శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. పండుగలు
Written By Selvi
Last Updated : సోమవారం, 13 జులై 2015 (16:01 IST)

పుష్కరకాలంలో నదీ స్నానం ఎందుకు చేయాలి?

పుష్కర కాలంలో నదీ స్నానం చేయడం ఎంతో పుణ్యదాయకమని ఆగమ శాస్త్రాలు చెబుతున్నాయి. అన్ని స్నానాల్లోకెల్లా నదీ స్నానాలు ఉత్తమమైనవని పెద్దలు చెప్తుంటారు. నీరు నది రూపంలో ఉన్నప్పుడు ఆ ప్రవాహాన్ని మాతృమూర్తిగా భావించే సంప్రదాయం మనది. అటువంటి నదీమ తల్లికి పుష్కరకాలం వచ్చిందంటే.. 12 రోజులు పర్వదినాలతో సమానం. పుష్కర కాలంలో నదీ స్నానం చేయడం ఎంతో పుణ్యదాయకమని పండితులు అంటున్నారు. 
 
పుష్కరము, ముష్కరము అనేవి రెండు పదాలు వ్యతిరేక అర్థాలను ఇస్తాయి. పుష్కరం అంటే పునీతమైన కర్మగా, ముష్కరం అంటే దుర్నీతితో కూడిన కర్మగా చెప్తుంటారు. అందుకే స్నానం, దానం, పితృతర్పణలు, శ్రాద్ధకర్మలు పుష్కరాలు చేయడం చేత పితృకర్మల పుణ్యం కోటిరెట్లు పెరుగుతుందని ఆగమ శాస్త్ర నిపుణులు అంటున్నారు.
 
పుష్కరిణిలో స్నానం చేసే ముందు.. 
శ్లో: ''జన్మ ప్రభృతి యత్‌పాపం స్త్రీయా వా పురుషేణ వా 
పుష్కరే స్నాన మాత్రస్య సర్వమేవ ప్రణశ్యతి'' 
అనే సంకల్ప మంత్రాన్ని చదివి నదిలో మునిగితే సర్వపాపాలు పోతాయని పురణాలు చెబుతున్నాయి. పుష్కర స్నానంతో అశ్వమేధయాగం చేసినంత ఫలితం దక్కడంతో పాటు తరతరాల పాపాలు తొలగిపోతాయని పండితులు అంటున్నారు. పుష్కరాలు జరిగే 12 రోజులూ పుష్కర స్నానం చేస్తే ఆశించిన ఫలితాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు.