అంతర్జాతీయ బాలల సినిమా పండుగ.. కథా కమామీషు..!

Animation Film
Ganesh|
FILE
చిన్నా, పెద్దా తేడాల్లేకుండా అందర్నీ అలరించే బలమైన వినోద సాధనం సినిమా. అదీ చిన్న పిల్లల సినిమాలంటే ఇక ఆనందాలకు హద్దేముంటుంది. అలాంటి సినిమాలన్నీ మూటగట్టుకుని ఒక్కచోటికే వస్తే... పండుగే పండుగ...! ప్రపంచం నలుమూలల నుంచి పిల్లల సినిమాలన్నీ ఒక్కటై.. రాష్ట్ర రాజధాని నగరంలో వాలిపోయే రోజు ఒకటుంది. అదే "అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం".

పండిట్ జవహర్‌‌‌లాల్ నెహ్రూ పుట్టిన రోజైన నవంబర్ 14న మొదలై 20వ తేదీన ముగిసే ఈ పండుగ.. ప్రతి రెండేళ్లకు ఓసారి జరుగుతుంది. పిల్లలంటే ఎంతో ఇష్టపడే చాచాజీ 1995వ సంవత్సరం మే నెలలో "చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా (సీఎఫ్ఎస్ఐ)"ను ఏర్పాటు చేశారు. దీనికి మొట్టమొదటి అధ్యక్షుడిగా పండిట్ హృదయ్‍‌నాథ్ కుంజ్రా పని చేశారు.

బాలల్లో సృజనాత్మక శక్తిని, వ్యక్తిగత వికాసాన్ని పెంపొందించాల్సిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని.. బాలల కోసం ప్రత్యేకంగా సినిమాలను నిర్మించేందుకు, పంపిణీ చేసేందుకు అవసరమైన ఓ ప్రత్యేక సంస్థగా సీఎఫ్ఎస్ఐను రూపొందిచారు. అలా సీఎఫ్ఎస్ఐ తీసిన మొదటి చిత్రం "జల్‌దీప్". ఇది 1957లో వీనస్ పిల్లల సినిమా పండుగలో ప్రథమ బహుమతిని సాధించింది. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా, యానిమేషన్, చిన్న చిన్న డాక్యుమెంటరీలు కూడా ఈ సంస్థ పిల్లల కోసం నిర్మిస్తోంది.
ఫస్ట్ ఫ్రైజ్ "బంగారు ఏనుగు"
60 నిమిషాలకంటే ఎక్కువ నిడివిగల చిత్రాల విభాగంలో ఉత్తమ కథా చిత్రాన్ని ఎంపికచేసి బంగారు ఎనుగు, రెండు లక్షల రూపాయల నగదును ప్రదానం చేస్తారు. ద్వితీయ ఉత్తమ చిత్రానికి వెండి ఏనుగు, లక్ష రూపాయల నగదును బహుమతిగా అందిస్తారు. అలాగే 60 నిమిషాలకంటే తక్కువ...


చిన్నారుల్లో చక్కటి సంస్కృతిని, విజ్ఞానాన్ని పెంపొందించటం సీఎఫ్ఎస్ఐ లక్ష్యాలలో ప్రధానమైనవి. ఈ సంస్థ దేశంలోనూ, విదేశాల్లోనూ జరిగే జాతీయ, అంతర్జాతీయ స్థాయి చలన చిత్రోత్సవాలలో పాల్గొని తాము నిర్మిస్తున్న చిత్రాలకు ప్రచారం చేసేది. ఆ తరువాత 1968లో సీఎఫ్ఎస్ఐ పనితీరుపై అధ్యయనం చేసిన కేంద్ర ప్రభుత్వం నిపుణుల సలహా మేరకు అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలను జరపాలని నిర్ణయం తీసుకుంది.

ఆ విధంగా.. దేశంలోని బాలబాలికలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బాలల చిత్రాల్లోని సరికొత్త ధోరణులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆకళింపు చేసుకునేందుకు వీలుగా 1979లో ముంబయి నగరంలో అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలను నిర్వహించారు. అలా మనదేశంలో శ్రీకారం చుట్టిన ఈ ఉత్సవాలకు ప్రతిష్టాత్మకమైన పారిస్ అంతర్జాతీయ నిర్మాతల సంఘం గుర్తించింది.

అలాగే.. పారిస్‌లోని "ది ఇంటర్నేషనల్ సెంటర్ ఆఫ్ ఫిల్మ్ ఫర్ చిల్డ్రన్ అండ్ యంగ్ పీపుల్ (సీఫేజ్) 'ఎ' గ్రేడ్" చలన చిత్రోత్సవంగా వర్గీకరించింది. ఇంకా.. పారిస్, లాస్‌ఏంజిల్స్, మాస్కో తదితర ప్రాంతాలలో జరిగే చలన చిత్రోత్సవాలతో సరిసమానమైన మేటి ఉత్సవంగా పరిగణించింది.

పదిరోజులపాటు వైభవంగా జరిగే ఈ ఉత్సవాలు ముంబయి తరువాత చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, భువనేశ్వర్, ఢిల్లీ, త్రివేండ్రం, ఉదయ్‌పూర్, హైదరాబాద్.. నగరాలలో వరుసగా నిర్వహించారు. అయితే 1997వ సంవత్సరం తరువాత హైదరాబాద్ నగరాన్ని భారత అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలు నిర్వహించే శాశ్వత వేదికగా ప్రభుత్వం నిర్ణయించింది. అప్పట్నించి ప్రతి రెండేళ్లకోసారి ఈ ఉత్సవాలను నగరం వేదికగా మారింది.

ఈ ఉత్సవాల్లో.. 60 నిమిషాలకంటే ఎక్కువ నిడివిగల చిత్రాల విభాగంలో ఉత్తమ కథా చిత్రాన్ని ఎంపికచేసి బంగారు ఎనుగు, రెండు లక్షల రూపాయల నగదును ప్రదానం చేస్తారు. ద్వితీయ ఉత్తమ చిత్రానికి వెండి ఏనుగు, లక్ష రూపాయల నగదును బహుమతిగా అందిస్తారు. అలాగే 60 నిమిషాలకంటే తక్కువ నిడివి కలిగిన ఉత్తమ లఘు కథా చిత్రానికి వెండి ఏనుగు, లక్ష రూపాయల బహుమతిని ఇస్తారు.

ఉత్తమ యానిమేషన్ చిత్రానికి వెండి ఏనుగు, లక్ష రూపాయల నగదు.. ఉత్తమ కథారహిత చిత్రానికి వెండి ఏనుగు, లక్ష రూపాయల నగదును బహుమతిగా అందజేస్తారు. ఇక ఉత్తమ దర్శకుడికి వెండి ఏనుగు, లక్ష రూపాయలు.. ఉత్తమ సంగీతాని వెండి ఏనుగు, లక్ష రూపాయల నగదు.. ఉత్తమ బాలనటుడికి, నటికి వెండి ఏనుగు లక్ష రూపాయల నగదును బహుమతిగా అందిస్తారు.


దీనిపై మరింత చదవండి :