శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : శుక్రవారం, 29 జనవరి 2016 (11:55 IST)

స్మార్ట్ సిటీ లిస్టులో వరంగల్‌ పేరు లేకపోవడానికి కేసీఆరే కారణం?

కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీల జాబితాను అధికారికంగా ప్రకటించింది. ఇందులో తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక్క ప్రాంతాన్ని కూడా ఎంపిక చేయలేదు. కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రెండు ప్రాంతాలను ఎంపికచేశారు. అయితే, తెలంగాణ ప్రాంతం నుంచి వరంగల్‌ను స్మార్ట్ సిటీల జాబితాలో చేర్చుతారని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ, అది ఎండమావిగానే మిగిలిపోయింది. దీనికి కారణం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయమే ప్రధాన కారణంగా ఉంది. 
 
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రకటించిన స్మార్ట్‌ సిటీల జాబితాలో తెలంగాణకు చోటు దక్కలేదు. తెలంగాణ నుంచి ఈ పోటీలో పాల్గొన్న ఏకైక నగరం వరంగల్‌.. కటాఫ్‌ 55 పాయింట్లకుగాను 54.79 పాయింట్లతో 23వ స్థానంలో నిలిచింది. తెలంగాణ నుంచి హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌లను ప్రతిపాదించాలని సర్కారు భావించినప్పటికీ.. రెండు ప్రతిపాదనలకే అవకాశం ఉండటంతో హైదరాబాద్‌, వరంగల్‌ నగరాలను పరిశీలించాలని కోరింది.
 
అయితే, ఆ తర్వాత మనసు మార్చుకున్న సీఎం కేసీఆర్‌.. హైదరాబాద్‌ వంటి నగరాలను స్మార్ట్‌ సిటీలుగా కాకుండా స్మార్ట్‌ మెట్రోలుగా తీర్చిదిద్దాలని కేంద్రానికి సూచించారు. ఈ పథకం నుంచి హైదరాబాద్‌ను తొలగించి, కరీంనగర్‌ను చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఆయన విజ్ఞప్తిని కేంద్రం పరిగణనలోకి తీసుకోవటంతో స్మార్ట్‌ సిటీ పోటీ నుంచి హైదరాబాద్‌ తప్పుకొంది. కొత్తగా వచ్చిన కరీంనగర్‌ ఈ పోటీలో పాల్గొనేందుకు ప్రతిపాదనలు సమర్పించలేదు. 
 
దీంతో తెలంగాణ నుంచి ఏకైక నగరంగా వరంగల్‌ పోటీలో నిలిచింది. కానీ, 0.21 మార్కుల తేడాతో టాప్‌ ట్వంటీకి మూడడుగుల దూరంలో నిలిచిపోయింది. అందుకే తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక్క నగరాన్ని కూడా ఎంపిక చేయలే దని విలే కరులు వెంకయ్యనాయుడు వివరణ ఇచ్చారు. మొత్తం తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం కారణంగా తెలంగాణ రాష్ట్రంలోని ఏ ఒక్క ప్రాంతం కూడా స్మార్ట్ సిటీల జాబితాలో చోటుదక్కించుకోలేక పోయింది.