గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pyr
Last Updated : మంగళవారం, 12 మే 2015 (21:10 IST)

చంద్రబాబుకు అమరావతిలో ఇల్లు కట్టేందుకు స్థలం దొరకలేదా.. ? హైదరాబాద్ లోనే ఎందుకు..?

చంద్రబాబు తన సొంత ఇంటికి శంఖుస్థాపన చేశారు. కానీ తాను ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్ర పరిధిలో కాదు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో.. ఇదే అందరికీ అనుమానం రేకెత్తిస్తోంది. తన కలల రాజధాని అమరావతిలో ఇల్లుకట్టుకోలేకపోతున్నారా.. ? లేక ఆయనకు అక్కడ ఇల్లు కట్టడానికి ఇష్టం లేదా... ? ఇష్టముంటే తాను ఎంతో గొప్పగా చెప్పుకునే రాజధాని సమీపంలో ఎక్కడో ఓ చోట ఇల్లు కట్టుకోవచ్చుగా..! హైదరాబాద్ లో కట్టడానికి ఎందుకు శంఖుస్థాపన చేశారు..? ఏం ఆయన కలలు కనే రాజధానిపై నమ్మకం లేదా..? లేక అక్కడేమైనా స్థలం కొరత వచ్చిందా..? మాటలు చెప్పేటందుకేనా? తాను పాటించేందుకు కాదా..! ఇలా ఆయన హైదరాబాద్ లో ఇంటికి శంఖుస్థాపన చేసినప్పటి నుంచి ఎంతో మందికి ఎన్నెన్నో అనుమానాలు కలుగుతున్నాయి. అసలు చంద్రబాబు తాను కోరుకున్న రాజధానిలో ఇల్లు కట్టలేకపోతున్నారు. ఎందుకు? 
 
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన తరువాత, అంతకు ముందు నుంచే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధానిపై ఉపన్యాసాలు దంచేస్తున్నారు. హైదరాబాద్ ను తలదన్నేలా రాజధాని నిర్మిస్తామని చెబుతున్నారు. ప్రస్తుతం కృష్ణా నది తీరాన సింగపూర్, జపాన్, చైనాలోని ప్రముఖ నగరాలను తలదన్నెలా రాజధానిని నిర్మిస్తానని చెబుతున్నారు. ఆ ప్రయత్నాలు మొదలు పెట్టారు. మరి ఆయన మాత్రం తన సొంత ఇంటి నిర్మాణానికి ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో భూమిపూజ చేశారు. వ్యక్తిగతంగా ఇల్లు కట్టుకోవడం పూర్తిగా వారి వ్యక్తిగత విషయం. కానీ గొప్ప రాజధానిని కాదని ఎందుకు హైదరాబాద్ లో ఇల్లుకడుతున్నట్లనే అనుమానం సహజంగా కలుగుతుంది. ఇక్కడేమో శాసనసభ, ఉన్నతాధికారుల క్వార్ట్లర్ల నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. 
 
అధికారులను తరలిపొమ్మని చెబుతున్నారు. కానీ ఆయన మాత్రం హైదరాబాద్ లో ఇల్లు కడుతున్నారు. ఆయన సమాజాన్ని ప్రభావితం చేయగలిగే స్థానంలో ఉన్న వ్యక్తి ఆయన ఏ పని చేసినా చర్చకు దారితీస్తుంది. చంద్రబాబు ఇంటి విషయంలో కూడా అంతే. హైదరాబాద్ ను తల్లదన్నేలా ప్రపంచంలోనే పేరు ప్రతిష్టలు కలిగిన రాజధానిని నిర్మిస్తానని చెప్పారు. 2019కల్లా మొదటి దశ పూర్తవుతుందని ప్రకటించారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి అంత గొప్ప రాజధాని నిర్మిస్తున్న ప్రాంతంలో కాకుండా....హైదరాబాద్‌లో ఇంటి నిర్మాణానికి పూనుకున్నారు. అంటే చంద్రబాబు చెబుతున్న మాటలన్నీ ప్రజల కోసమే తప్ప...తనకు సైతం నమ్మకం లేదని అర్థం చేసుకోవాల్సివుంటుందనే విమర్శలు ఉన్నాయి. అంటే చంద్రబాబు, ఆయన రాజకీయ వారసుడు లోకేష్‌ హైదరాబాద్‌ వదిలి ఆంధ్రప్రదేశ్‌కు రారన్నమాట అనే విమర్శలు వినిపిస్తున్నాయి. 
 
పేరుకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి అయినా తాను మాత్రం హైదరాబాద్‌లో నివాసముంటారు. మిగిలిన వారంతా రాజధాని కాని రాజధాని చుట్టూ తిరగాలి. వాస్తవంగా తాత్కాలిక రాజధాని హైదరాబాద్‌, శాశ్వత రాజధాని అమరావతి...అయితే బాబు మాత్రం హైదరాబాద్‌నే శాశ్వత రాజధానిలా భావిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన హైదరాబాద్ లో ఇంటికి శంఖుస్థాపన చేయడానికి రాజకీయ కారణాలున్నాయి. తెలుగుదేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలలో ఉండాలని ఆయన ఎప్పటి నుంచో భావిస్తున్నారు. 
 
ఇలాంటి తరుణంలో హైదరాబాద్ లో కాదని అమరావతిలో ఇల్లు కట్టుకుని అక్కడి వచ్చేస్తే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఢీలా పడిపోయే అవకాశం ఉంటుంది. పార్టీ, తన కుమారుడి రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్నట్లు సమాచారం. అమరావతిలో ఇల్లు కట్టుకుంటే ఇక తెలంగాణలో ప్రత్యర్థి పార్టీలకు విమర్శనాస్త్రాలు అందించినట్టే అవుతుందని చంద్రబాబు భయపడి ఉంటారని మరికొందరు విశ్లేషిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విమర్శల కంటే తెలంగాణ విమర్శలను ఎదుర్కోవడం సులభం కాదనే విషయాన్ని గ్రహించిన చంద్రబాబు హైదరాబాద్ లో ఇల్లుకట్టుకోవడానికే ఓటేశారని విశ్లేషకులు భావిస్తున్నారు.