శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ttdj
Last Modified: శనివారం, 9 జులై 2016 (14:22 IST)

తితిదేలో "శ్రీమంతులు"... వారివద్ద కోట్లలో నోట్లు ఎలా తిరుమలేశా...?

తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న కొందరు అధికారుల ఇళ్ళపై ఇటీవ కాలంలో అవినీతి నిరోధక శాఖ వరుసగా దాడులు నిర్వహిస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న అనుమానాలతో నిర్వహిస్తున్న ఈ దాడుల్లో ఒక్కో అధికారి వద్ద కోట్ల విలువైన ఆస్తులు బయటపడుతున

తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న కొందరు అధికారుల ఇళ్ళపై ఇటీవ కాలంలో అవినీతి నిరోధక శాఖ వరుసగా దాడులు నిర్వహిస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న అనుమానాలతో నిర్వహిస్తున్న ఈ దాడుల్లో ఒక్కో అధికారి వద్ద కోట్ల విలువైన ఆస్తులు బయటపడుతున్నాయి. ప్రభుత్వ రెవిన్యూ, పోలీసు వంటి శాఖల అధికారుల ఇళ్ళలో ఎసీబీ సోదాలు నిర్వహించినపుడు కళ్ళు చెదిరేలా కోట్ల రూపాయల విలువైన ఆస్తులు బహిర్గతమయ్యేవి. అయితే ఒక ధార్మిక సంస్థలో పనిచేసే అధికారుల వద్ద అంతకుమించి ఆస్తులు ఉండటం ఎసీబీ అధికారులనే ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పటికే ఐదుగురు తితిదే అధికారులు ఎసీబీకి చిక్కారు. ఇంకా 20 మందికి పైగా అధికారులు ఎసీబీ జాబితాలో ఉన్నట్లు వార్తలొచ్చాయి. అసలు తితిదే అధికారులపై ఎసీబీ ఎందుకు దృష్టి సారించింది. రాబోయే కాలంలో ఏమి జరుగబోతోంది.
 
తితిదేలో ఉన్న 9,500 మంది రెగ్యులర్‌ ఉద్యోగులు ఇంటి స్థలం కోసం చకోరపక్షుల్లా ఎదురుచూస్తున్నారు. జీవితకాలం పనిచేసినా వచ్చే జీతంతో కుటుంబాన్ని పోషించుకోవడం పిల్లలను చదివించుకోవడం కష్టంగా ఉంది. ఇక జానెడు జాగా కొనుక్కుని, సొంత ఇల్లు నిర్మించుకోవడం సాధారణ ఉద్యోగికి కలగా మారిపోయింది. అందుకే యాజమాన్యమైనా సొంతింటి కల నెరవేర్చుతుందని ఆశగా ఎదురుచూస్తున్నారు. అలాంటిది తితిదేలోని కొందరు అధికారులు కోట్ల విలువ చేసే, పదుల సంఖ్యలో ఇళ్ళ స్థలాలు, ఇళ్ళు ఎలా సంపాందించారనేది ప్రశ్న. తాజాగా పట్టుబడిన ఒక అధికారి వద్ద 23 ఇళ్ళ స్థలాలకు సంబంధించిన పత్రాలు దొరికినట్లు ఎసీబీ అధికారులు ప్రకటించారు. వీటి విలువ కొన్ని కోట్ల రూపాయలు ఉంటుంది. అదేవిధంగా అంతకుమునుపు పట్టుబడిన ఒక అధికారి ఆస్తుల విలువ వంద కోట్ల పైమాటేనట. 
 
తితిదే అధికారులు కోట్ల రూపాయల ఆస్తులు ఎలా కూడబెట్టగలిగారనేది ప్రశ్న. ప్రధానంగా అక్రమార్జనకు శ్రీవారినే ఆసరాగా చేసుకుంటున్నారు. దర్శనాల పేరుతో సేవా టికెట్ల పేరుతో అడ్డగోలుగా సంపాందిస్తున్నారు. శ్రీవారి ఆలయంలో పోస్టింగ్‌ అంటే కాసులు కురిసే కేంద్రమన్న అభిప్రాయం సర్వత్రా ఉంది. కాస్త చేతివాటం తెలిసిన అధికారి తిరుమలలో అడుగుపెడితే కుబేరుడై పోతాడన్న భావన తితిదే ఉద్యోగుల్లోనే ఉంది. డబ్బున్న మారాజులకు శ్రీవారి దర్శనాలు చేయించడం ద్వారా కానుకల రూంలో సంపాందిస్తున్నదే ప్రధానమైనది.
 
చెన్నై, బెంగుళూరు, ముంబై, ఢిల్లీ వంటి నగరాల నుంచి వచ్చే బడా వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలకు తితిదేలోని కొందరు అధికారులు ఏజెంట్లులాగా మారిపోయారు. అలాంటి బడా బాబులు, వారి తరపు వారు ఎవరు దర్శనానికి వచ్చినా వారు ఉబ్బితబ్బిబ్బయ్యేలా శ్రీవారి దర్శనం చేసి పంపుతారు. ఒక్కో దర్శనానికి బహుమతి, కానుక పేరుతో లక్షలు జేబులో పడతాయనేది తిరుమలలో అందరూ చెప్పుకునేది. ఇక విఐపి బ్రేక్‌ టికెట్లు మంజూరు చేయించడంలోను పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని తెలుస్తోంది. 
 
ఎల్‌-1 బ్రేక్‌ దర్శనం టికెట్లు బ్లాక్‌లో 30 వేల దాకా పలుకుతోందట. కోటి రూపాయలు ఇస్తే వస్త్రం టికెట్టు తీసిస్తానని తనకు తెలిసిన వారితో ఎవరో బేరం పెట్టారని తిరుపతికి చెందిన ఒక రాజకీయ నాయకుడు బహిరంగంగా చెప్పుకుంటున్నాడు. ఆ మధ్య వైకుంఠ ఏకాదశి రోజున నాలుగు టికెట్ల కోసం ఒక దళారీ లక్షా 25 వేల రూపాయలు తీసుకున్నట్లు బెంగుళూరుకు చెందిన భక్తులు తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇవన్నీ శ్రీవారి దర్శనం పేరుతో జరుగుతున్న అవినీతి తీవ్రతను తెలియజేస్తున్నాయి. దర్శన వ్యాపారంలో ఎందరో దళారులన్నా తితిదే అధికారుల ప్రమేయం లేకుండా జరిగే అవకాశం లేదు. 
 
దర్శనాల పేరుతో జరుగుతున్న అవినీతి ఎన్ని కోట్ల రూపాయలో అంచనా వేయలేం. అందుకే ఎసీబీ అధికారులు తన దృష్టిని అటువైపు సాధించారు. ఇక..ఇంజనీరింగ్‌, మార్కెటింగ్‌ విభాగాల్లో పెద్దఎత్తున అవినీతి జరుగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. తితిదేలో ప్రతి ఒక్కటీ కాంట్రాక్టు మయం చేయడంతో కొందరు అధికారులు, ఉద్యోగులే బినామీ అవతారమెత్తి ఆ పనులు చేసుకుంటున్నారు. గార్డెన్‌, ఫారెస్టులో ఒక సాధారణ ఉద్యోగి బినామీ పేర్లతో కాంట్రాక్టులు చేసి అలాగే సంపాదించారు. ప్రస్తుతం ఎసీబీకి పట్టుబడిన అధికారుల్లో ఒకరు తితిదేకి కార్మికులను సరఫరా చేసే కాంట్రాక్టును బినామీ పేరుతో ఎప్పటినుంచో చేస్తున్నారట. ఇప్పటీకీ ఆయన బినామీ కాంట్రాక్టు కింద పలుచోట్ల కార్మికులు పనిచేస్తున్నారు. ఇక ఇంజనీరిం్‌ విభాగంలో చిన్న చిన్న పనులన్నీ ఆ విభాగంలోని ఇంజనీర్లు, అధికారులే చేస్తున్నారని తెలుస్తోంది. ఎవరి పేరుతోనో ఒక సంస్థను రిజిస్ట్రర్‌ చేసి ఆ పేర్లతోనే టెండర్లు వేసి సునాయాసంగా దక్కించుకుని పనులు చేస్తున్నారు. 
 
మార్కెటింగగ్‌ విభాగం అదో మాయా ప్రపంచం. తితిదేలో అత్యధిక బడ్జెట్‌ ఉన్న విభాగం ఇదే. దాదాపు 700 కోట్ల బడ్జెట్‌ ఉన్న మార్కెటింగ్‌ కొనుగోళ్ళలో అతి తక్కువగా 10 శాతం వేసుకున్నా ఏటా 70 కోట్లు అధికారులు జేబులకు చేరుతున్నట్లు అంచనా. ఇక విజిలెన్స్ విభాగంలోను భారీగా వసూళ్లు జరుగుతున్నాయన్న ప్రచారం ఉంది. హాకర్లు, దుకాణాదారుల నుంచి ఏటా కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విభాగంలోని ఒక అధికారి కోట్లకు పడగలెత్తారన్నది బహిరంగ రహస్యం. ఆయన పేరు కూడా ఎసీబీ జాబితాలో ఉన్నట్లు చెబుతున్నారు. 
 
అన్నింటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కళ్యాణకట్టలో పనిచేసే ఒక చిన్నస్థాయి అధికారి వద్ద కూడా కోట్ల రూపాయల ఆస్తులు బయటపడడం. దీన్ని బట్టే అక్కడ ఎంత అవినీతి జరుగుతుందో అంచనా వేసుకోవచ్చు. ఇన్నాళ్ళు ఎంత సంపాందించినా ఏమవుతుందిలే..అనే ధీమాతో ఉన్న అవినీతి అధికారుల్లో ఇప్పుడు గుబులు పట్టుకుంది. ఎసీబీ దాడులు నిర్వహిస్తుండడమే ఇందుకు కారణం. ఇప్పటికే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కార్యనిర్వహణాధికారి సాంబశివరావే ఎసీబీ అవీనీతి అధికారుల జాబితా ఇచ్చి దాడులు చేయిస్తున్నట్లు కొందరు ఆరోపిస్తున్నారు. 
 
జెఈఓ శ్రీనివాసరాజుతో ఉన్న విబేధాలను దృష్టిలో ఉంచుకుని జెఈఓకు అనుకూంటా ఉన్న అధికారులనే లక్ష్యంగా చేసుకుంటున్నారని కూడా విమర్సిస్తున్నారు. ఎవరు జాబితా ఇచ్చినా సోదాల్లో ఏమీ లభించకుంటే ఎసీబీ చేసేది ఏమీ ఉండదు. ఉద్యోగుల పిల్లలు విదేశాల్లో పనిచేస్తూ సంపాందించిన డబ్బులతో ఆస్తులు కొనుక్కోవచ్చు. ఆ వివరాలు ఎప్పటికప్పుడే యాజమాన్యానికి తెలియజేస్తే ఇలాంటి ఇబ్బందులు ఉండవు. అంతేతప్ప ఎసీబీకి చిక్కిన తరువాత వచ్చినా ప్రయోజనం ఉండదు. 
 
అన్నింటికి మించి అవినీతికి పాల్పడే అవకాశం కల్పించి ఆ తరువాత ఎసీబీ పట్టుకునేదాకా ఆగడం కంటే తితిదేలో మొత్తంగా ఎక్కడెక్కడ అవినీతి జరిగే అవకాశం ఉందో ఆ విభాగాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలి. అవినీతికి పాల్పడుతున్నారన్న అనుమానం ఏ మాత్రం వచ్చినా ఆ అధికారిని అక్కడి నుంచి బదిలీ చేయాలి. ప్రధానంగా దర్సనాల వ్యవహారంలో జరుగుతున్న అవినీతిపై తితిదే నిఘా పెట్టాలి. ఆరోపణలు వచ్చిన అధికారులపై తితిదే ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తే తితిదే ప్రతిష్ట మసబారే పరిస్థితి ఏర్పడదు.