శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By TJ
Last Modified: మంగళవారం, 26 జూన్ 2018 (15:01 IST)

కుప్పంలో తిరుగుతున్న మంత్రి నారా లోకేష్... ఎందుకు?

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గంలో నారా లోకేష్‌ పర్యటన టిడిపి నేతల్లో నూతన ఉత్తేజాన్ని నింపింది. తెలుగు తమ్ముళ్ళ మధ్య ఉన్న అంతర్గత విభేధాలను పోగొడుతూ పార్టీ పటిష్టత కోసం అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిస్తూ లోకేష్‌ రెండురోజుల పర్యటన సాగింద

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గంలో నారా లోకేష్‌ పర్యటన టిడిపి నేతల్లో నూతన ఉత్తేజాన్ని నింపింది. తెలుగు తమ్ముళ్ళ మధ్య ఉన్న అంతర్గత విభేధాలను పోగొడుతూ పార్టీ పటిష్టత కోసం అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిస్తూ లోకేష్‌ రెండురోజుల పర్యటన సాగింది. తెలుగుదేశంపార్టీకి కంచుకోటగా ఉన్న కుప్పంలో తండ్రి ప్రారంభించాల్సిన అభివృద్థి కార్యక్రమాలను కుమారుడు లోకేష్‌ ప్రారంభిస్తూ ప్రజలకు మేమున్నామన్న భరోసా ఇస్తూ చిత్తూరుజిల్లాలో లోకేష్‌ రెండు రోజుల పాటు పర్యటించారు.
 
కుప్పం. తెలుగుదేశం పార్టీకి కంచుకోట. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా చంద్రబాబునాయుడు మాత్రం ఈ నియోజకవర్గంలో ప్రతి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలుపొందుతారు. లక్ష నుంచి లక్షా 50వేల మధ్య మెజారిటీ చంద్రబాబుకు వస్తుందంటే తెలుగుదేశం పార్టీపైనా, బాబుపైన కుప్పం ప్రజలకు ఉన్న నమ్మకం ఎలాంటిదో చెప్పనవసరం లేదు. కుప్పంలో చంద్రబాబును ఓడించడం ఏ పార్టీకి సాధ్యం కాదన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ఎప్పుడూ బిజీగా ఉన్నా కుప్పం ప్రజలను మాత్రం మరిచిపోరు. 
 
ఎమ్మెల్యేగా కుప్పంలో జరగాల్సిన అభివృద్థి మొత్తాన్ని చేస్తూనే, ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తుంటారు. గత కొన్నినెలల ముందు వరకు చంద్రబాబునాయుడుకు బదులు టిడిపిలోని కేబినెట్ మంత్రులు కుప్పంలో పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కారంవైపు తీసుకెళ్ళేవారు. ప్రభుత్వం నుంచి ఇళ్ళ స్థలాలు, ఇళ్ళ నిర్మాణాలు, విద్యుత్ సరఫరా, మురికి కాలువల ఏర్పాటు, మరుగుదొడ్ల నిర్మాణం, మౌలిక వసతులు ఇలా ఎన్నింటినో కుప్పం నియోజకవర్గంలోని ప్రజలకు అందిస్తూ వస్తున్నారు చంద్రబాబు. కుప్పం అభివృద్థిపై వీడియో కాన్ఫరెన్స్‌లు కూడా నిర్వహించేవారు. అయితే తన కుమారుడు లోకేష్‌ మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో కుప్పం బాధ్యతలను చంద్రబాబు లోకేష్‌కు అప్పగించారు. కుప్పంలో జరిగే అభివృద్థి కార్యక్రమాలను స్వయంగా లోకేష్‌ పర్యవేక్షిస్తున్నారు. 
 
అభివృద్థి కార్యక్రమాలను లోకేషే ప్రారంభిస్తున్నారు. రెండు నెలలకో, మూడునెలలకో ఒకసారి కుప్పంలో పర్యటిస్తూ అభివృద్థిపై అధికారులతో సమీక్షా సమావేశాలను నిర్వహిస్తూ వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. కోర్ కమిటీ మీటింగ్‌లు, పార్టీ పటిష్టత కోసం నాయకులు, కార్యకర్తలు అనుసరించాల్సిన విధానాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు లోకేష్‌. కుప్పంలో టిడిపి నేతలు, కార్యకర్తల మధ్య అంతర్గత విభేధాలు కొనసాగుతున్నాయని తెలుసుకున్న లోకేష్‌ వారిని ఒకేతాటిపైకి తీసుకొచ్చి పార్టీని మరింత ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యతను వివరించే ప్రయత్నం చేస్తున్నారు. 
 
రచ్చబండలపై కూర్చుని లోకేష్‌ ప్రజా సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తనకు తెలిసిన వారిని పేరు పెట్టి పిలుస్తూ, తెలియని వారిని అన్న, తమ్ముడు, అక్కా, చెల్లి అని సంబోధిస్తూ ఆప్యాయంగా పిలుస్తూ తమ కుటుంబంలో ఒకరుగా లోకేష్‌ మాట్లాడుతుండడం ప్రజలను మరింత దగ్గర  చేస్తోంది. మొత్తం చిత్తూరు జిల్లాలో లోకేష్‌ రెండురోజుల పర్యటన కుప్పంలోని టిడిపి నాయకులు, కార్యకర్తలతో నూతన ఉత్సాహాన్ని నింపుతోంది.