శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. పండుగలు
Written By chitra
Last Updated : మంగళవారం, 22 మార్చి 2016 (16:56 IST)

రంగుల పండుగ హోలి.. సహజ పద్ధతుల్లో రంగు నీళ్లు తయారీ ఎలా?

భారతీయ సంప్రదాయంలో జరుపుకునే పండగల్లో హోలి ఒకటి. అయితే, మనం జరుపుకునే ప్రతి పండుగకి ఒక పరమార్థం ఉంది. మారుతున్న కాలంతో పాటు.. పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడుతున్నయువత మన సంప్రదాయ పండుగలు వాటి విలువల గురించి మర్చిపోతున్నారు. అయితే, పిల్లలకు పెద్దలకు నచ్చిన పండుగ హోలి. పండుగ రోజున ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని రంగులమయంతో మునిగితేలుతుంటారు. వయోభేదం లేకుండా అంతా సంతోషంగా ఈ పండుగ వేడుకల్లో పాల్గొంటారు. 
 
ఈ పండుగను దక్షిణ భారతదేశంలో కామునిదహనంగా, ఉత్తరాదిన హోలి దహన దినంగా జరుపుకుంటారు. పండుగ రోజున పసుపు, కుంకుమ, గులాల్‌, గంధం పొడిని ఒకప్పుడు చల్లుకుంటూ ఆనందంగా గడిపేవారు. కానీ ఇప్పుడు ఆ అలవాట్లని మర్చిపోయి కృత్రిమ రసాయన రంగులలో ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగులును పూసుకుని పండుగ జరుపుకుంటున్నారు. నియంత్రణ లేని ఈ కృత్రిమ రంగుల వల్ల శరీరంపై తీవ్ర ప్రభావం కలుగుతుంది. ఇలాకాకుండా మనమే సహజ రంగులను తయారు చేసుకోవచ్చు. ఈ హోలి రోజున కొన్ని సహజ రంగులను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం: 
 
పసుపు రంగు: పసుపుపొడిని నీళ్లలో కలిపితే చాలు. అవి చిక్కగా కావాలంటే చిక్కగా పెద్దమొత్తంలో కావాలంటే ఎక్కువ నీళ్లలో కలుపుకుంటే సరి.  
ఎరుపు రంగు: ఎర్రచందనం పొడిని, ఎర్ర మందార పువ్వుల పొడిని ఎర్ర రంగుకోసం వాడుకోవచ్చు. ఎర్ర దానిమ్మ గింజలు, లేదా తొక్కలను నీళ్లలో మరగనిస్తే ఎర్రటి రంగునీళ్లు రెడీ. బీట్ రూట్ నీళ్ళలో వేసి మరిగిస్తే ఎర్రటి రంగు మీ సొంతమవుతుంది.
నీలి రంగు: నీలి మందార పూలు, నీలిరంగులో మెరిసిపోయే జకరందా పూలతో పొడిని తయారు చేసుకోవచ్చు. 
ఆకుపచ్చ రంగు: పుదీనా ఆకులనూ ముద్దగా నూరి నీళ్లలో కలిపితే ఆకుపచ్చరంగు నీళ్లు తయారవుతాయి.
గోధుమ రంగు: కిళ్లీలో ఎర్రటి రంగుకోసం వాడే కాసు బెరడును నీళ్లలో మరగనివ్వాలి. దానికి కాస్త కాఫీ ఆకులు కలిపితే మంచివాసన, మంచి రంగు పడతాయి.
నలుపు రంగు: నల్లని ద్రాక్షపళ్ల గుజ్జును నీళ్లలో కలిపితే నల్లనిరంగు నీళ్లు తయారవుతాయి.