గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శుక్రవారం, 24 ఫిబ్రవరి 2017 (04:25 IST)

స్టెంట్‌ ధరపై మార్కెట్ స్టంట్ : కృత్రిమ కొరతకు సంస్థలు, కార్పొరేట్ ఆసుపత్రుల కుట్ర

ఇన్నాళ్ల దోపిడికి అడ్డుకట్టపడే ప్రమాదం ఉండటంతో ప్రభుత్వం నిర్దేశించిన తక్కువ ధరకు స్టెంట్‌లను అమ్మలేమంటూ సాకు చెప్పి వాటిని మార్కెట్లోనే లేకుండా తరలించేస్తున్నారు.

గుండె రోగులకు అత్యవసరమైన స్టెంట్ల అమ్మకం పేరిట గత పదేళ్లుగా సాగుతున్న నిలువుదోపిడీపై ప్రభుత్వం కొరడా ఝళిపించడంతో స్టంట్ తయారీదారులు, కార్పొరేట్ ఆసుపత్రి జలగల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఇన్నాళ్ల దోపిడికి అడ్డుకట్టపడే ప్రమాదం ఉండటంతో ప్రభుత్వం నిర్దేశించిన తక్కువ ధరకు స్టెంట్‌లను అమ్మలేమంటూ సాకు చెప్పి వాటిని మార్కెట్లోనే లేకుండా తరలించేస్తున్నారు. కేంద్రం ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలంటే  స్టంట్ తయారీ సంస్థలు, వైద్య సంస్థలు ఆడుతున్న దొంగ నాటకకానికి భయపడకూడదని, భారత్ మార్కెట్‌ను వీళ్లు ఎలా వదులుకుంటారో చూద్దామని ప్రజలు కోరుకుంటున్నారు. 
 
కేవలం రూ.30 వేల విలువైన వస్తువును రూ.2 లక్షలకు ఎవరైనా అమ్ముతారా? అలా అమ్మితే కొనేవాళ్లుంటారా? కానీ హృద్రోగులకు అవసరమైన స్టెంట్లను దేశంలో ఇన్నాళ్లూ ఇదే ధరకు విక్రయించారు. స్టెంట్ల తయారీ కంపెనీలతోపాటు డిస్ట్రిబ్యూటర్లు, డాక్టర్లు కలసి భారీగా సొమ్ము చేసుకున్నారు. పేద రోగులు మాత్రం మరో దిక్కులేక స్టెంట్ల కోసం రూ.లక్షలు ఖర్చు చేశారు. కొందరు ఆస్తులు సైతం అమ్ముకున్నారు. 
స్టెంట్ పేరిట జరుగుతున్న దోపిడీపై దేశవ్యాప్తంగా గగ్గోలు రేగింది. సంపన్నులు, సామాన్యులు అనే తేడా లేకుండా అందరికీ తక్కువ ఖర్చుతో నాణ్యమైన స్టెంట్లను అందుబాటులోకి తీసుకురావాలన్న డిమాండ్లు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో నేషనల్‌ ఫార్మాస్యూటికల్‌ ప్రైసింగ్‌ అథారిటీ (ఎన్‌పీపీఏ) రంగంలోకి దిగింది. స్టెంట్ల తయారీకి అయ్యే వాస్తవ ఖర్చుపై అధ్యయనం చేసింది. ఒక్కో స్టెంట్‌ తయారీకి  రూ.30 వేల కంటే ఎక్కువ ఖర్చు కాదని తేల్చింది.
 
కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్‌ లిస్ట్‌ ఆఫ్‌ ఎసెన్షియల్‌ మెడిసిన్స్‌’ జాబితాలో స్టెంట్‌ను కూడా చేర్చింది. ఈ జాబితాలో చేర్చిన వస్తువుల ధరలను కంపెనీలు నిర్ణయించలేవు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే కంపెనీలు తమ ఉత్పత్తులను విక్రయించాల్సి ఉంటుంది. స్టెంట్ల ధరలపై ఫిబ్రవరి 13న ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించింది. గతంలో రూ. 30 వేల నుంచి రూ.75 వేల వరకు ధర ఉన్న మెటల్‌ స్టెంట్‌ను ఇకపై రూ.7,260కే అమ్మాలని మార్గదర్శకాలు జారీ చేసింది. డ్రగ్‌ ఎల్యూటింగ్‌ స్టెంట్‌ ధర గతంలో రూ.40 వేల నుంచి రూ.2 లక్షలు పలికేది. ఇప్పుడు దాన్ని రూ.29,600కే విక్రయించాలని కేంద్రం స్పష్టం చేసింది.
 
స్టెంట్ల ధరను కేంద్ర ప్రభుత్వం భారీగా తగ్గించడంతో.. భారీగా సొమ్ము చేసుకునే అవకాశం లేక బడా కంపెనీలు కొత్త నాటకానికి తెరతీసినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ధరలను మళ్లీ పెంచే దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు కంపెనీలు ఆసుపత్రుల నుంచి స్టెంట్లను వెనక్కి తీసుకుంటున్నాయి. తగ్గించిన ధరలకు స్టెంట్లను విక్రయించలేమని చెబుతున్నాయి. ముఖ్యంగా విదేశీ కంపెనీలు రీలేబులింగ్‌ పేరుతో తమ స్టెంట్లను మార్కెట్‌నుంచి వెనక్కి రప్పిస్తున్నాయి. దీంతో ఆసుపత్రుల్లో మేలురకం స్టెంట్ల కొరత ఏర్పడింది. ప్రీమియం బ్రాండ్‌(నాణ్యమైన) స్టెంట్లు అందుబాటులో లేక హైదరాబాద్‌లో పదుల సంఖ్యలో ఏంజియోప్లాస్టీ చికిత్సలు వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతిఏటా లక్ష మంది హృద్రోగులు స్టెంట్లు వేయించుకుంటున్నారు.
 
ప్రభుత్వం ముందస్తు సన్నద్ధత లేకుండా స్టెంట్ల ధరలను తగ్గించడం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తాయని వైద్యరంగ నిపుణులు చెబుతున్నారు. తగ్గించిన ధరలకే విక్రయించేలా విదేశీ కంపెనీలను సైతం ఒప్పించిన తర్వాతే నిర్ణయాన్ని ప్రకటిస్తే బాగుండేదని పేర్కొంటున్నారు. కంపెనీల ఒత్తిడికి లొంగకుండా నిర్దేశించిన ధరలకే నాణ్యమైన స్టెంట్లను సరఫరా చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పేద రోగులు నష్టపోకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. స్టెంట్ల కంపెనీలకు భారత్‌ అతిపెద్ద మార్కెట్‌. ఆయా కంపెనీలు ఇక్కడున్న అవకాశాలను ఎక్కువ కాలం వదులుకోలేవని నిపుణులు చెబుతున్నారు. కృత్రిమ కొరత సృష్టించి, ఇంకెన్నో రోజులు ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్‌ చేయలేవని అంటున్నారు.