శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By TJ
Last Modified: శుక్రవారం, 24 మార్చి 2017 (14:52 IST)

ఆనాడు కన్నీళ్లు పెట్టుకున్న ఆదిత్యనాథ్... ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌‌లో వీర దూకుడు... ఎందుకు?

ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతాపార్టీ ఘన విజయం కంటే, యోగి ఆదిత్యనాథ్‌ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోవడం అనేకులను ఆశ్చర్యపరుస్తోంది. బీజేపీ విజయానికి దోహదపడిన అంశాలను విశ్లేషకులు విప్పి చెబుతున్నప్పుడు కానీ, ముఖ్యమంత్రి పీఠానికి పోటీదారులెవరన్న మాధ్యమాల చర్చ

ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతాపార్టీ ఘన విజయం కంటే, యోగి ఆదిత్యనాథ్‌ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోవడం అనేకులను ఆశ్చర్యపరుస్తోంది. బీజేపీ విజయానికి దోహదపడిన అంశాలను విశ్లేషకులు విప్పి చెబుతున్నప్పుడు కానీ, ముఖ్యమంత్రి పీఠానికి పోటీదారులెవరన్న మాధ్యమాల చర్చల్లో కానీ ఈ పార్లమెంటు సభ్యుడి పేరు మారుమోగలేదు. నరేంద్రమోదీ సాహసోపేత నిర్ణయాలమీద అవగాహన ఉన్నప్పటికీ, ఆ పీఠం మీద యోగిని ఎవరూ ఊహించ సాహసించలేదు. ముఖ్యమంత్రిగా ఆదిత్యనాథ్‌ను, మరో ఎంపీ కేశవ్‌ప్రసాద్‌ మౌర్యనూ, లక్నో మేయర్‌ దినేశ్‌శర్మనూ ఉపముఖ్యమంత్రులుగా కూర్చోబెడతారని బహుశా ఆపార్టీకి చెందిన మూడువందల ఇరవైఐదుమంది ఎమ్మెల్యేలు కూడా ఊహించి వుండరు. మిగతా దేశాన్నంతా ఆశ్చర్యంలో ముంచిన ఈ నిర్ణయం, ఉత్తరప్రదేశ్‌ ముస్లిం జనాభాలో అభద్రతను మరింత పెంచిందని మీడియా అంటున్నది. ఆదిత్యనాథ్‌ ఎంపిక విధిలేక జరిగినదా, అందులో నరేంద్రమోదీ రాజకీయ విధి కూడా ఇమిడివున్నదా అన్న చర్చ సాగుతున్నది.
 
‘నా కుమారుడు సామదాన బేధ దండోపాయాలతో గాడితప్పిన రాష్ట్రాన్ని చక్కదిద్దుగాక!’ అని ఆదిత్యనాథ్‌ తండ్రి ఆకాంక్షించారు. యోగి గురించి కొత్తగా చెప్పుకోవాల్సిందేమీ లేదు. ఆయన జగమెరిగిన మతవాది. బాబ్రీమసీదు కూల్చివేతలో, రామమందిర ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన మహంత్‌ అవైద్యనాథ్‌ దత్తపుత్రుడు. గోరఖ్‌పూర్‌ మఠాధిపతిగా యూపీలోని పలుప్రాంతాల్లో ఆయనకు పట్టుంది. ముస్లిం వ్యతిరేకత ప్రధానాధారంగా ఐదుసార్లు పార్లమెంటు సభ్యుడయ్యారు. హిందూ ముస్లిం యువతీయువకుల మధ్య ప్రేమను మతాంతీకరణ కుట్రగా భావించే ‘లవ్ జిహాద్‌’, ఇతర మతాలు స్వీకరించిన హిందువులను వెనక్కుతీసుకువచ్చే ‘ఘర్‌వాప్సీ’ ఉద్యమాలకు నాయకుడు. సూర్యనమస్కారాలు చేయనివారిని దేశం విడిచిపొమ్మనగలరు, బాలీవుడ్‌ నటుడు షారూక్‌ఖాన్‌ను హఫీజ్‌ సయీద్‌తో పోల్చగలరు. ఒక సందర్భంలో పార్టీ విప్‌ను కూడా ధిక్కరించి, ఆత్మప్రభోదానుసారమే నడుస్తానని తేల్చిచెప్పిన ఈ వ్యక్తి, రాబోయే రోజుల్లో తనమాట వినకపోవచ్చునని నరేంద్రమోదీకీ తెలియంది కాదు. 
 
2014 సార్వత్రిక ఎన్నికల్లో యూపీ నుంచి భారీ సంఖ్యలో ఎంపీ స్థానాలు సంపాదించిపెట్టినందుకు ఆదిత్యనాథ్‌కు నరేంద్రమోదీ కేంద్రమంత్రి పదవి ఇచ్చేందుకు సిద్ధపడ్డారనీ, పలుమార్లు ఈ ప్రతిపాదన చేసినప్పటికీ ఆయనను తిరస్కరిస్తూ వచ్చారని అంటారు. మాతృభూమికి అంటే, ఉత్తర్‌ప్రదేశ్‌కు సేవ చేయాలన్నదే ఆయన జీవిత లక్ష్యమని సన్నిహితులు చెబుతారు. పుట్టినగడ్డకు సేవ చేయడమంటే ముఖ్యమంత్రి కావడమేననీ, యూపీ ఎన్నికల ప్రచారానికి ముందే ఆదిత్యనాథ్‌ తన మనసులో మాటని మోదీకి విస్పష్టంగా తెలియచెప్పారని మరికొందరు అంటున్నారు.
 
సీఎం పదవితో పాటు ఓ వందసీట్లు తనవారికి ఇవ్వకపోతే హిందూ యువవాహిని పక్షాన తిరుగుబాటు అభ్యర్థులను నిలబెడతానన్న హెచ్చరికతో, బీజేపీ అధిష్ఠానం ఎన్నికలకు ముందే ఆయనతో రాజీకి వచ్చిందని అంటారు. ఈ కారణంగానే కాబోలు, ఠాకూర్‌ రాజ్‌నాథ్‌సింగ్‌ నుంచి ఓబీసీ మౌర్యవరకూ వినిపించిన అన్నిపేర్లూ అణగిపోయి, ఆఖరు నిముషంలో ఆదిత్యుడు వెలిగిపోయాడు. 
 
19 శాతం ఉన్న ముస్లింల ఓట్లను ఆశించకుండా, రెండు దశల పోలింగ్‌ మిగిలివున్న తరుణంలో వారికి ఒక్కసీటూ ఇవ్వలేదన్న విషయాన్ని ప్రజలకు పరోక్షంగా గుర్తుచేస్తూ హిందువుల ఓట్లను సంఘటితం చేయగలిగింది మోదీ–అమిత్‌షా ద్వయం. జాతవేతర, యాదవేతర ఓట్ల చీలికను హిందూ ఓట్లుగా ఒడిసిపట్టడంలో ఆదిత్యనాథ్‌ ప్రభావం విస్తృతం. మోదీ మొఖంతో ఎన్నికలకుపోయినా, వేరొకరిని ఎంపిక చేసి ఇప్పుడు పదవిలో కూర్చోబెట్టగలిగినా, ఆదిత్యనాథ్‌ను కాదనగలిగే స్థితి పార్టీకి లేదు. ఆరెస్సెస్‌ ఒత్తిడిని మించిన ఆదిత్యుని ప్రభావమూ, రాబోయే సార్వత్రక ఎన్నికల నాటి అవసరమూ ఇందుకు కారణం. యూపీని ఇదే దారిలో నడిపించి, ఆ తరహా చీలిక వ్యూహాన్ని దేశమంతా విస్తృతపరచడానికి ఈ ఎంపిక ఉపకరిస్తుంది. తమ మాట వినే ఇద్దరిని ఉపముఖ్యమంత్రులుగా పక్కనే కూర్చోబెట్టి, అవసరం మేరకు యోగి దూకుడుకు కళ్ళెం వేయవచ్చునని బీజేపీ అధిష్ఠానం ఆశపడుతూండవచ్చును కానీ, యోగి స్వభావమూ, ఆయన బలం అందుకు వీలుకల్పించదు.
 
ఎన్నికల ప్రచారంలో ఉత్తర్‌ప్రదేశ్‌ను ఉత్తమ్‌ప్రదేశ్‌గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని చెప్పిన నరేంద్రమోదీ, ఆ లక్ష్యాన్ని ఆదిత్యనాథ్‌ కచ్చితంగా నెరవేరుస్తారంటూ ట్వీట్‌ చేశారు. కానీ, ఆదిత్యనాథ్‌ ఎంపికతో అభివృద్ధి ఎజెండా వెనక్కుపోయి, గోరక్షణ, లవ్‌జిహాద్‌, మతమార్పిడుల వంటి అంశాలే ప్రజల మనస్సుల్లో ముందుకు వస్తాయనే ప్రచారం జరుగుతోంది. 
 
శాంతిభద్రతల పరిరక్షణే తన ప్రధాన లక్ష్యమని ప్రకటించిన ముఖ్యమంత్రికి, తమ నాయకుడి ఆలోచనా విధానాన్ని అమలు చేస్తున్నామంటూ వీరంగం వేసేవారిని నియంత్రించడం రాబోయే రోజుల్లో ఎంతో కష్టం. పదేళ్ళక్రితం గోరఖ్‌పూర్‌లో మొహర్రం సందర్భంగా తలెత్తిన ఉద్రిక్తతల మధ్య ఆదిత్యనాథ్‌ను సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వం జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టు చేసి పదిరోజులు జైల్లో పెట్టింది. తనను సమాజ్‌వాదీ నుంచి రక్షించమంటూ ఆదిత్యనాథ్‌ పార్లమెంటులో కన్నీళ్ళు పెట్టుకున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. ఆదిత్యనాథ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వేదిక మీదనే నరేంద్రమోదీ చెవిలో ములాయం సింగ్‌ యాదవ్‌ ఏదో చెబుతున్న వీడియో కూడా ‘నన్నూ నా కుమారుడినీ ఈయన బారినుంచి రక్షించు’ అన్న వ్యాఖ్యలతో సోషల్‌ మీడియాలో ప్రచారమవుతోంది. మరి ఈ దూకుడు ఇలానే కొనసాగుతుందా.. లేక ఏ విధంగా ఉంటుందో చూడాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు.