శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. కథనాలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 29 డిశెంబరు 2017 (13:41 IST)

కారు, బైకులకు బీమా చేస్తారు కానీ తమకు మాత్రం... 2018లోనైనా నిర్ణయించుకోండి...

జీవిత బీమా. జీవితంలో ఇది చాలా కీలకమైన విషయం. కుటుంబంలో ఆర్జించే వ్యక్తి అనుకోకుండా ఏదైనా దురదృష్ట సంఘటన కారణంగా దూరమైనప్పుడు అతనిపై ఆధారపడిన వారికి భరోసా ఎలా? ఈ విషయాన్ని చాలామంది ఆలోచించరు. కానీ ఈ దిశగా ఆలోచన చేయాల్సిందే. కుటుంబ యజమాని దూరమైనప్పుడు

జీవిత బీమా. జీవితంలో ఇది చాలా కీలకమైన విషయం. కుటుంబంలో ఆర్జించే వ్యక్తి అనుకోకుండా ఏదైనా దురదృష్ట సంఘటన కారణంగా దూరమైనప్పుడు అతనిపై ఆధారపడిన వారికి భరోసా ఎలా? ఈ విషయాన్ని చాలామంది ఆలోచించరు. కానీ ఈ దిశగా ఆలోచన చేయాల్సిందే. కుటుంబ యజమాని దూరమైనప్పుడు అతడిపై ఆధారపడి బ్రతికేవారికి ఆర్థిక రక్షణ బీమా పాలసీల ద్వారా లభిస్తుంది. వీటిని ఎలా ఎంపిక చేసుకోవాలి.
 
1. బీమా పాలసీలు తీసుకునే ముందు పాలసీదారుడు అతనికి ఉండే లక్ష్యాలతో పాటు బాధ్యతలను దృష్టిలో పెట్టుకోవాలి.
 
2. వీటి ఆధారంగా ఎలాంటి పాలసీని ఎంచుకోవాలో నిర్ణయించుకోవాలి. ఎలాగంటే 20 ఏళ్ల వ్యక్తికి వుండే అవసరాలతో పోలిస్తే వివాహమై, పిల్లలున్న 40 ఏళ్ల వ్యక్తి అవసరాలు విభిన్నంగా ఉంటాయి. కాబట్టి వాటిని అనుసరించి పాలసీలు ఎంపిక చేసుకోవాలి.
 
3. వయసుతో నిమిత్త లేకుండా సంపాదించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వారివారి పేరు మీద ఓ టర్మ్‌ పాలసీ ఉండేలా చూసుకోవాలి. సంపాదన ప్రారంభం కాగానే వెంటనే పాలసీని తీసుకోవడం ఉత్తమం.
 
4. ఎంత మొత్తంలో పాలసీ తీసుకోవాలన్నది కూడా ముఖ్యమే. ప్రస్తుత ఆదాయం, భవిష్యత్తులో ఎన్నాళ్లపాటు పనిచేస్తారన్నదాని ఆధారంగా పాలసీ మొత్తాన్ని నిర్ణయించుకోవాలి. చిన్న వయసులోనే పాలసీ తీసుకోవడం ద్వారా ప్రీమియం ధరలు చాలా తక్కువగా ఉంటాయి. వయసు పెరుగుతున్న కొద్దీ ప్రీమియం కూడా పెరుగుతూ ఉంటుంది. 
 
5. టర్మ్‌ పాలసీలతో పాటు, క్రిటికల్‌ ఇల్‌నెస్‌, డిజేబిలిటీ బీమా పాలసీలను తీసుకోవడాన్ని మర్చిపోకూడదు. ఎందుకంటే పాలసీదారుడి మరణించినప్పుడే కాదు, అతడికి అనుకోని వ్యాధులు, ప్రమాదాల వల్ల సంపాదన ఆగిపోయినప్పుడు కూడా ఆర్థిక రక్షణ ముఖ్యమే. అందువల్ల పూర్తి టర్మ్‌ పాలసీతోపాటు, ప్రత్యేకంగా వీటిని తీసుకోవాలి.
 
6. పిల్లల చదువుల కోసం ప్రతి తల్లిదండ్రులూ ఎంతో కష్టపడుతుంటారు. అందుకే ఇది ఆర్థిక ప్రణాళికల్లో ఎంతో కీలకాంశం. ఇలా పిల్లల కోసం ప్రత్యేకంగా మదుపు చేయాలనుకునే వారికి పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొదించిన చైల్డ్ ప్లాన్స్ వుంటాయి. వీటిని తరచి తరచి చూసి మదుపు చేసుకోవాలి. ఏదైనా అనుకోని సంఘటన జరిగి పాలసీదారుడు దూరమైనప్పుడు.. పిల్లల పాలసీలు అతని బాధ్యతను తీసుకుంటాయి. 
 
7. పదవీ విరమణ సమయం వచ్చాక చాలామంది చేతిలో చిల్లిగవ్వ లేదే అని బాధపడుతుంటారు. అందుకే సంపాదన ప్రారంభించినప్పటి నుంచే క్రమశిక్షణతో పదవీ విరమణ తదనంతర జీవితానికి అవసరమైన నిధి కోసం మదుపు చేయాలి. ఇందుకోసం పలు పొదుపు, పింఛను పాలసీలు అందుబాటులో ఉన్నాయి. 
 
8. ఐతే కొన్ని పాలసీలు ఆదుకునేవిగా వుండవు. కాబట్టి అవసరానికి తగినవి చూసుకుని పాలసీ చేసుకోవాల్సిన అవసరం వుంది.
 
9. బీమా పాలసీలు తీసుకునేటప్పుడు పదిమంది ఏజెంట్లను సంప్రదించి ఉపయోగకరమైన పాలసీలు ఏమిటో తెలుసుకోవాలి.
 
10. కొంతమంది ఏజెంట్లు పాలసీ వివరాలను పూర్తిగా తెలియజేయకుండా మాయమాటలతో పాలసీలు కట్టించేస్తారు. కానీ ఆ తర్వాత ఆ పాలసీలకు ప్రీమియం చెల్లించేటపుడు ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి అవన్నీ చెక్ చేసుకుని బీమా పాలసీలు తీసుకోవాల్సి వుంటుంది.