గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Modified: శనివారం, 4 ఫిబ్రవరి 2017 (17:35 IST)

ప్రపంచ కేన్సర్ దినోత్సవం... 5 లక్షల మందికి పరీక్షలు నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం

ప్రపంచం వ్యాప్తంగా అనేకమంది క్యాన్సర్ వ్యాధి బారినపడుతున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతమని భేదం లేకుండా పలువురిని క్యాన్సర్ వ్యాధి సోకుతోంది. క్యాన్సర్ వ్యాధి బారినపడి కుటుంబాలు ఆర్థికంగా సతమతమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో క్యాన్సర్ వ్యాధి నివారణకు

ప్రపంచం వ్యాప్తంగా అనేకమంది క్యాన్సర్ వ్యాధి బారినపడుతున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతమని భేదం లేకుండా పలువురిని క్యాన్సర్  వ్యాధి సోకుతోంది. క్యాన్సర్ వ్యాధి బారినపడి కుటుంబాలు ఆర్థికంగా సతమతమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో క్యాన్సర్ వ్యాధి నివారణకు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అవగాహన కార్యక్రమాలను ప్రభుత్వాలు చేపడుతున్నాయి.
 
ఇక క్యాన్సర్‌ను పారద్రోలేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించింది. దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రాణాలను కబళిస్తున్న క్యాన్సర్ మహమ్మారిని తుదముట్టించాలని సర్కారు యోచిస్తోంది. మాస్టర్ మహిళా హెల్త్ స్కీమ్ ద్వారా రాష్ట్రంలో 2 లక్షల 64 వేల మందికి బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలను నిర్వహించింది. ఇక సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్‌కు సంబంధించి 2 లక్షల 63 వేల మంది మహిళలకు ఈ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వ్యాధి అవగాహన కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది. వీటితోపాటు ఓరల్ స్క్రీనింగ్, కంటి పరీక్షలు, షుగర్ టెస్టులు, బీపీ టెస్టులను రాష్ట్ర ప్రభుత్వం మాష్టర్ హెల్త్ చెకప్ కింద ఉచితంగా నిర్వహిస్తోంది. 
 
కలవరపెడుతున్న క్యాన్సర్ మహమ్మారి 
యూనియన్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ ఆధ్వర్యంలో 1933లో స్విట్జర్లాండ్లోని జెనీవాలో క్యాన్సర్ వ్యతిరేక కార్యక్రమం యూనియన్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ ఆధ్వర్యంలో తొలి ప్రదర్శన జరిగింది. వ్యాధిగ్రస్తులు, వైద్యులు, సేవా సంస్థలు, రీసెర్చ్ సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  ప్రమాదకర క్యాన్సర్ వ్యాధి నివారణపై సదస్సు చర్చించింది. ఇప్పటివరకు కోటీ 27 లక్షల మంది క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు చికిత్స చేసి వారి ప్రాణాలను కాపాడటం జరిగింది. క్యాన్సర్ వ్యాధి కారణంగా ఏటా 70 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వ్యాధి లక్షణాలపై ప్రచారం చేసి, వ్యాధికి గురైనవారికి సరైన చర్యల ద్వారా వ్యాధి నివారణ సాధ్యమన్నది చెప్పాలన్న లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ నివారణ కార్యక్రమాలు, ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏటా ఫిబ్రవరి 4న వ్యాధికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమాలను చేపట్టడం జరుగుతోంది.
 
చైతన్యం ఇలా చేస్తారు
1)క్యాన్సర్ నివారణకు సంబంధించిన విషయాలను ప్రచారం చేయడం 
2)ప్రభుత్వ సంస్థలు, ఎన్జీవోలు, స్వచ్ఛంద సంస్థల ద్వారా కార్యక్రమాల నిర్వహణ 
3)అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు, సదస్సులు, లెక్చర్లు నిర్వహించడం ద్వారా ప్రజల్లో చైతన్యం 
4)ర్యాలీలు నిర్వహించే ముందు సామాన్యులకు  వ్యాధి తీవ్రతపై అవగాహన  
5)సామాన్య ప్రజలకు వ్యాధి గురించిన అవగాహన కల్పించడం క్యాన్సర్ నివారణలో కీలకం  
6)అంతర్జాతీయ క్యాన్సర్ నివారణ సంస్థ సూచనలను, ప్రచార కార్యక్రమాలను, పాంప్లెట్లను ప్రజలకు అందించడం  
 
ప్రమాదం ఎక్కువ ఉన్న వర్గాలను గుర్తించడం
పొగతాగడం, టుబాకో నమలడం, స్థూలకాయం, అధిక బరువు, పండ్లు తక్కువగా తీసుకునేవారు, కూరగాయలు తీసుకోనివారు, శారీర శ్రమ తక్కువగా చేసేవారు, మద్యం సేవించేవారు, అనారక్షితమైన శృంగారం కారణంగా, హెచ్.పి.వి ఇన్ఫెక్షన్ సోకినవారు, పట్టణ ప్రాంతాల్లో కాలుష్యం బారినపడినవారు, పొగ వాసన ఎక్కువగా భరించేవారు, అనువంశికంగా ఎక్కువ సమస్యలు ఎదుర్కొనేవారు, సూర్యరశ్మిని నేరుగా ఎదుర్కొనేవారు ప్రమాదం బారినపడే అవకాశం ఉంది. 
 
క్యాన్సర్ డే నిర్వహణ
ముందుగా క్యాన్సర్ వ్యాధిని గుర్తిస్తే దానిని తగ్గించడం తేలికవుందన్న విషయం అందిరికీ తెలియాల్సి ఉంది. క్యాన్సర్ వ్యాధి సోకినవారిపై సమాజంలో చిన్నచూపు చూడటం మానాలి. పక్కనవారితో స్పర్శ ద్వారా వారితో కలిసి పనిచేయడం ద్వారా క్యాన్సర్ వ్యాధి సోకుతుందన్న అపోహ ఎక్కువగా ఉంది. ఇలాంటి అపోహలను పోగొట్టడానికి క్యాన్సర్ వ్యాధి దినోత్సవాన్ని జరుపుతున్నారు. క్యాన్సర్ వ్యాధి లక్షణాలను తెలియజేయడం, వ్యాధి చికిత్సా పద్ధతులను వివరించడం, వ్యాధి నివారణ పద్ధతులను అర్థమయ్యేలా చేయడం ఇక్కడ ప్రధానం. క్యాన్సర్ సోకినవారిని దూరంగా ఉంచకుండా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేలా కార్యక్రమాలు రూపొందించారు. 
 
అందరితో సమానమన్న భావన కలిగంచడం ఇక్కడ ప్రధాన ఉద్దేశం. క్యాన్సర్ వ్యాధిగ్రస్తులపై ఎవరూ జాలి చూపించాల్సిన అవసరం లేదన్నది ఇక్కడ ముఖ్యమైన విషయం. క్యాన్సర్ వ్యాధి సోకినవారు జీవితంలో ఏదైనా సాధించగలరన్న అభిప్రాయాన్ని కలిగించేందుకు విజయవంతమైన జీవితాలను వారికి వివరించాలి. క్యాన్సర్ వ్యాధి బారినపడుతున్నవారు, వ్యాధితో చనిపోతున్న వారు 47%, 55% గా ఉండగా వారంతా ఎక్కువగా అభివృద్ధి చెందని ప్రాంతాల్లోనే ఉన్నారు. ఈ పరిస్థితిని అదుపు చేయలేకపోతే వచ్చే 2030 నాటికి మృతుల సంఖ్య విపరీతంగా పెరిగే ప్రమాదం ఉంది. 
 
ఈ కార్యక్రమం ద్వారా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలంటే ఏం చేయాలన్నదానిపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. ఆరోగ్యకరమైన భోజన పద్ధతులను వివరిస్తారు. నిత్యం చేయాల్సిన శారీర శ్రమ విషయాలను తెలుపుతారు. వ్యసనాల గురించి స్పష్టమైన సమాచారం చెప్పడం ద్వారా ప్రజలు వాటికి దూరంగా ఉండే అవకాశం ఉంది. క్యాన్సర్ వ్యాధిని నివారించేందుకు ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలను, అపోహలను పోగొట్టాల్సి ఉంది. 
 
క్యాన్సర్‌ను జయంచవచ్చు  
క్యాన్సర్ కేవలం ఆరోగ్యపరమైనదేనని ఎక్కువ మంది భావిస్తారు కానీ అలా కాదన్న విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. సాధారణంగా క్యాన్సర్ వ్యాధి వృద్ధులకు మాత్రమే వస్తుందనే అపోహ వుంది. కానీ ఇది ప్రపంచ వ్యాప్తంగా ఎవరికైనా వస్తుందని తాజా అధ్యయనాల ద్వారా వెల్లడవుతోంది. క్యాన్సర్ వ్యాధి రావడమంటే ఒక నేరంగా చాలామంది భావిస్తున్నారు. అయితే ఇప్పుడు వస్తున్న అనేక రకాలైన క్యాన్సర్ వ్యాధులకు మందులు అందుబాటులో లభిస్తున్నాయ్. చాలా క్యాన్సర్ వ్యాధులను తగ్గిస్తున్నారు కూడా. ఇప్పటివరకు క్యాన్సర్ జబ్బును 30 శాతం వరకు నయం చేయడం జరిగింది. జీవితాంతం ఇబ్బందిపడాల్సిన అవసరం లేకుండా ఈ వ్యాధిని నయం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మహిళలకు అవగాహన పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్యాన్సర్ స్క్రీనింగ్ లతోపాటు, ఉచిత పరీక్షల ద్వారా మహిళల్లో ఉన్న తాజా పరిస్థితిని గమనిస్తూ అంచనా వేస్తోంది. 
 
ఏటా క్యాన్సర్ వ్యాధి నివారణ ప్రజల్లో చైతన్యవంతమయ్యేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రచారం నిర్వహించడం వల్ల ప్రజల్లో వ్యాధి పట్ల ఉన్న అపోహలు, అనుమానాలను తొలిగించాలన్నది ఆలోచన...  
 
ఆలోచన రేకెత్తించే నినాదాలు
2007లో ‘నేటి బాలలే...రేపటి ప్రపంచం’
2008లో ‘చిన్నారులకు, యువతకు పొగరహిత పరిసరాలను అందిద్దాం’...
2009లో ‘ఆరోగ్యకరమైన బాల్యాన్ని నేను ప్రేమిస్తున్నాను’
2010లో ‘వైరస్ ద్వారా వచ్చే లివర్ క్యాన్సర్‌ను టీకాల ద్వారా నివారించడం’
2011లో ‘సన్ స్మార్ట్ ద్వారా చిన్నారులు, యువకులను ఎక్కువసేపు సూర్య ప్రతాపం తగలకుండా చూసుకోవడం’
2012లో ‘అందరం కలిస్తే నివారణే’ 
2013లో ‘క్యాన్సర్ అంటే ఏంటో తెలుసా’
2014లో ‘అసత్యప్రచారాలను పారద్రోలు’
2015లో ‘మనల్ని మించిపోదు’
2016, 2017, 2018 వరుసగా మూడేళ్లు కూడా...  ‘మనమూ, నేనూ...’
 
వచ్చే రోజుల్లో క్యాన్సర్ వ్యాధిని నివారించడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలనివ్వాలని కోరుకుందాం.