శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By JSK
Last Modified: సోమవారం, 20 జూన్ 2016 (14:26 IST)

ఏటీఎం‌లోనే నకిలీ నోట్లు వస్తే...? ఇలా చేయండి!!

మీరు డ‌బ్బులు డ్రా చేయ‌డానికి ఏటీఎంకి వెళ‌తారు. అక్క‌డ మిష‌న్ నుంచి డ్రా చేసిన మొత్తంలో న‌కిలీ నోట్లు ఉంటే... ఏం చేయాలి. కంగారుప‌డి వాటిని తీసుకుని బ్యాంకుకు ప‌రుగులు పెట్టొద్దు. ఈ నోట్లను బ్యాంకుకు తీసుకొని వెళ్ళినా బ్యాంకు వారు మాకు సంబంధం లేదంటూ చ

మీరు డ‌బ్బులు డ్రా చేయ‌డానికి ఏటీఎంకి వెళ‌తారు. అక్క‌డ మిష‌న్ నుంచి డ్రా చేసిన మొత్తంలో న‌కిలీ నోట్లు ఉంటే... ఏం చేయాలి. కంగారుప‌డి వాటిని తీసుకుని బ్యాంకుకు ప‌రుగులు పెట్టొద్దు. ఈ నోట్లను బ్యాంకుకు తీసుకొని వెళ్ళినా బ్యాంకు వారు మాకు సంబంధం లేదంటూ చేతులు దులిపేసుకుంటారు. మరి ఇలాంటి సమయాల్లో ఏమి చేయాలి? 
 
ఏటీఎం నుండి న‌కిలీ నోట్లు వచ్చాయని మీరు గుర్తించగానే, వెంట‌నే అక్క‌డ ఉన్న సెక్యూరిటీ గార్డుకు ఈ విష‌యాన్ని తెలియ‌జేయాలి. సెక్యూరిటీ గార్డు వ‌ద్ద ఉండే రిజిస్ట‌ర్‌లో మీరు డ్రా చేసిన మొత్తం, అందులోని న‌కిలీ నోట్లు ఎన్ని ఉన్నాయి, ఏయే నోట్లు వ‌చ్చాయి, వాటి సీరియల్ నంబ‌ర్లు, లావాదేవీ నిర్వ‌హించిన స‌మ‌యం, తేదీ, ఏటీఎం ఉన్న ప్రదేశం, ఏటీఎం స్లిప్, ట్రాన్‌సాక్ష‌న్ నంబ‌ర్‌ లాంటి వివ‌రాలను ఎంట‌ర్ చేసి గార్డు సంత‌కం తీసుకోవాలి. 
 
ఒకవేళ సెక్యూరిటీ గార్డు లేకుంటే... ఏటీఎం నుండే బ్యాంకు కస్టమర్ కేర్‌కు కాల్ చేసి ఈ విషయాన్ని తెలియజేయాలి. ఈ వివరాలను మీ స్మార్ట్ ఫోన్‌లో భద్రపరుచుకోవడం లేదా ఫోటోలు తీసుకొని పెట్టుకోవడం మంచిది. ఈ వివ‌రాల‌కు సంబంధించిన జిరాక్స్ (ఫోటో కాపీ) తీసి బ్యాంకు మేనేజ‌ర్‌కు ఫిర్యాదు చేయాలి. పైన చెప్పిన పూర్తి వివ‌రాల‌తో కూడిన ఓ లెట‌ర్‌ను రాత పూర్వకంగా, జిరాక్స్ పత్రాలను జత చేసి మేనేజ‌ర్‌‌కు ఇవ్వాలి. మీ ద‌గ్గ‌ర ఉన్న న‌కిలీ నోట్ల‌ను స్కాన్ చేసి అవి నకిలీ నోట్ల‌నే విష‌యాన్ని ధృవీకరించిన తరువాత వాటికి బ‌దులుగా మీకు అంతే మొత్తంలో డ‌బ్బును ఇస్తారు.
 
స‌మ‌స్య ఉంటే... ఆర్.బి.ఐకి కూడా ఫిర్యాదు చేయొచ్చు 
ఆర్‌బీఐ నిబంధనలను అనుసరించి ప్ర‌తి బ్యాంకు.. పైన చెప్పిన నిబంధ‌న‌లకు కట్టుబడి ఉంటుంది. ఒక‌వేళ బ్యాంకు వారు సహకరించకపోతే స్థానిక పోలీసు స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసే హ‌క్కు బాధితునికి ఉంటుంది. ఆర్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌‌లో ఉన్న మెయిల్ ఐడీకి త‌మ ఫిర్యాదుతో కూడిన లేఖ‌ను మరియు కుదిరితే ఫోటోలను అటాచ్ చేసి మెయిల్ పంపించ‌వ‌చ్చు. లేదంటే స్థానికంగా ఉన్న బ్యాంకింగ్ అంబుడ్స్‌మ‌న్‌కు మీ బ్యాంకు పైన ఫిర్యాదు చేయ‌వ‌చ్చు. ఆర్‌బీఐ లేదా బ్యాంకింగ్ అంబుడ్స్‌మ‌న్ అధికారులు స్పందించి త‌క్ష‌ణ‌మే చ‌ర్య తీసుకొని మీకు తగిన న్యాయం చేస్తారు.
 
కొన్ని ఏటీఎంలు బ్యాంకులోనే ఉంటాయి. అలాంటి ఏటీఎంలలో డబ్బును డ్రా చేయడం చాలా మంచింది. ఎందుకంటే ఖాతాదారులు బ్యాంకులో జత చేసిన డబ్బును బ్యాంకు వారు ఒకటికి రెండుసార్లు చెక్ చేసి మరి తీసుకుంటారు. ఆ డబ్బునే వీరు తిరిగి ఏటీఎంలో పెడతారు. అందుకే బ్యాంకులో ఉండే ఏటీఎంలో డబ్బును డ్రా చేయడం చాలావరకు సురక్షితం. ఇక ఏటీఎంల వ‌ద్ద త‌స్మాత్ జాగ్ర‌త్త‌.