Widgets Magazine

అట్లతద్ది... రేపు కుజుడికి అలా చేస్తే సంసార సుఖానికి అడ్డంకులుండవ్... ఏం చేయాలంటే?

ఆంధ్ర దేశ విశిష్ట సాంప్రదాయాల్లో అట్లతద్ది జరుపుకోవడం ఒకటి. ఇది ఆశ్వయుజ బహుళ తదియ నాడు జరుపుకొంటారు. తెలుగు వారు జరుపుకునే అట్లతద్ది పండుగ ఉత్తర భారత దేశ స్త్రీలు చేసుకునే కార్వా చౌత్ వేడుకతో సమానం. చిత్రమేమిటంటే రోమ్ లో కూడా ఇలాంటి ఆచారం ఉంది. జనవర

atlatadde
chj| Last Modified సోమవారం, 17 అక్టోబరు 2016 (14:34 IST)
ఆంధ్ర దేశ విశిష్ట సాంప్రదాయాల్లో అట్లతద్ది జరుపుకోవడం ఒకటి. ఇది ఆశ్వయుజ బహుళ తదియ నాడు జరుపుకొంటారు.
తెలుగు వారు జరుపుకునే అట్లతద్ది పండుగ ఉత్తర భారత దేశ స్త్రీలు చేసుకునే కార్వా చౌత్ వేడుకతో సమానం. చిత్రమేమిటంటే రోమ్ లో కూడా ఇలాంటి ఆచారం ఉంది. జనవరి 21వ తేదీన వచ్చే సెయింట్ ఆగ్నెస్ ఈవ్ మన అట్లతద్ది పండుగలాగే ఉంటుంది. ఆడవాళ్ళు తమ భర్తలు ఆయురారోగ్యాలతో పదికాలాలపాటు సుఖంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అట్లతద్ది జరుపుకుంటారు.

త్రిలోక సంచారి అయిన నారదుని ప్రోద్బలముతో గౌరీదేవి శివుని పతిగా పొందటానికి ఆమె చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్లతద్ది. స్రీలు సౌభాగ్యము కోసం చేసుకొనే వ్రతమిది. చంద్రారాధన ప్రధానమైన పూజ, చంద్రకళల్లో కొలువైవున్నశక్తి అనుగ్రహం చేత స్రీసౌభాగ్యము పెరుగుతుంది. కుటుంబములో సుఖశాంతులు వర్దిల్లుతాయని శాస్త్రవచనం. ఈ పండగలో అమ్మవారికి అట్లు నైవేద్యముగా పెట్టడములో ఒక అంతరార్ధముంది. నవగ్రహాలలోని కుజుడుకీ అట్లంటే మహాప్రీతి, అట్లను ఆయనకు నైవేద్యముగా పెడితే కుజదోష పరిహారమై సంసారసుఖములో ఎటువంటి అడ్డంకులు రావని నమ్మకము.

రజోదయమునకు కారకుడు కనుక ఋతుచక్రం సరిగా వుంచి ఋతు సమస్యలు రానివ్వకుండా కాపాడుతాడు. అందువలన గర్భదారణలోఎటువంటి సమస్యలుండవు. మినుములు పిండి, బియ్యము పిండి కలిపి అట్లను తయారుచేస్తారు. మినుములు రాహువునకు, బియ్యము చంద్రునకు సంబంధించిన దాన్యాలు. గర్భదోషాలు తొలగిపోవాలంటే ఈ అట్లనే వాయనముగా ఇవ్వాలి. గర్భస్రావము రాకుండా, సుఖప్రసవం అయ్యేందుకు దోహదపడుతుంది కూడా. అందుకే ముత్తయిదువులకు అట్లను వాయనముగా ఇస్తారు. అట్లతద్దిలోని ‘అట్ల’కు ఇంతటి వైద్యవిజ్ఞానము నిక్షిప్తం చేయబడివుంది.
ఈ పండుగకు ముందురోజు నుంచే అన్ని వస్తువులను, సముదాయాలను ఏర్పాటు చేసుకోవాలి. ఇక స్త్రీలు తమను తాము అలంకరించుకోవడం కోసం రాత్రినుంచే తమ చేతులకు, కాళ్లకు గోరింటాకు పెట్టుకుంటారు. ఇలా పూసుకోవడం వల్ల కూడా కొన్ని మంచి ఫలితాలు అందుతాయి.

అట్లతద్ది నాడు తెల్లవారుఝామునే మేల్కొని శుచి, శుభ్రత తో స్నానమాచరించి, ఉపవాసముండి, ఇంటిలో తూర్పుదిక్కున మండపము ఏర్పాటు చేసి గౌరీదేవి పూజ చేయాలి. ధూప, దీప, నైవేద్యాలు పెట్టి, వినాయక పూజ తర్వాత, గౌరీ స్తోత్రము, శ్లోకాలు, పాటలు చదవడము, పాడడం చేస్తారు. సాయంత్రం చంద్రదర్సనము అనంతరము శుచియై తిరిగి గౌరీపూజచేసి, 10 అట్లు నైవేద్యముగా పెట్టి, ముత్తైదువులకు అలంకారము చేసి, 10 అట్లు, 10 ఫలాలు వాయనముగా సమర్పించి, అట్లతద్ది నోము కధ చెప్పుకొని, అక్షతలు వేసుకోవాలి. ముత్తైదువులకు నల్లపూసలు, లక్కకోళ్ళు, రవిక గుడ్డలు, దక్షిణతాంబూలాలు ఇచ్చి భోజనాలుపెట్టి, తామూ భోజనము చేయాలి.

10 రకాల ఫలాలను తినడం, 10 మార్లు తాంబూలం వేసుకోవడం, 10 మార్లు ఊయల ఊగడం, గోరింటాకు పెట్టుకోవడం, ఈ పండుగలో విశేషము. దీనినే ‘ఉయ్యాలపండగ’ అనీ, ‘గోరింటాకుపండగ’ అనీ అంటారు. ఈ పండగ చేయడం వలన గౌరీదేవి అనుగ్రహంతో పెళ్ళి కాని అమ్మాయిలకు గుణవంతుడైన రూపసి భర్తగా లభిస్తాడని, పెళ్ళైనవారికి పిల్లలు కలుగుతారని, ఐదవతనముతోపాటు, పుణ్యము లభిస్తుందని తరతరాలనుంచి వస్తున్న నమ్మకము.
అట్లతద్దినాడు స్త్రీలు, పిల్లలు తమకెంతో ఇష్టమైన ఉయ్యాలను ఊగుతారు. సరదాపాటలు పాడుకుంటూ రోజంతా హాయిగా గడుపుతారు. గౌరీదేవికి పూజలో కుడుములు, పాలితాలికలు, పులిహోర వంటివి నైవేద్యంగా సమర్పిస్తారు. అట్లతద్ది నోమును నిర్వహించుకున్నవారు 11 మంది ముత్తయిదువులను ఆహ్వానించి, వారికి భోజనాలను తినిపిస్తారు. నోమును నోచుకునే స్త్రీలతోబాటు వాయనం అందుకునే స్త్రీలు కూడా ఉపవాసం వుండాలి. లేకపోతే ఎటువంటి ఫలితాలు దక్కవు. పూజలో చేతులకు చామంతి, తులసిదళం, తమలపాకు వంటి మొదలైన పుష్పాలను పత్రాలతో 11 ముడులు వేసి తోరలు కట్టుకుంటారు. పసుపు రంగులో వున్న గౌరీదేవిని, గణపతిని ఒక కలశంలో వుంచుతారు.
ఒక పళ్లెంలో బియ్యం పొసి, మధ్యమధ్యలో డిప్పలు మాదిరిగా చేసిన కుడుములను వుంచుతారు. వాటిమధ్యలో పసుపు, కుంకుమలను వేస్తారు. అలాగే మధ్యలో పుష్పాలతో అలంకరిస్తారు. ఇలా చేసిన దానిని కైలాసంగా భావిస్తారు మహిళలు. పూజా కార్యక్రమాలు నిర్వహించే సమయంలో లలితా సహస్రనామం, గౌరీ అష్టోత్తర శతనామావళిని ఖచ్చితంగా చదువుకోవాల్సి వుంటుంది. తరువాత అట్లతద్ది కథను చదువుకోవాలి. పూజా కార్యక్రమం పూర్తియిన తరువాత పిలిచిన 11 మంది ముత్తయిదువులకు 11 అట్లు చొప్పున పెట్టి.. గౌరీదేవి వద్ద పెట్టిన కుడుములలోనుంచి ఒక్కొక్కటి పెట్టి వాయనమివ్వాలి.
ఈ విధంగా అట్లతద్ది నోములో వాయనాన్ని అందుకున్న స్త్రీలు - అందులో వున్న అట్లను వాళ్లుగానీ వారి కుటుంబీకులుగానీ మాత్రమే తినాలి. ఇతరులకు అస్సలు ఇవ్వకూడదు. అలా ఇవ్వడం వల్ల అరిష్టాలు కలిగే పరిణామాలు వున్నాయి. వాయనం ఇచ్చే సమయంలో స్త్రీలు తమ కొంగును ముందుకు తెచ్చి, అందులో వాయనాన్ని అందిస్తారు. ఆ వాయనాన్ని అందుకునే స్త్రీలు కూడా అదే పద్ధతిని పాటించాల్సి వుంటుంది. ఇలా ఈ విధంగా అట్లతద్ది పండుగను మన తెలుగు మహిళలు ఎంతో వైభవంగా జరుపుకుంటారు.


దీనిపై మరింత చదవండి :