బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Yarram Reddy
Last Updated :హైదరాబాద్ , మంగళవారం, 10 జూన్ 2014 (13:45 IST)

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి జగన్ ఎందుకు రాలేదు?

రాజకీయంగా ఎంతటి బద్ధశత్రువులైన గెలుపోటముల సందర్భంగా ఒకరిని ఒకరు పలుకరించుకోవడం, ప్రమాణ స్వీకారాలకు హాజరవడం మనం చూస్తూనే ఉంటాం. ఇది ఇప్పటి నుంచి కాదు తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తుంటే పిలిచినా వైకాపా నాయకుడు జగన్ ఎందుకు హాజరు కాలేదు? ఆయనకు ఆ మాత్రం మర్యాద తెలియదా? అంతకు ముందు ఫోన్లో మాట్లాడినప్పుడు బాబును అన్ని కుశల ప్రశ్నలు ఎందుకు వేశారు? జగన్ కనీస మర్యాదలు పాటించనంత అధ్వాన్నంగా వ్యవహరించారా? ఈ ప్రశ్నలు సామాన్యుడిని పట్టి పీడిస్తున్నాయి. ఇక రాజకీయ మేధావులలో కొందరు పెదవి విరిస్తే.. మరి కొందరు దీని వెనుకున్న ఆంతర్యాలను ఆరా తీసే పనిలో పడ్డారు. 
 
ఆదివారం జరిగిన బాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తానే స్వయంగా ప్రతిపక్ష నేత జగన్ కు ఫోన్ చేసి పిలిచారు. కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు. అయినా సరే జగన్ కార్యక్రమానికి హాజరు కాలేదు. చివరకు తన ప్రతినిధులను కూడా పంపినట్లు లేరు. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిపించుకున్న చంద్రబాబు అట్టహాసంగానే ప్రమాణస్వీకారం చేశారు. ఎక్కడైనా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తున్నారంటే ప్రతిపక్ష నేత హాజరవుతారు. లేదా తమ ప్రతినిధిని పంపుతారు. అయితే ఇక్కడ జగన్ ఆ రెండు పనులు చేయలేదు. ప్రమాణ స్వీకారానికి వృధా ఖర్చు చేస్తున్నారనీ, ఆ ఖర్చులో తాను భాగస్వామిని కాదలుచుకోలేని ఓ వివరణ ఇచ్చేశారు. అయితే ఈ వివరణలో అంత పసలేదనే విషయం రాజకీయ పరిశీలకులకు బాగా ఎరుకే. మరి జగన్ ఆ కార్యక్రమానికి ఎందుకు హాజరు కానట్లు. ఇదే అసలు రహస్యం.
 
సాధారణంగా ఎవరైనా ఇంట్లో చుట్టం తిష్ట వేసి కూర్చున్నా, ఇష్టంలేని చుట్టాన్ని బయటకు పంపాలంటే పొమ్మనలేక పొగ పెడతారు అంటాం. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం జగన్ కార్యక్రమానికి రమ్మనలేక పొగ పెట్టింది. తాము పిలిచామనీ, కాని జగన్ ఫోన్ కూడా తీయడం లేదంటూ రోడ్డుకీడ్చింది. దీని అర్థమేమిటి? మనసుండి, రావాలని పిలవాలంటే ఇలా రోడ్డుకెక్కిస్తారా? అది కాదు కదా? ఒకవేళ బయటకు పొక్కుతున్నా అలాంటిదేమి లేదనే చెపుతారు. కానీ తెలుగుదేశం నాయకులు పనికట్టుకుని మీడియాలో జగన్ పై ప్రచారం చేసి ఆ తరువాత బాబుతో మళ్ళీ ఫోన్ చేయించారు. అప్పటికే రమ్మన లేక పొగ పెడుతున్నారనే సంగతి ఏ రాజకీయ నాయకుడికైనా అర్థం అయిపోతుంది. అసలే ఓటమితో అంతర్మథనంలో ఉన్న జగన్ తాను కార్యక్రమానికి వెళ్ళడం ఎలాగనీ ఆలోచిస్తున్న సమయంలో తెలుగుదేశం పార్టీ పొగలు ఆయనకు చేరిపోయాయి. 
 
దీంతో  రావద్దనడానికి తెలుగుదేశం పార్టీ ఎలాంటి కారణాలు చూపిందో.. అలాగే వెళ్ళకుండా ఉండటానికి కారణాలు వెతుక్కున్నారు. ఇక రాష్ట్ర లోటు బడ్జెట్టును ముందేసుకున్నారు. ఇప్పటికే లోటు బడ్జెట్టులో రాష్ట్రం ఉంటే ఇలా హంగామాలకు ఆర్భాటాలకు నిధులు ఖర్చు చేయడమేమిటని సాకు చూపుతూ జగన్ బాబు ప్రమాణ స్వీకారానికి ఎగనామం పెట్టారు. అయితే జనంలో మార్కులు కొట్టేయడానికి సకల యత్నాలు చేశారు. ఎవరికి వారే డ్రామాను రక్తి కట్టించే ప్రయత్నం చేశారు. మొత్తానికి మన రాజకీయ నాయకుల మాటలకు అర్థాలే వేరు. ఎవరి ఫార్ములా వారిది. ఐతే చివరికి అసలు ఫార్ములా మాత్రం జనం బయటకు తీస్తారనేది వేరే విషయం అనుకోండి.
-పుత్తా యర్రంరెడ్డి (తిరుపతి)