శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Selvi
Last Updated : శుక్రవారం, 24 ఫిబ్రవరి 2017 (17:36 IST)

ఓపీఎస్ సీఎం.. డిప్యూటీ సీఎంగా పళని స్వామి..? చిన్నమ్మ భర్త నటరాజన్ పక్కా ప్లాన్? మరి శశి శపథం?

అన్నాడీఎంకే పార్టీకి క్రేజ్ రోజు రోజుకీ తగ్గిపోతోంది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. అమ్మ మరణించాక మెల్లగా ఆమె స్థానంలో కూర్చునేందుకు చిన్నమ్మ శశికళ ప్లాన్ వేసినా.. ఆ ప్లా

అన్నాడీఎంకే పార్టీకి క్రేజ్ రోజు రోజుకీ తగ్గిపోతోంది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. అమ్మ మరణించాక మెల్లగా ఆమె స్థానంలో కూర్చునేందుకు చిన్నమ్మ శశికళ ప్లాన్ వేసినా.. ఆ ప్లాన్‌కు మాజీ సీఎం పన్నీర్ సెల్వం గండికొట్టారు. దీంతో చిన్నమ్మ జైలుకు వెళ్లింది. ఓపీఎస్ ఇంటికి వెళ్లారు. కానీ శశికళ నియమించిన పళనిస్వామి మాత్రం ప్రజల బలాన్ని సొంతం చేసుకోలేకపోతున్నారు. 
 
ఎమ్మెల్యేల బలంతో సీఎం పోస్ట్ వచ్చినా ప్రజా వ్యతిరేకత మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఆయనకే కాకుండా ఆయనకు మద్దతిచ్చిన ఎమ్మెల్యేలకు కూడా సొంత నియోజక వర్గాల్లో చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీన్లోకి చిన్నమ్మ భర్త నటరాజన్ వచ్చారు. దినకరన్‌కు పార్టీలో మద్దతు తగ్గడం.. జయలలిత అన్నయ్య కుమారుడు దీపక్ కూడా వేదనిలయం విషయంలో తమకే హక్కులున్నాయని చెప్పేయడంతో ఇక లాభం లేదనుకున్న నటరాజన్ చక్రం తిప్పేందుకు సన్నద్ధమవుతున్నట్లు పోయెస్ గార్డెన్ వర్గాల సమాచారం. ఇందులో భాగంగా తమిళనాడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఓపీఎస్‌కు మళ్లీ సీఎం పదవిని అప్పగించి.. డిప్యూటీ సీఎంగా పళని స్వామిని నియమిస్తే పార్టీకి కాస్త గౌరవం దక్కుతుందని నటరాజన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
 
పంతానికి పోయి పన్నీరును కూర్చోబెట్టకుండా.. పళనిని కూర్చోబెట్టి.. లేనిపోని ఇబ్బందులను చిన్నమ్మ కొనితెచ్చుకుందని నటరాజన్ సన్నిహితులతో వెల్లడించినట్లు సమాచారం. ఇకపై ఎన్ని ప్రయత్నాలు చేసినా శశికళ సీఎం పదవిని దక్కించుకునే అవకాశం లేదు. అందుచేత పార్టీ పేరును కాపాడుకోవడం ఉత్తమమని నటరాజన్ ప్లాన్ చేస్తున్నారు. దీనిపై చిన్నమ్మతో జైలులో చర్చలు కూడా జరుపుతున్నట్లు తెలుస్తోంది. 
 
పార్టీలో లుకలుకలు.. ప్రజల వ్యతిరేకతతో చెడ్డపేరు సంపాదించడం కంటే కామ్‌గా పన్నీరుకే పట్టం కట్టేస్తే బెస్ట్ అంటూ నటరాజన్ శశికి నచ్చజెప్తున్నట్లు సమాచారం. ఇలా చేస్తే చిన్నమ్మ జైలు నుంచి రిలీజైన తర్వాత  అన్నాడీఎంకే పార్టీ పగ్గాలైనా ఆమె చేతిలో ఉంటాయని.. అన్నాడీఎంకే కార్యకర్తల మద్దతు ఆమెకు లభిస్తుందని నటరాజన్ భావిస్తున్నారు. మరి అమ్మ సమాధిపై శపథం చేసి మరీ బోనులోకి వెళ్ళిన చిన్నమ్మ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.