శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Venu
Last Modified: మంగళవారం, 11 ఏప్రియల్ 2017 (14:23 IST)

జగన్ భజనలో కాంగ్రెస్... అప్పుడు కేసులు పెట్టారు... ఇప్పుడు కాళ్లు పట్టుకుంటారా...?

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, అలాగే శాశ్వత మిత్రులు ఉండరనే నానుడిని నిజం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ డిపాజిట్లు గల్లంతై, అడ్రస్ లేకుండా పోయిన జాతీయ పార్టీ ఇప్పుడు

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, అలాగే శాశ్వత మిత్రులు ఉండరనే నానుడిని నిజం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ డిపాజిట్లు గల్లంతై, అడ్రస్ లేకుండా పోయిన జాతీయ పార్టీ ఇప్పుడు ఉనికి కోసం పోరాడుతున్న సంగతి విదితమే. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో అటు చంద్రబాబు, ఇటు జగన్మోహన్, మధ్యలో పవన్ కళ్యాణ్‌లతో మరే ఇతర పార్టీ నాయకుడికి పొలిటికల్ మైలేజి లేకుండా పోయింది. 
 
స్వయంగా ప్రభ కోల్పోవడంతో ఎవరో ఒకరి ఆసరా అయిన కాంగ్రెస్ పార్టీకి పవన్ కళ్యాణ్ నుండి అంత మద్దతు ఉండకపోవచ్చు. అన్న ప్రజారాజ్యంలో యువరాజ్యం అధిపతిగా ఉన్న పవన్ కళ్యాణ్ అప్పటి నుండే కాంగ్రెసోళ్ల పంచెలూడదీసే కార్యక్రమంలో తలమునకలై ఉన్నాడు. ఇప్పటికీ ఆయన పంథాలో మార్పు లేదనుకోండి.
 
కనుక గత్యంతరం లేని పరిస్థితుల్లో తామే కేసులు పెట్టి, జగన్ మోహన్ రెడ్డిని జైల్లో పడేట్లు చేసిన కాంగ్రెస్ పార్టీ జగన్ మోహన్ రెడ్డిని సమ్మగా దువ్వే పనిలో పడ్డాయి. ఎట్టెట్టా అంటారా...? చంద్రబాబు కేవలం వెన్నుపోటుతో సిఎం అయ్యాడని, కానీ జగన్మోహన్‌రెడ్డి ప్రజల ప్రేమతో, అభిమానంతో ప్రతిపక్ష నాయకుడు అయ్యాడని కాంగ్రెస్ నేత సి రామచంద్రయ్య ఇప్పటికే వ్యాఖ్యానించేసారు. సరేలే, స్థానిక నేత, అన్ని పార్టీలు తిరిగిన వ్యక్తి, మరో జంపింగ్‌కు సిద్ధమవుతున్నారనుకునేలోపుగానే... సాక్షాత్ దిగ్విజయ్ సింగ్ సైతం వైఎస్ఆర్‌సిపి నేతకు మద్దతుగా మాట్లాడేస్తున్నారు. తనపైనే ఎన్నో ఆర్థిక ఆరోపణలు ఉన్న చంద్రబాబుకు జగన్‌ను విమర్శించే హక్కు లేదనేసారు. ఇంక ఇంతకంటే కావాల్సిందేముంది...?
 
అధినేత్రి కనుసైగ లేనిదే కాలైనా కదపని కాంగ్రెస్ శ్రేణుల కఠోర క్రమశిక్షణ గురించి ప్రజానీకానికి తెలియంది కాదు. ఇప్పుడు ఈ రామచంద్రయ్యగారు, దిగ్విజయ్ గారు సోనియాకు తెలియకుండానే ఇక్కడ ఈ జగన్ భజన చేస్తున్నారా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. చిన్న కొసమెరుపు ఏంటంటే... రాహుల్ గాంధీ కూడా త్వరలో జగన్ మోహన్ రెడ్డితో భేటీ అవుతారని సమాచారం. అంతా సోనియా మాయ... మరి దీనిపై పవన్ కళ్యాణ్ ఏమంటారో, చంద్రబాబు నాయుడు ఏం చేస్తారో... వెయిట్ అండ్ సీ.