించాలే గానీ ఎప్పుడో ఒకప్పుడు తప్పక విజయం సాధించవచ్చు. అడ్డదారిలోనో, దొడ్డ మనసుతోనే ఎవరో ఒకరు తప్పక కరుణిస్తారు. ఇలాంటి ఉదం

తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్రమాన్ని సక్రమంగా చేసుకోవడానికి ప్రయత్నాలు కొనసాగించాలే గానీ ఎప్పుడో ఒకప్పుడు తప్పక విజయం సాధించవచ్చు. అడ్డదారిలోనో, దొడ్డ మనసుతోనే ఎవరో ఒకరు తప్పక కరుణిస్తారు. ఇలాంటి ఉదంతమే ఇది. లైసెన్సు కోసం విఫల ప్రయత్నాలు చేస్తున్న అనధికారిక హాకర్లు తాము హాకర్లమని చెప్పుకునేందుకు దొడ్డిదారిన ఆధారం సంపాదించారు. ఇంతకీ విషయం ఏమిటంటే.
 
తిరుమల కాలిబాట మార్గంలో అనధికారికంగా పండ్లు అమ్ముకుంటున్న 52 మంది హాకర్లు చాలాకాలంగా తితిదే నుంచి లైసెన్సులు సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయినా వారి ప్రయత్నాలు ఫలించడం లేదు. దీనికి సంబంధించి 2007లో నందకిషోర్‌ అనే అసిస్టెంట్‌ విజిలెన్స్ అండ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ ఒక విచారణ నిర్వహించారు. 
 
తాను చేపట్టిన విచారణకు ఆరుగురు మినహా అందరూ హాజరయ్యారని, అప్పటికే 10-15 యేళ్ళ నుంచి వారు నడకదారిలో వ్యాపారం సాగిస్తున్నట్లు తనకు వివరించారని ఆయన ఈఓకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. లైసెన్సులు లేనందువల్ల అలిపిరి సెక్యూరిటీ పాయింట్‌ వద్ద ఏ వస్తువులూ తీసుకురానీయకుండా అడ్డుకుంటున్నారని, తమకు లైసెన్సులు ఇప్పించాలని ఆ హాకర్ల యూనియన్‌ నాయకులు విన్నవించుకున్నట్లు నివేదికలో రాశారు. అంటే ఆ హాకర్లకు లైసెన్సులు లేవనే విషయాన్ని ఎవిఎస్‌ఓ ధృవీకరించారు. 
 
ఆ తర్వాత కూడా అనధికారిక హాకర్లు లైసెన్సులు సంపాదించడం కోసం ప్రయత్నించారు. ఈ ప్రతిపాదన రెండు పర్యాయాలు బోర్డు దాకా వెళ్ళినా ఆమోదం లభించలేదు. దీంతో అనధికారికంగానే వ్యాపారం సాగిస్తున్నారు. ఈ క్రమంలో తాజాఆ 22 మంది హాకర్ల నుంచి గార్బేజ్‌ ఫీజు (చెత్త తొలగించడానికి వసూలు చేసే ఫీజు ) వసూలు చేయడానికి హెల్త్ విభాగం నిర్ణయం తీసుకుంది. మరో 11 మంది నుంచి కూడా గార్బేజ్‌ ఫీజు వసూలుకు ఫైలు సిద్ధం చేశారు. ప్రస్తుతం ఈ ఫైల్ ఎస్టేట్‌ ఆఫీసర్‌ కార్యాలయంలో ఉంది.
 
తితిదే అధికారికంగా గుర్తించి లైసెన్సులు మంజూరు చేసిన వ్యాపారుల నుంచి మాత్రమే హెల్త్ విభాగం గార్బేజ్‌ ఫీజు వసూలు చేయాలి. అనధికారిక హాకర్ల నుంచి అలాంటి ఫీజు వసూలు చేసి వారికి రశీదులు ఇస్తే అవే వారికి పెద్ద ఆధారం అవుతాయి. వాటి ఆధారంగా న్యాయస్థానాలను ఆశ్రయించి లైసెన్సులు మంజూరు చేయించుకునే ప్రయత్నం చేస్తారని పలువురు అంటున్నారు. అసలు అనధికారిక హాకర్ల నుంచి గార్బేజ్‌ ఫీజు వసూలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నారు. 
 
ఈ వ్యవహారం ఈఓ సాంబశివరావు దృష్టికి వెళ్ళలేదని తెలుస్తోంది. మొదటి 22 మంది నుంచి నిబంధనలకు విరుద్ధంగా గార్బేజ్‌ ఫీజు కట్టించుకోవడంతో మరో 11 మంది కూడా అదే బాటలో వచ్చారు. తీరా ఇది ఎటుదారి తీస్తుందోనని ఆచితూచి అడుగులు వేస్తున్నారని సమాచారం. ఈఓ చొరవ తీసుకుని విచారణ జరిపిస్తే ఈ వ్యవహారం వెనుక పెద్ద మనుషులు ఎవరున్నారేది బయటపడుతుంది.