బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శుక్రవారం, 20 జనవరి 2017 (04:30 IST)

స్మార్ట్ ఫోన్ల ఉనికిని మాయం చేయనున్న భీమ్ యాప్‌కు కోటి డౌన్‌లోడ్స్

మొబైల్‌ ఫోన్ల ద్వారా డిజిటల్‌ చెల్లింపులకు ఉపయోగపడే ’భీమ్‌’ యాప్‌ డౌన్‌లోడ్స్‌ 1 కోటి మార్కును అధిగమించాయి. 20 రోజుల్లోనే ఏకంగా 1.1 కోట్ల మేర యాప్‌ డౌన్‌లోడ్స్‌ జరిగినట్లు కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ తెలిపారు.

సులభ డిజిటల్ లావాదేవీల  కోసం ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 30న ప్రారంభించిన ఆధార్ ఆధారిత మొబైల్ చెల్లింపు అప్లికేషన్ భీమ్ సంచలనం సృష్టిస్తోంది. డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ పేరిట రూపుదిద్దుకుని, ఆయనకు ఘన నివాళిగా అమలులోకి వచ్చిన భీమ్  ప్రజలు వారి బ్యాంకు ఖాతాల నుంచి నేరుగా డిజిటల్ చెల్లింపులు చేయడానికి అనుమతిస్తుంది.  ఈ  యాప్ అద్భుతాలు సృష్టిస్తుందని మోదీ అప్పట్లోనే కొనియాడిన సంగతి తెలిసిందే. 
 
ప్రధాని నోట మాట తడారకముందే భీమ్ నిజంగానే సంచలనం కలిగిస్తోంది. మొబైల్‌ ఫోన్ల ద్వారా డిజిటల్‌ చెల్లింపులకు ఉపయోగపడే ’భీమ్‌’ యాప్‌ డౌన్‌లోడ్స్‌ 1 కోటి మార్కును అధిగమించాయి. 20 రోజుల్లోనే ఏకంగా 1.1 కోట్ల మేర యాప్‌ డౌన్‌లోడ్స్‌ జరిగినట్లు కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ తెలిపారు. మరోవైపు ఆధార్‌ ఆధారిత చెల్లింపుల వ్యవస్థను త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు ఆయన వివరించారు. ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతో పాటు నాలుగు బ్యాంకులు ఇందులో పాలుపంచుకోనున్నట్లు మంత్రి చెప్పారు.
 
ఇది అందుబాటులోకి వచ్చిన తర్వాత చెల్లింపుల కోసం కొనుగోలుదారులకు మొబైల్‌ ఫోన్లు.. స్మార్ట్‌ఫోన్ల అవసరం కూడా ఉండదని పేర్కొన్నారు. కేవలం ఆధార్‌ ఆధారిత బ్యాంక్‌ ఖాతా ఉంటే సరిపోతుందన్నారు. ప్రస్తుతం 40 కోట్ల పైగా బ్యాంక్‌ ఖాతాలు ఆధార్‌తో అనుసంధానం అయ్యాయని రవి శంకర్‌ ప్రసాద్‌ చెప్పారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం డిజిటల్‌ చెల్లింపుల సాధనాలు మరింత ప్రాచుర్యంలోకి వస్తున్న సంగతి తెలిసిందే.
 
భీమ్ ఎలా పనిచేస్తుంది?
కేవలం మొబైల్ నెంబర్ ద్వారా బ్యాంకు అకౌంట్ నుంచి నగదును బదిలీ చేసుకునే లేదా సులభతరంగా పేమెంట్లు కూడా చేసుకునే అవకాశం ఈ యాప్ కల్పిస్తుంది. దుకాణదారుడు కూడా భీమ్ యాప్ను వాడుతుంటే, యాప్ను ఓపెన్ చేసి, సెండ్ మనీ అని కొట్టి, చెల్లింపు మొత్తాన్ని, వ్యాపారి ఫోన్ నెంబర్ను టైప్ చేస్తె చాలు. చెల్లింపు అయిపోతుంది. మీ అకౌంట్లో నగదు డెబిట్ అయి, వ్యాపారి బ్యాంకు అకౌంట్లోకి క్రెడిట్ అవుతుంది. 
 
భీమ్ యాప్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ వెర్షన్లో అందుబాటులో ఉంది. ఐఓఎస్లకి త్వరలో అందుబాటులోకి రానుంది. కస్టమర్లకు క్యూఆర్ కోడ్ను స్కాం చేసుకునే అవకాశం కూడా ఈ యాప్ కల్పిస్తుంది. వ్యాపారి కూడా క్యూఆర్ కోడ్ను భీమ్ యాప్ ద్వారా జనరేట్ చేసుకోవచ్చు. మర్చంట్కి నగదు  చెల్లించాలనప్పుడు స్కాన్ను ట్యాప్ చేసి, యాప్లో పే బటన్ను నొక్కాలి. తర్వాత క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసేస్తె చాలు.
 
స్మార్ట్ ఫోన్ అవసరం లేకుండానే ఈ యాప్ను వాడుకోవచ్చు. పేమెంట్ల కోసం భీమ్ యాప్ వాడటానికి ఏ విధమైన మొబైల్ నుంచైనా *99# ను డయల్ చేయాల్సి ఉంటుంది. అనంతరం మెనూ మనకు కనిపిస్తుందని. నగదు పంపడానికి, బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి, లావాదేవీల హిస్టరీ కోసం వివిధ నెంబర్లు మనకు వాటిలో దర్శనమిస్తాయి. నగదు పంపడానికి ఉదాహరణకు 1 నెంబర్ను టైప్ చేసి, సెండ్ కొట్టాలి. మొబైల్ నెంబర్ను ఎంపికచేయడం కోసం మళ్లీ 1 నెంబర్ను టైప్ చేయాలి. తర్వాత నెంబర్, పేమెంట్ మొత్తం టైప్ చేసి, భీమ్ యాప్తో పిన్ను జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది.  
 
ఈ యాప్తో రూ.10వేల వరకున్న లావాదేవీ చేసుకోవచ్చు. రోజుకు రూ.20,000 వరకు లావాదేవీలను భీమ్తో ముగించుకోవచ్చు. మొబైల్ వాలెట్ యాప్ ద్వారా అయితే మొదట దానిలో నగదు నింపి, తర్వాత వాడుకోవాలి. కానీ ఈ యాప్లో నగదు నింపాల్సినవసరం లేదు. భీమ్ యాప్ అచ్చం డెబిట్ కార్డు మాదిరి కస్టమర్ల ఫోన్కు డైరెక్ట్గా బ్యాంకు అకౌంట్ లింక్ అయి ఉంటుంది. కాబట్టి పేమెంట్లు వెనువెంటనే జరిపోతాయి.  దీనిపై వ్యాపారులు ఎలాంటి ఆందోళనలు చెందాల్సినవసరం ఉండదు. 
 
ఎస్బీఐ, ఐసీఐసీఐ, యాక్సిస్, హెచ్డీఎఫ్‌సీ వంటి దిగ్గజ బ్యాంకులతో పాటు అన్ని యూపీఐ కనెక్ట్  బ్యాంకులన్నీ భీమ్ను అంగీకరిస్తాయి. యూపీఏతో సంబంధం లేని బ్యాంకులు కూడా ఐఎఫ్ఎస్సీ నెంబర్తో భీమ్ ద్వారా నగదు పొందుతాయి.