శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : బుధవారం, 4 నవంబరు 2015 (14:14 IST)

వరంగల్ బై పోల్ : కాంగ్రెస్ అభ్యర్థిగా సర్వే.. మారిన ఓరుగల్లు పాలిటిక్స్.. గెలుపెవరిదో?

వరంగల్ పార్లమెంట్ ఉపఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారింది. నామినేషన్లు వేసేందుకు కొన్ని గంటలు మాత్రమే మిగిలివున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని మార్చింది. మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య స్థానంలో మల్కాజ్‌గిరి మాజీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణను బరిలోకి దించింది. దీంతో ఓరుగల్లు రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. 
 
ఈ ఎన్నికల్లో అధికార తెరాస అభ్యర్థిగా పసునూరి దయాకర్ పేరును ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. అలాగే, టీడీపీ - బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా విద్యావేత్త డాక్టర్‌ దేవయ్య బరిలోకి దిగుతుండగా, వామపక్షాల కూటమి తరపున ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ పోటీ చేస్తున్నారు. అయితే, ప్రధాన పోటీ మాత్రం తెరాస, కాంగ్రెస్, టీడీపీ - బీజేపీల మధ్యే కొనసాగనుంది. 
 
ఈ నేపథ్యంలో వరంగల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి, మాజీ ఎంపీ రాజయ్య ఇంట్లో బుధవారం జరిగిన సంఘటన రాజకీయ మార్పులకు కారణమైంది. రాజయ్య కోడలు సారిక తన ముగ్గురు పిల్లలతో సజీవదహనమైన సంఘటన తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. రాజయ్యకు ఆమె కోడలు సారికతో గత కొంతకాలంగా విభేదాలున్నాయి. గతంలో తనను, పిల్లల్ని అత్తింటివారు పట్టించుకోవడం లేదని పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. పైగా, వరంగల్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ను రాజయ్యకు ఇవ్వవద్దని నాలుగు రోజుల క్రితమే సాక్షాత్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సైతం సారిక లేఖ రాసింది. 
 
అయినప్పటికీ కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం రాజయ్యకే టిక్కెట్‌ను కేటాయించింది. దీంతో రాజయ్య మంగళవారం డమ్మీ నామినేషన్ దాఖలు చేసి.. బుధవారం పూర్తిస్థాయిలో నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో తన కోడలు, మనవలు సజీవదహనమైన ఘటన ఆయనను కోలుకోలేని దెబ్బతీశాయి. అయితే, సారిక, ముగ్గురు పిల్లలు సజీవదహనమైన ఘటన ప్రమాదమా? హత్యనా?, ఆత్మహత్యనా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 
 
అయితే, రాజయ్య ఇంట్లో ఘటనతో ఓరుగల్లు ఉపఎన్నిక రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. ఈ ఎన్నికల్లో నిన్నమొన్నటి వరకు తెరాస - కాంగ్రెస్ పార్టీల మధ్యే గట్టి పోటీ ఉంటుందని భావించారు. కానీ, ఈ ఘటనతో పాటు.. కాంగ్రెస్ అభ్యర్థి మారిపోవడంతో పరిస్థితి ఒక్కసారిగా తారుమారైంది. దీనికితోడు తెరాస అభ్యర్థిత్వంపై అసంతృప్తి రగులుగుతోంది. అలాగే, వరంగల్‌కు చెందిన తెరాస నేతలు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్యల ముఠా తగాదాలతో తెరాస సతమతమవుతోంది. 
 
అదేసమయంలో ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే వరంగల్‌కు ఐటీ కంపెనీలు తీసుకువస్తానని బీజేపీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగుతున్న విద్యాధికుడు డాక్టర్‌ పగిడిపాటి దేవయ్య ప్రకటించారు. మొత్తం మీద వరంగల్‌ లోక్‌సభ రాజకీయం రసకందాయంలో పడింది. వరంగల్‌ లోక్‌సభ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థికి విజయం చేకూరుస్తారో ఓటరు తీర్పు కోసం వేచిచూడాల్సిందే.