శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 15 సెప్టెంబరు 2017 (15:40 IST)

జీఎస్టీలోకి ఇంధన ధరలు? : త్వరలో కేంద్రం నిర్ణయం...!!

దేశంలో పెట్రోల్ ధరలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. గత రెండు నెలల్లో లీటరు పెట్రోల్‌పై ఏకంగా రూ.9 పెరిగింది. దీంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ వ్యతిరేకత లేకుండా చేసేందుకు కేంద్ర ప్రభుత్వ

దేశంలో పెట్రోల్ ధరలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. గత రెండు నెలల్లో లీటరు పెట్రోల్‌పై ఏకంగా రూ.9 పెరిగింది. దీంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ వ్యతిరేకత లేకుండా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అదే... పెట్రోల్, డీజిల్‌ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం. జనాగ్రహం నుంచి తప్పించుకునేందుకు ఇదొక్కటే పరిష్కార మార్గంగా భావిస్తోంది. 
 
గత రెండు నెలలుగా ఒక్కో ఐదు పది పైసలు చొప్పున పెరుగుతూ వస్తున్న ఇంధన ధరలు ఇపుడు లీటర్ పెట్రోల్ 75 రూపాయలకు చేరింది. డీజిల్ 64 రూపాయలకు చేరింది. ఫలితంగా గత 2 నెలల్లో ఏకంగా రూ.9 పెరుగుదల కనిపించింది. ఇది మూడేళ్ళ గరిష్ట ధరకు సమానం. పైగా, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారీ తగ్గింపులు అంటూ ఏమీ లేవు. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా రోజువారీ రేట్ల నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి జానాగ్రహం వెల్లువెత్తుతోంది. దీంతో ఇంధన ధరలు కంట్రోల్ చేయటంపై దృష్టిసారించింది. 
 
దేశవ్యాప్తంగా రోజురోజు ధర పెరిగినట్లే.. ప్రజల్లోనూ ఆగ్రహావేశాలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ ధరలను చూపించి లీటర్ 100 రూపాయలు చేస్తారా? అని నిలదీస్తున్నారు. ఇంధన ధరలపై బీజేపీ పార్టీలోనే అంతర్మథనం మొదలైంది. ధరల పెరుగుదల మంచిది కాదని.. వెంటనే కేంద్రం చర్యలు తీసుకోవాలని రాజ్యసభ ఎంపీ సుబ్రమణ్యస్వామి సైతం కోరారు. ధరలు దిగొచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీని కోరారు.
 
ఇంధన ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే.. 12 శాతం శ్లాబ్‌లో అయితే హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ 38 రూపాయలు, డీజిల్ 36 రూపాయలకు దిగివస్తోంది. అదే 18 శాతం స్లాబ్‌లో అయితే పెట్రోల్ 40, డీజిల్ 38 రూపాయలకే దొరుకుతుంది. అదే 28 శాతం స్లాబ్ కింద పరిగణించినా పెట్రోల్ 43, డీజిల్ 41 రూపాయలకే లభించనుంది. 
 
ప్రస్తుతం పెట్రోల్ ధరలపై ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్, డీలర్ కమిషన్ ఇలా భారీగా పన్నులు విధిస్తున్నారు. ఇదేసమయంలో.. పెట్రోల్, డీజిల్‌ను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తేనే ధరలు తగ్గుతాయని కేంద్ర పెట్రోలియం శాఖామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభిప్రాయపడ్డారు. పెట్రో ధరలు వాస్తవంగా, న్యాయంగా ఉండాలంటే జీఎస్టీ పరిధిలోకి తీసుకురావటం ఒక్కటే ఏకైక మార్గం అన్నారు. ఇక తుది నిర్ణయం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు.. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తీసుకుని రావాల్సి ఉంది.