శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : శనివారం, 3 ఫిబ్రవరి 2018 (15:35 IST)

జైట్లీ బడ్జెట్‌ సెగలు : బీజేపీ ఎంపీలకు ఓటమి భయం

ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ ప్రజల్లోనే కాకుండా అధికార బీజేపీ నేతల్లో కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ దఫా ఓటమి తప్పదంటూ పలువురు ఎంపీలు తమ సన్నిహ

ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ ప్రజల్లోనే కాకుండా అధికార బీజేపీ నేతల్లో కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ దఫా ఓటమి తప్పదంటూ పలువురు ఎంపీలు తమ సన్నిహితులతో వ్యాఖ్యానిస్తున్నారట. 
 
నిజానికి జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. 'సబ్‌ కా సాథ్‌.. సబ్‌ కా వికాస్' అనే నినాదానికి అనుగుణంగా ఈ బడ్జెట్ రూపకల్పన చేశారని ఆయన సెలవిచ్చారు. అంతేనా, "మనది ప్రజానుకూలమైన బడ్జెట్‌. మీరు నియోజకవర్గ స్థాయిలో ప్రజల్లోకెళ్లి.. ఈ చరిత్రాత్మక బడ్జెట్‌ గురించి వివరించండి" అంటూ బీజేపీ ఎంపీలకు ఆయన పిలుపునిచ్చారు. ఈ పిలుపునకు బీజేపీ ఎంపీల్లో ఏమాత్రం స్పందన లేదట. 
 
గురువారం బడ్జెట్‌ తర్వాత పార్టీ పార్లమెంటరీ సమావేశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించారు. ఇందులో బీజేపీ ఎంపీలంతా హాజరయ్యారు. ఆ సమయంలో మోడీ ఇచ్చిన పిలుపునకు ఏ ఒక్కరూ స్పందించలేదట. 'సబ్‌ కా సాథ్‌.. సబ్‌ కా వికాస్' అనే తన నినాదానికి అనుగుణంగా బడ్జెట్‌ ఉందని మోడీ చెప్పినప్పుడు ఎంపీల్లో ఎలాంటి స్పందనా లేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 
 
మొత్తానికి ఈ బడ్జెట్‌ తర్వాత ఎంపీల్లో అయోమయం పెరిగిందని, ప్రజల్లోకి ఎలా వెళ్లాలో అర్థం కాక సతమతమవుతున్నారని తెలుస్తోంది. 'అసలిప్పుడు ఎంపీలకు పార్లమెంట్‌కు వచ్చేందుకే ఆసక్తి లేదు. ఇక బడ్జెట్‌ ఉత్సాహాన్ని ఎలా ప్రదర్శించగలరు? ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ కూడా ఎన్ని వివరణలిచ్చినా.. ఎంపీలను మెప్పించలేకపోతున్నారు' అని పలువురు సీనియర్లు చెప్పుకొచ్చారు. 
 
పైగా, బడ్జెట్‌ ప్రవేశపెట్టిన రోజే రాజస్థాన్‌లో మూడు సిట్టింగ్‌ స్థానాల్లో అధికార బీజేపీ చిత్తుగా ఓడిపోవడం, తమకు అన్యాయం జరిగిందంటూ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతోపాటు పలు రాష్ట్రాలు నిరసన వ్యక్తం చేయడం.. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి తప్పుకోనుందనే ప్రచారం గుప్పుమనడం.. ఇప్పుడు బీజేపీలో చర్చనీయాంశంగా మారింది. గుజరాత్‌ ఎన్నికలతోనే కేంద్రంలో బీజేపీ సర్కారు పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరగడం ప్రారంభమైందని, రాజస్థాన్‌ ఎన్నికల్లో అది వ్యక్తమైందని ఒక సీనియర్‌ నేత అన్నారు.