శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఫ్యాషన్
Written By PNR
Last Updated : మంగళవారం, 5 ఆగస్టు 2014 (15:28 IST)

ఆడవారికి... పొడవాటి రింగులు అందమే.. కానీ...!

అందాల ముద్దుగుమ్మలు మరింత అందంగా కనిపించేందుకు, ఆయా దుస్తులకు మ్యాచ్ అయ్యే రీతిలో డిజైన్ చేసిన అందమైన, పొడవైన చెవి రింగులను ధరించడం ఇపుడు ఓ ఫ్యాషనై పోయింది. అయితే.. పొడవైన రింగులు ధరించటం వల్ల చెవులు దెబ్బతింటాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. 
 
మహిళలు ధరించే చెవి రింగులు, దిద్దులు వంటి అలంకార సామగ్రి ఎనలేని అందాన్నిచ్చినా.... పొడవుగా, వేలాడుతూ ఉండే రింగుల వల్ల చెవులు ఇబ్బందుల్లో పడతాయని పరిశోధకులు అంటున్నారు. చాలామంది సెలెబ్రిటీలు కూడా పొడవాటి రింగులను ధరిస్తుంటారనీ, అయితే అవి చెవి తమ్మెలను (రంధ్రాలను) నాశనం చేస్తాయని వారు వివరించారు.
 
పొడవాటి రింగులు ధరించటం వల్ల చెవుల రంధ్రాలు కిందకు సాగేలా చేస్తాయని, వీటి వల్ల గాయాలు కూడా అవుతాయని పరిశోధకులు చెపుతున్నారు. కొన్ని కేసుల్లో చెవి తమ్మె రెండుగా చీలిపోయి కూడా ఉంటుందని పలువురు వైద్యులు చెపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చికిత్స కోసం తమ వద్దకు వచ్చిన రోగులకు మత్తు మందు ఇచ్చి చెవి తమ్మెను అతికించిన సందర్భాలు ఉన్నాయన్నది వారి వాదన. మరికొన్ని కేసుల్లో చెవుల్లో, చెవి తమ్మెలపైన గోళీ సైజంత గడ్డలు కూడా ఏర్పడతాయని చెపుతున్నారు. 
 
కాబట్టి, మహిళలూ... అందంగా కనిపించడమే కాదు.. మిమ్మల్ని అందంగా ఉండేలా చేసే చెవి దిద్దులు, రింగులు, కమ్మల విషయంలో కూడా జాగ్రత్త వహించాల్సిందే. పైన చెప్పినట్లుగా పొడవాటి రింగుల వల్ల, కొన్ని రోజుల పాటు చెవులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండానే ఉండవచ్చుగానీ.. క్రమంగా చిన్నగా ఉండే చెవి తమ్మెలు పొడవాటి రింగుల బరువుకు చీలిపోయి, సర్జరీ దాకా మిమ్మల్ని తీసుకెళ్తాయి. సో.. బీ కేర్ ఫుల్...!