శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ttdj
Last Updated : శుక్రవారం, 20 మే 2016 (12:26 IST)

పరిపాలనాధ్యక్షుడు.... తితిదే ఈవో సాంబశివరావు

తితిదే కార్యనిర్వహణాధికారి.. ఈ పోస్టంటే అందరికీ చాలా ఇష్టం. ఈ పోస్టులో కొనసాగాలని ఎంతోమంది ఐఎఎస్‌లు పోటీలు పడుతుంటారు. అధికారంలో ఉన్న ప్రభుత్వంలో తమకు తెలిసిన వారితో సిఫార్సు చేయించుకుని మరీ తితిదేకి వస్తుంటారు. ఎందుకుంటే స్వయానా కలియుగ వైకుంఠుడు తిరుమల వెంకన్న ఆస్థులను, ప్రతిష్టను కాపాడే ఉద్యోగం కాబట్టి. అంతేకాదు ప్రపంచంలోని విఐపిలు, వివిఐలందరు త్వరగా పరిచయమయ్యే ప్రాంతం కూడా. దీంతో తితిదే ఈఓ పోస్టుకు ఐఏఎస్‌‌లు చేసే ప్రయత్నం అంతా ఇంతా కాదు.
 
ఐఏఎస్‌ల బదిలీలు జరుగుతున్నాయంటే చాలు.. ఇంకేముంది తమకు తెలిసిన మంత్రులతో ఫైరవీలు ప్రారంభిస్తారు. ఎలాగోలా తిరుపతికి పంపించడంటూ తమకున్న పరిచయాలతో కాళ్ళా వేళ్ళా పడతారు. అలాంటి పోస్టుకు చాలారోజుల తర్వాత ఒక నిఖార్సయిన ఈఓ తితిదేకు వచ్చారు. ఆయనే సాంబశివరావు (ఐఎఎస్‌). ఇదేదో ఈయనకు సినిమాలోలా క్యాప్షన్‌లు పెడుతున్నారేమిటో అనుకోకండి. ఆయన పనితీరు అలాంటిది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కొన్నినెలలకే తితిదే ఈఓగా సాంబశివరావు బాధ్యతలు స్వీకరించారు. 
 
సాంబశివరావు సిఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు. ఆ విషయం పక్కన పెడితే పనిలో ముక్కుసూటిగా వ్యవహరిస్తారు. ఏ పనినైనా చేసి తీరాలన్న పట్టుదల ఆయనలో మెండు. తాను ఒక్కడే పనిచేయడం కాదు తన కింద పనిచేసే వారిని పనిచేయించడం ఆయనకు అలవాటు. అదే.. ఆయన్ను తితిదే ఈఓను చేసింది. హైదరాబాద్‌లోని సెక్రటేరియట్‌లో పనిచేసే సమయంలో మంచి అధికారిగా సాంబశివరావు పేరు సంపాదించుకున్నారు. తీసుకున్న జీతాని కన్నా పదిరెట్లు ఆయన పనిచేస్తారన్న మంచి పేరు ఆయనకు లేకపోలేదు. అలా ఆయనకు వచ్చిన మంచిపేరే ఆయన్ను తితిదే ఈఓను చేసింది.
 
తితిదే ఈఓగా బాధ్యతలు స్వీకరించిన అనతి కాలంలోనే ఆయన తితిదేలో ఎన్నో మార్పులు తీసుకువచ్చారు. దళారీల హవా కొనసాగిన తిరుమలలో ఒక్కసారిగా ఆ వ్యవస్థ తగ్గుముఖం పట్టేందుకు తీవ్రంగా కృషి చేశారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేసే నిర్ణయాలు తీసుకున్నారు. తితిదే పాలకమండలి సమావేశంలో సాధారణంగా తితిదే పాలకమండలి ఛైర్మన్‌ నిర్ణయాలే ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఆ నిర్ణయాలను పూర్తిగా ఆమోదించాల్సింది ఈఓనే. భక్తులకు ఏ విధంగా నిర్ణయాలు ఉంటాయో అలాంటి వాటికే ఆయన ఆమోద ముద్ర వేస్తారు.
 
అలాగే శీఘ్రదర్శన టికెట్లను పొందిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే వారి కోసం ప్రత్యేకంగా దగ్గరగా వెళ్ళే క్యూలైన్లను ఏర్పాటు చేశారు. గతంలో శంఖుమిట్ట అతిథి గృహం నుంచి 300 రూపాయలు శీఘ్రదర్శనం టికెట్లు పొందే భక్తులు ఆలయంలోకి వెళ్ళాల్సి ఉంటుంది. శంఖుమిట్ట నుంచి చాలా దూరం భక్తులు క్యూలైన్లలోకి వెళ్ళాల్సిన పరిస్థితి. గతంలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే వారి కోసం ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు  చేశారు. 
 
అలాగే శ్రీవారి ప్రసాదాల కౌంటర్‌ బయటే ఉండడంతో దళారీలు ప్రతిరోజు ఇష్టమొచ్చినట్లు వాటిని తీసుకుని అధిక రేట్లకు విక్రయించేవారు. ఈ విషయాన్ని గమనించిన ఈఓ సాంబశివరావు ప్రసాదాల కౌంటర్‌ను ఆలయంలోపలకు మార్చేశారు. ఆలయంలోని వగపడిలోకి కౌంటర్‌ను మార్చడం వల్ల ప్రసాదాలను తీసుకునే దళారీల బెడద తగ్గింది. తితిదే ఉన్నతాధికారుల వద్ద ప్రసాదాల కోసం సంతకాలు తీసుకునే వారు ఆ సంతకాల స్లిప్పును లోపలికి పంపించాల్సి ఉంటుంది. ఆ స్లిప్పును ఎవరో కొంతమంది సిబ్బంది లోపలికి తీసుకెళతారు తప్ప అందరు తీసుకోరు. దీంతో ప్రసాదాల్లో పెరిగిపోయిన దళారీ వ్యవస్థకు స్వస్థి పలికేలా చేశారు.
 
తితిదే ఈఓ సాంబశివరావు తీసుకుంటున్న నిర్ణయాలపై శ్రీవారి భక్తులే స్వయంగా ఆయన అభినందిస్తున్నారు. గత కొన్నిరోజులకు ముందు జరిగిన డయల్ యువర్‌ ఈఓ కార్యక్రమంలో తితిదే ఈఓను భక్తులే పొగడ్తలతో ముంచెత్తారు. అంతే కాదు తిరుమల పర్యటనకు వచ్చినపుడల్లా సిఎం చంద్రబాబునాయుడు ఈఓను అభినందిస్తున్నారని తితిదే ఉద్యోగులే చెప్పుకుంటున్నారు. అయితే నిజాయితీ, కష్టపడి పనిచేసే వ్యక్తులు ఎక్కడా ఎక్కువ రోజులు ఉండరన్నది అందరికీ తెలిసిన విషయమే. మరి తితిదే ఈఓగా సాంబశివరావు ఎన్నినెలలు ఆ పదవిలో ఉంటారో వేచి చూడాల్సిందే.