శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pyr
Last Updated : శుక్రవారం, 15 మే 2015 (17:32 IST)

ఆర్టీసి సమ్మెతో లాభపడిందెవరు? నష్టపోయిందెవరు? రూ.100 కోట్ల భారం జనానికి..!!!

ఆర్టీసి సమ్మెతో లాభపడిందెవరు? నష్టపోయిందెవరు? వారం రోజులపాటు జరిగిన సమ్మె డ్రామాలలో ఫిట్మెంట్ కార్మికులకు వస్తే.. పొలిటికల్ బెనిఫిట్ అధికార పార్టీలకు దక్కింది. నష్టం, కష్టం పరోక్షంగా తెలుగురాష్ట్రాల ప్రజలకు మిగలనుంది. కనీసం రూ. 100 కోట్ల భారం ప్రయాణీకులపై పడనున్నది. ఇక దీనిని ఆర్టీసీ ముక్కుపిండి ప్రయాణీకుల నుంచి రాబట్టడమే తరువాయి. సమయస్పూర్తి కొరవడడం, పోటీ రాజకీయాలతో ఇద్దరు చంద్రులు జనానికి బాదుడు మిగిల్చారు. 
 
రెండు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఇద్దరూ చంద్రులే. ఇద్దరు ప్రతిభావంతులే. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నవారే అయినా సరే జనాన్ని బాదేయనున్నారు. కార్మికులున్న చోట జీతభత్యాల కోసం సమ్మెలు సర్వసాధారణం. వారిని మేనేజ్ చేయడమే ప్రభుత్వాలు, సంస్థల పని. అక్కడ తప్పటడుగులు వేస్తే భారం పడే జనం మీదే పాలకుల మీద కాదనడానికి ఆర్టీసీ సమ్మె మంచి ఉదాహరణ. ఆర్టీసీ కార్మికులు రెండు ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేశారు. అయితే దానిపై రెండు ప్రభుత్వాలూ పట్టీపట్టనట్లే వ్యవహరించాయి.
 
కార్మికుల కోరికలను కనీసం పరిశీలించకుండానే వదిలేశారు. వారి కోరికల్లో న్యాయసమ్మతం ఎంత వరకూ ఉందనే విషయాన్ని కనీసం పట్టించుకోలేదు. సంస్థ లాభనష్టాలను, వారి డిమాండ్లను బేరీజు వేసుకుని ఎంత ఇవ్వగలుగుతాం. ఎంత ఇవ్వలేం అనే అంశాలను తేల్చాలి. అయితే ఆ దిశగా ప్రయత్నాలు జరగలేదు. తీరా ఆ సమ్మె ప్రారంభమైన తరువాత చర్చలు మొదలు పెట్టారు. ఎస్మా ప్రయోగిస్తామని బీరాలు పలికారు. చివరకు జరిగిందేమిటి? వారం రోజుల పాటు సమ్మె. దీని విలువ రూ. వంద కోట్లు. 
 
కార్మికులు 43శాతం పిట్ మెంట్ బెనిపిట్ కావాలని కోరారు. దానిలో ఎంత ఇవ్వగలుతాం. ఎంత ఇవ్వలేం అనే అంశాలను పరిశీలించాల్సిన ప్రభుత్వాలు చాలా పేవలంగా వ్యవహరించాయి. 43 శాతం ఇచ్చేశారు. ఇక తెలంగాణ ప్రభుత్వమైతే అదేదో నజరానా ఇచ్చినట్లు 44శాతం ఇచ్చేసింది. వారు ఎంత ఇచ్చారు. వీరు ఎంత తీసుకున్నారనే విషయం పక్కన పెడితే. ఎప్పుడు ఇచ్చారనేది ప్రధాన అంశం. 
 
ఎప్పుడు ఇచ్చారు.? కోర్టు ఆర్టీసీ సమ్మెను చాలా సీరియస్ గా తీసుకుని, వెంటనే సమ్మె విరమించాలని ఆదేశించింది. ఆర్టీసీ కార్మికులు ఇరుకున పడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి పరిస్థితులలో రెండు ప్రభుత్వాలు పోటీ పడి ఫిట్ మెంట్ ను ప్రకటించేశాయి. అంత ఫిట్ మెంట్ ఇవ్వగలిగే సత్తా ఉన్నప్పుడు వారం రోజుల వరకూ ఎందుకు సమ్మె జరగనిచ్చారు..? తరువాత అంగీకరించడం వలన ప్రభుత్వానికి ఒరిగిందేమిటీ? ఆర్టీసీకి రూ. 100 కోట్ల నష్టం. అదే ప్రయాణీకులపై భారంగా మోపనున్నారు. 
 
ఈ వంద కోట్ల రూపాయల భారానికి భాద్యులెవరు..? సమ్మె చేసిన కార్మికులా..? నిర్లక్ష్యంగా వ్యవహరించిన చివరకు చేతులెత్తేసిన ప్రభుత్వాలా..? చర్చలు మొదలయినప్పటి నుంచి ప్రభుత్వాలు ఒకరు 23 శాతం ఫిట్మెంట్ అంటే మరొకరు 27 శాతం అనుకుంటూ చంద్రబాబు, చంద్రశేఖర్ రావులు పోటీ పడ్డారు. చివరకు చంద్రబాబు 43 శాత ప్రకటిస్తే.. తెలంగాణ ప్రభుత్వం ఒకటెక్కువ అంటూ 44 శాతం ప్రకటించింది. పోటీపడి ప్రభుత్వాలు పాలన చేస్తే ఆ పాపం ప్రజలపై పడుతుందనడానికి ఇంతకంటే ఉదాహరణ మరొకటి లేదు.