శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By chj
Last Modified: సోమవారం, 24 అక్టోబరు 2016 (18:10 IST)

ఐరాస మూడవ ప్రపంచ యుద్ధాన్ని ఆపగలదా? రష్యా ఆ మాటంటే ఏం చేసింది?

నేడు ఐక్యరాజ్య సమితి ఆవిర్భావ దినోత్సవం. అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి మరియు మానవ హక్కులపై సమష్టి కృషి చేసేందుకు ప్రపంచ దేశాలు ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతీయ సంస్థ ఐక్యరాజ్య సమితి. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఏర్పాటు చే

నేడు ఐక్యరాజ్య సమితి ఆవిర్భావ దినోత్సవం. అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి మరియు మానవ హక్కులపై సమష్టి కృషి చేసేందుకు ప్రపంచ దేశాలు ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతీయ సంస్థ ఐక్యరాజ్య సమితి. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఏర్పాటు చేసిన నానాజాతి సమితి రెండన ప్రపంచ యుద్ధాన్ని నివారించడంలో విఫలమవడంతో దానికి ప్రత్యామ్నాయంగా 1945లో ఐక్యరాజ్య సమితి స్థాపించబడింది. ప్రస్తుతం 193 దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్యదేశాలుగా ఉన్నాయి. 
 
ఐక్యరాజ్య సమితిలో ప్రధానంగా 6 విభాగాలున్నాయి. అవి సర్వ ప్రతినిధి సభ, భద్రతా మండలి, సచివాలయం, ధర్మ కర్తృత్వ మండలి, ఆర్థిక- సాంఘిక మండలి, అంతర్జాతీయ న్యాయస్థానం. సర్వప్రతినిధి సభలో ఐక్యరాజ్య సమితిలో ప్రవేశించిన అన్ని దేశాలకు సభ్యత్వం ఉండగా, భద్రతామండలిలో 15 దేశాలకు మాత్రమే సభ్యత్వం ఉంటుంది. అందులో 10 దేశాలు రెండేళ్ళకోసారి ఎన్నిక ద్వారా సభ్యత్వం పొందగా, మరో 5 దేశాలు శాశ్వత సభ్య దేశాలు. అవి అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా.
 
ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరంలో ఉంది. ఐక్యరాజ్య సమితి స్థాపించబడిన అక్టోబరు 24వ తేదీని ప్రతి సంవత్సరం ఐక్యరాజ్య సమితి దినోత్సవంగా జరుపుతుంటారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్ ‘యునెటైడ్ నేషన్స్’ అనే పదాన్ని తొలిసారి ప్రవేశపెట్టాడు. ఐరాస పతాకాన్ని 1947 అక్టోబరు 20న ఆమోదించారు. ఈ పతాకం లేత నీలం, తెలుపు రంగుల్లో ఉంటుంది. పతాకం మధ్యలో ఐరాస చిహ్నమైన ప్రపంచ పటం రెండు ఆలివ్ కొమ్మల మధ్య ఉంటుంది. ఆలివ్ కొమ్మలు శాంతికి చిహ్నం.
 
ఐరాసాకి ఆరు అధికారిక భాషలున్నాయి అవి చైనీస్, ఇంగ్లిష్, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్, అరబిక్. 1945 జూన్ 26న శానిఫ్రాన్సిస్కో నగరంలో జరిగిన సమావేశంలో యూఎన్ చార్టర్ పైన 50 దేశాలు సంతకాలు చేశాయి. ఈ సమావేశానంతరం పోలండ్ 51వ దేశంగా చార్టర్‌పై సంతకం చేసింది. ప్రస్తుతం ఐరాసాలో 193 సభ్యదేశాలున్నాయి. 2011లో దక్షిణ సూడాన్ 193వ సభ్యదేశంగా చేరింది. ఐక్యరాజ్య సమితి ప్రధాన ఆశయాలు 1. యుద్ధాలు జరగకుండా చూడటం 2. అంతర్జాతీయ తగాదాలను శాంతియుతంగా పరిష్కరించడం 3. దేశాల మధ్య స్నేహసంబంధాలను పెంపొందించడం 4. అంతర్జాతీయ బాధ్యతలను అన్ని దేశాలు గౌరవించేటట్లు చేయడం 5. సాంఘిక అభివృద్ధి సాధించి, మానవ జీవితాలను సుఖమయం చేయడం.
 
ప్రత్యేక ఒప్పందాల ద్వారా ఏర్పడిన ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు అంతర్జాతీయ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, విద్యా, వైద్య రంగాలలో పనిచేస్తుంటాయి. ఐక్యరాజ్య సమితి అంగాలలో ఒకటైన "ఆర్ధిక, సామాజిక మండలి" ఈ అనుబంధ సంస్థలకు సహాయ సహకారాలు అందిస్తుంది. ఐక్యరాజ్య సమితి స్థాపించిన నాటి నుండి నేటి వరకు 71 సంవత్సరాల కాలంలో ప్రపంచ శాంతికి దోహదం చేసే ఎన్నో కార్యకలాపాలను నిర్వహించింది. ప్రపంచ దేశాలలో మానవ హక్కుల పరిరక్షణకు తీవ్రమైన కృషి చేసింది. ప్రపంచ దేశాలలో ఆరోగ్య పరిరక్షణకు, కార్మిక హక్కుల పరిరక్షణకు, తల్లుల - పిల్లల జీవన ప్రమాణాలు మెరుగుపర్చుటకు, విద్యా-వైజ్ఞానిక-సాంస్కృతిక పరిరక్షణకు, పర్యావరణం మెరుగుపర్చుటకు, ప్రమాదకరమైన రోగాలు ప్రబలకుండా ఉండుటకు, ఆకలి-దారిద్ర్యం బారిన పడకుండా ఉండుటకు, పారిశ్రామిక అభివృద్ధి కి తన ప్రధాన అంగాల ద్వారా చర్యలు చేపడుతూ సమితి ముందుకు సాగుతుంది. ఐరాస లక్ష్యాలకు అనుగుణంగానే భారతదేశం తన రాజ్యాంగాన్ని విధి విధానాలను రూపొందించుకుంది. ఐరాస ఆశయాలను గౌరవిస్తూ, తమ పూర్తి సహాయ సహకారాలు సమితికి అందిస్తుంది.
 
ఐతే ప్రపంచాన్ని వణికిస్తున్న తీవ్రవాదాన్ని నివారించడంలో సమితి విఫలం అయ్యింది. ఐక్యరాజ్య సమితిలోని అగ్ర రాజ్యాల ఆధిపత్యం కొనసాగుతుండటం చిన్న దేశాలకు శాపంగా మారింది. అగ్ర రాజ్యాల చేతిలో ఉన్న ఐరాస తన లక్ష్యాలను నెరవేర్చలేకపోయింది. కాలం గడుస్తున్న కొద్దీ ఐరాస బలహీనపడుతుందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అగ్రరాజ్యాల మధ్య చిరకాలంగా ఉన్న వర్గ పోరు, ఎడారి దేశాలపై ఆధిపత్యం కోసం అగ్ర రాజ్యాలు పోటీపడటం, తీవ్రవాదం బలపడటం, ఒక దేశం మరొక దేశంపై చేసే దాడులను ఖండించకపోవడం, ఒక దేశం యొక్క అంతర్గత విషయాల్లో మరొక దేశం తల దూర్చడం తదితర కారణాలు ప్రస్తుతం మూడవ ప్రపంచ యుద్ధం రాబోతుందనే భయాన్ని కలిగిస్తున్నాయి. 71 ఏళ్ళ పాటు ప్రపంచ శాంతికి అవిరళమైన కృషి చేసిన ఐరాస మూడవ ప్రపంచ యుద్ధం రాకుండా చూసి, సర్వ మానవాళిని కాపాడగలదని మనసారా భావిద్దాం.