బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Modified: గురువారం, 18 డిశెంబరు 2014 (17:16 IST)

తెలంగాణలో జగనన్న విసిరిన బాణం... నాయకులు జారుడు...

జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో ఎలాగైనా గట్టి పునాదులు వేసి నిర్మించాలని తన సోదరి వైఎస్ షర్మిళకు ఆ బాధ్యతను అప్పగించారు. ఆమె పరామర్శ యాత్రలు చేస్తూ తెలంగాణపై తన తండ్రి వైఎస్సార్ చూపించిన ప్రేమను తెలియజెపుతున్నారు. ఐతే 2014 ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గాలి ఒక్క ఖమ్మం జిల్లాలో తప్పించి ఎక్కడా కనిపించలేదు. దాంతో ఆ పార్టీకి ఖమ్మం జిల్లాలో మాత్రం ఓ ఎంపీ సీటుతోపాటు మూడు అసెంబ్లీ సీట్లు వచ్చాయి.
                                    
ఇపుడు భవిష్యత్తులో మరిన్ని ఫలితాలు రాబట్టేందుకు జగన్ మోహన్ రెడ్డి తన సోదరి షర్మిళను రంగంలోకి దించారు. కానీ అందుకు తగిన ఫలితాలు మాత్రం పెద్దగా కనబడటం లేదని అంటున్నారు. రైతు పరామర్శ పేరుతో షర్మిళ పంచే సెంటిమెంట్ తెలంగాణలో ఎంతమాత్రం పండటంలేదట. పార్టీ పునాదులు బలపడుతాయనుకుంటే ఆ సంగతి అలా ప్రక్కనబెట్టి ఉన్న కూసాలు కూడా కదిలిపోతున్నాయంట. దీనికి కారణం... గులాబీ బాస్ కేసీఆర్, పార్టీలోకి వచ్చినవారికి వచ్చినట్లు గతంతో సంబంధం లేకుండా మంత్రి పదవులివ్వడమేనని అంటున్నారు. 
 
ఇప్పటికే తెదేపా నుంచి వచ్చిన నాయకులకు కేసీఆర్ లేదనకుండా మంత్రిపదవుల స్వీట్లు ఇచ్చేశారు. దీంతో ఇపుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు కూడా పక్కచూపులు చూస్తున్నారట. ఆ పార్టీకి ఉన్న కొద్దిపాటి ఎమ్మెల్యేలు కూడా షర్మిల యాత్ర చేస్తున్న సమయంలోనే పార్టీకి దూరంగా ఉండటంతో ఆ పార్టీకి మింగుడుపడటంలేదు. తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా పార్టీకి దూరమవ్వడంతో పార్టీ స్థితి మున్ముందు ఏ రీతిగా ఉంటుందోనన్న గాభరా పట్టుకుంది. 
 
అంతేకాదు, ఇపుడు మెల్లిగా నాయకులు కూడా వైకాపాకు గుడ్ బై చెప్పేస్తున్నారు. జనక ప్రసాద్ వంటి నేతలు ఇప్పటికే వెళ్లిపోయారు. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తెలంగాణ బాధ్యతలు అప్పగించినప్పటికీ ఆయన ఇప్పుడు తెరాస ఆకర్ష్ దెబ్బకు అటువైపు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే కనుక నిజమై పొంగులేటి అటువైపు వెళ్లిపోతే... తెలంగాణలో వైకాపా పరిస్థితి ఎలా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. ఏదేమైనప్పటికీ రాజకీయాల్లో పరిస్థితులు ఎలా ఎప్పుడు మారుతాయో ఎవ్వరూ ఊహించలేరు.