గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , గురువారం, 1 జూన్ 2017 (05:47 IST)

ఆన్‌లైన్‌లో ఔషధాల అమ్మకం విప్లవమా.. ప్రాణాంతకమా?

రోగమొస్తే మనకు దగ్గర్లో ఉన్న వైద్యుడి వద్దకు వెళ్లి చూపించుకునే పద్దతి దాదాపుగా వందేళ్లకు పైగా చలామణిలో ఉంది. రోగికి, డాక్టరుకు మధ్య ప్రత్యక్ష సంబంధంలో కొనసాగిన ఈ తరహా వైద్య ప్రక్రియ ఇప్పుడు ఒక సునామీ బారిన పడి కొట్టుమిట్టులాడుతోంది. అదేమిటంటే.. మనక్

రోగమొస్తే మనకు దగ్గర్లో ఉన్న వైద్యుడి వద్దకు వెళ్లి చూపించుకునే పద్దతి దాదాపుగా వందేళ్లకు పైగా చలామణిలో ఉంది. రోగికి, డాక్టరుకు మధ్య ప్రత్యక్ష సంబంధంలో కొనసాగిన ఈ తరహా వైద్య ప్రక్రియ ఇప్పుడు ఒక సునామీ బారిన పడి కొట్టుమిట్టులాడుతోంది. అదేమిటంటే.. మనక్కావలిసిన మందులను డాక్టర్ సూచించిన షాపులో కాకుండా ఆ ప్రిస్క్రిప్షన్‍ని స్కాన్ చేసి ఆన్‍‌లైన్‍‌లో ఔషధ సరఫరా చేస్తున్న కంపెనీలకు పంపించి అక్కడి నుంచి చౌక ధరకు ఇంటికే తెప్పించుకోవడం. 
 
అయితే డాక్టర్ల ప్రత్యక్ష ప్రమేయంతో సంబంధం లేకుండా ఇలా తక్కువ ధరకు వస్తున్నాయని ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసి ఇంటికి నేరుగా తెప్పించుకోవడం అనే అలవాటు రోగుల ప్రాణాలకే ముప్పు అని, దీన్ని సాకుగా తీసుకుని యువత మత్తు, నిద్రమాత్రలను అలవాటు చేసుకుంటే జాతి భవిష్యత్తే నిర్వీర్యమయిపోతుందని ఆరోగ్య వైద్య రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
ఆన్‌లైన్‌లో ఔషధాలను విక్రయించే పద్ధతికి కేంద్రం అనుమతిస్తున్న నేపథ్యంలో దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దీన్ని వ్యతిరేకిస్తూ రెండ్రోజుల కింద దేశవ్యాప్తంగా మెడికల్‌ షాపులను బంద్‌ చేశారు. సామాన్య రోగులకు ఈ పద్ధతి అందుబాటులో ఉండే వ్యవహారం కాదని పేర్కొంటున్నారు. మరోవైపు చిన్నపాటి మందుల దుకాణాల ఉనికి ప్రశ్నార్థకం కానుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
డాక్టర్‌ రాసిన చీటీలోని మెడిసిన్స్‌ను ఆన్‌లైన్‌లో కొన్నట్లయితే అవి డాక్టర్‌ రాసిన కంపెనీకి చెందినవే కావొచ్చు.. కాకపోవచ్చు. ఆన్‌లైన్‌ దుకాణాదారులు తమకు చౌకగా లభించే నాసిరకం ఫార్మసీ కంపెనీల మందులను సొంత లాభం కోసం కట్టబెట్టవచ్చు. ఆన్‌లైన్‌లో ఇలాంటివి విక్రయిస్తే రోగులు నష్టపోతారు. ఒక్కోసారి ప్రాణహాని జరిగే ప్రమాదముంది. డాక్టర్‌ రాసినవి కాకుండా వేరే మెడిసిన్‌ ఇస్తే అవి రియాక్షన్‌కు దారితీసి వికటించే ప్రమాదముంది అంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 
ఆన్‌లైన్‌లో మందుల విక్రయం అత్యంత ప్రమాదకరం. మందుల చీటీ లేకుండా కొనుగోలు చేయడమే తప్పు. అలాంటిది ఆన్‌లైన్‌ అనేది అందుకు విరుద్ధం. పైగా రోగి తనకు ఇష్టమైన, ఇష్టమైనన్ని మెడిసిన్స్‌ కొని వాడితే అది ప్రాణాంతకం కూడా అవుతుంది. అమెరికా వంటి దేశాల్లో డాక్టర్‌ మందుల చీటీ లేకుండా మందులు ఇవ్వరు అని వైద్యులు చెబుతున్నారు.
 
ఇంత ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ రోగులు ఇప్పుడు ఎక్కువగా ఆన్ లైన్ లోనే ఔషధాలు తీసుకోవడానికి ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నారంటే బలమైన కారణ ఉంది. ప్రభుత్వం సూచిస్తున్న విధంగా చౌక ధరలకు లబించే జెనరిక్ మందులను రాయడం పక్కన పెట్టేసిన వైద్యులు మందుల కంపెనీలకు లాభాలు, తనకు వాటా వచ్చే విధంగా అసలు ధరకు కొన్ని రెట్లు అధికంగా అమ్మేలా మందుల షాపులను మేనేజ్ చేస్తున్నారు. 
 
ఉదాహరణకు డయాబెటిస్ వ్యాధికి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వైద్యులు సిఫార్సు చేస్తున్న ఔషధం మెట్‌ఫార్మిన్ కలిగిన మాత్ర. అది మన మార్కెట్లో గ్లిమ్‌పెరైడ్, డయాప్రైడ్ వంటి బ్రాండ్ పేర్లతో అమ్ముతున్నారు. కానీ డాక్టర్ సూచించే మందుల షాపులో కొనే ధరకు, ఆన్‌లైన్ ఔషద కంపెనీలు ఆపర్ చేస్తున్న ధరకు కనీసం రెండు రెట్లు తేడా ఉంటోంది. మెట్ ఫార్మిన కలిగిన గ్లిమ్‌పెరైడ్  30 మాత్రలను (మూడు స్ట్రిప్‌లు) మందుల షాపులో 120 రూపాయలకు అమ్ముతుంటే అదే ఆన్‌లైన్‌లో 30 నుంచి 40 రూపాయల లోపు ధరకే ఇస్తున్నారు. 
 
ఇంత భారీ వ్యత్యాసానికి కారణం మందుల కంపెనీలనుంచి డాక్టర్లు, షాపుల వాళ్లు ఆశిస్తున్న అధిక కమిషన్లు. మన దేశంలో నూటికి 95 శాతం మంది వైద్యులు ఇప్పటికే బడా మందుల కంపెనీలకు అమ్ముడుపోయారు. ఆ కంపెనీల రెప్రజింటేటివ్స్ ఇచ్చే భారీ తాయిలాల ప్రలోభాలకు లోబడిపోయారు. అవసరం లేకున్నా చిన్న జబ్బులకు కూడా నూరు 150 రూపాయల ఖర్చు అయ్యే మందులను రాసిస్తూ వీరు వైద్యులంటేనే ప్రజలు పారిపోయే పరిస్థితిని తీసుకువచ్చారు. 
 
ఈ నేపథ్యంలో  ప్రజల ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చే్స్తున్న వైద్యుల మాటలు జనం విశ్వసించని వాతావరణం ఏర్పడిపోయింది. మందుల కంపెనీలకు అమ్ముడుపోయిన డాక్టర్లు, వైద్య సంస్థలూ ముందుగా తమ కార్పొరేట్ అనుకూల విధానాలను నిలిపివేసి చౌక ధరలకు మందులను అందుబాటులోకి కాకుండా చేస్తే వీరు ఎన్ని ధర్మపన్నాలు పన్నినా జనం నమ్మరనేది సత్యం.