మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Selvi
Last Updated : బుధవారం, 18 నవంబరు 2015 (16:08 IST)

జగన్ జైలు నుంచి వచ్చాక షర్మిల ఎక్కడికెళ్లింది.. తెలంగాణాలోనూ కనిపించలేదే?!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల గురించే ప్రస్తుతం జోరుగా చర్చ సాగుతోంది. జగన్ అరెస్టయి జైలులో ఉన్న సమయంలో పార్టీ కేడర్‌కు దిశానిర్దేశం చేసి.. పార్టీకి జీవం పోసిన షర్మిల ప్రస్తుతం కానరాకపోయింది. ఓదార్పు యాత్ర పేరుతో రాష్ట్రమంతా తిరిగి పార్టీకి క్రేజ్ పెంచిన షర్మిల.. ఏపీ, తెలంగాణల్లోనూ యాత్రలు చేసిన సంగతికి అందరికీ బాగానే గుర్తుండివుంటుంది. 
 
అయితే ఒక్కసారిగా అన్న జైలు నుంచి విడుదల కావడంతో షర్మిల యాక్టివ్‌‌గా పార్టీ కార్యకలపాల్లో పాలుపంచుకోవట్లేదు. ఆమె తెలంగాణ బాధ్యతలు స్వీకరించినా తెలంగాణలో జరుగుతున్న వరంగల్‌ ఉపఎన్నికల్లోనైనా ఆమె కనిపిస్తారనుకుంటే ఆమె ఊసే ఎవ్వరు ఎత్తడం లేదు.
 
వరంగల్ ఉప ఎన్నికలను అన్నీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రచార గడువు ముగుస్తుండడంతో.. అగ్రపార్టీల నాయకులంతా రంగంలోకి దిగారు. మరి తెలంగాణలో కేడర్‌ లేకపోయినా వైకాపా కూడా రేసులో ఉంది. మరి ఆ పార్టీకి అన్నీ తానే కాబట్టి అధినేత జగన్‌ స్వయంగా రంగంలోకి దిగారు. అయితే జగన్‌ సోదరి షర్మిల ఎందుకు ఈ ఎన్నికలో ప్రచారానికి రాలేదన్న ప్రశ్నలు వైకాపాలోనే ఉత్పన్నమవుతున్నాయి. 
 
షర్మిలకు తెలంగాణలో పార్టీ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఎప్పుడో ప్రకటించినా... తెలంగాణలో కీలకమైన ఉప ఎన్నికలు జరుగుతున్నా.. షర్మిల అడ్రస్ కూడా తెలియట్లేదు. జైలులో ఉన్నప్పుడు.. షర్మిల ఓదార్పు యాత్ర చేస్తున్నప్పుడు వైకాపాకు ఉన్న క్రేజ్.. ప్రస్తుతం జగన్ బయటికొచ్చాక అంతా తగ్గిపోయిందని.. షర్మిల ముందులా పార్టీ కార్యకలాపాల్లో పాలుపంచుకుంటే ఆ క్రేజే వేరని వైకాపా శ్రేణుల్లో టాక్ వినిపిస్తోంది.