శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Selvi
Last Updated : శుక్రవారం, 8 ఏప్రియల్ 2016 (17:17 IST)

ఆ విషయంలో ఇద్దరు చంద్రులు సక్సెస్ అయ్యారా? కొడాలి నాని రీ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ వచ్చిందా?

అధికారం కోసం ఆరాటం సహజమే. అదీ రాజకీయ నేతల్లో అయితే ఉన్నంత రోజులు అధికార పక్షంలో ఉండిపోదామనే ధ్యాస వుంటుంది. విపక్షంలో ఉండి ఒరిగేదేమీ లేదని.. అధికార పక్షంలో ఉన్నా.. కాస్తో కూస్తో పేరు, డబ్బు సంపాదించుకోవచ్చునని అనుకుంటారు. అధికారానికి.. నేతలకు మధ్య అవినాభావ సంబంధం ఉండక మానదు.

అందుకే కార్యకర్తలైనా, రాజకీయ నేతలైనా అధికారం వైపే మొగ్గు చూపుతారు. ఈ క్రమంలోనే ఒక పార్టీలోని నేతలు మరో పార్టీలోకి జంప్ అవుతుంటారు. ఇది తెలుగు రాష్ట్రాల్లో కొత్తేమీ కాదు. తెలంగాణలో టీఆర్ఎస్‌లోకి ఇతర పార్టీ నేతలు జంప్ అవుతుంటే.. ఏపీలో టీడీపీలోకి వైకాపా, కాంగ్రెస్ నేతలు జంప్ అవుతున్నారు. 
 
ఏపీలో టీడీపీ, తెలంగాణలో టీఆర్ఎస్‌కు తిరుగులేకుండా చేయాలని ఇద్దరు చంద్రలు పక్కా ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్లాన్‌లో వీరిద్దరూ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. టీఆర్ఎస్‌ను ఎదిరించే పార్టీ తెలంగాణలో లేకపోవడం.. ఏపీలో టీడీపీకి తిరుగులేకపోవడం ఇందుకు నిదర్శనం. ఇదిలా ఉంటే.. ఏపీలో టీడీపీ చేపట్టిన ఆకర్ష్ విధానం యమా జోరుగా పోతోంది.

ఇప్పటికే వైకాపా నుంచి పదవుల కోసం, అధికారం కోసం జ్యోతుల నెహ్రూ వంటి నేతలు పార్టీ మారితే.. తాజాగా కృష్ణాజిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రస్తుతం కృష్ణాజిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారారు. కొడాలి నానిని తిరిగి సొంత గూటికే తెచ్చేందుకు టీడీపీ విశ్వప్రయత్నాలు చేసింది. ఇందులో కాస్త సక్సెస్ అయ్యిందని రాజకీయ వర్గాల్లో టాక్ వస్తోంది. 
 
ఇప్పటికే సొంతగూటిలోనే కొడాలి నాని వుండివుంటే.. తూర్పు కృష్ణాజిల్లాలో తిరుగులేని నాయకుడిగా ఉండేవారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నానికి ఎన్టీఆర్ కుటుంబంతో ముఖ్యంగా నందమూరి హరికృష్ణ, ఆయన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ తో సన్నిహిత సంబంధాలున్నాయి. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా అధినేతపై విమర్శలు గుప్పించేవారని ఇవన్నీ కూడా చంద్రబాబు వరకు వెళ్లాయని చెబుతుండేవారు. 
 
పరిస్థితుల పరిణామాల కారణంగా కొడాలి నాని 2014 ఎన్నికలకు ముందు వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ మారే సమయంలో కొడాలి నాని చేసిన హంగామా అంతా ఇంతా కాదు. నాని రాజీనామాతో తనకు సంబంధం లేదని జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాదులో పత్రికా విలేకరులతో సమావేశం ఏర్పాటు చేసి మరీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే అప్పట్నుంచి కొడాలి నాని అంటే టీడీపీకి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఏర్పడింది.
 
నాని 2014 ఎన్నికల్లో గుడివాడ నుంచి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా నానికి టీడీపీకి మధ్య వైరం కొనసాగుతూనే ఉన్నది. అయితే బెజవాడలో నాని మీడియా ఫోకస్‌ను తనవైపు తిప్పుకునేలా చేశారు. సాక్షాత్తూ ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ కారులో ఎన్టీఆర్ సూపర్ స్పెషాలిటీ పశు వైద్యశాల ప్రారంభోత్సవానికి రావడం వివాదాస్పదమైంది.

దీంతో నాని తెలుగుదేశం పార్టీలో చేరుతారని జోరుగా ప్రచారం సాగుతోంది. కానీ కొడాలి నాని ఏకంగా ఏపీ సీఎం చంద్రబాబునే విమర్శించడం ద్వారా తెలుగుదేశం పార్టీ నేతలు నానిని తిరిగి సొంత గూటికి రానివ్వకూడదని ఒత్తిడి తెస్తున్నారు. అయితే నాని వ్యవహారంలో చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాలి.