శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By ivr
Last Modified: గురువారం, 31 జులై 2014 (19:55 IST)

దగ్గు మందే కదా అని తాగేయకండలా...? ఇవి తెలుసుకోండి ప్లీజ్...

దగ్గు రాగానే గబుక్కున ఇంట్లో ఉన్న ఏదో ఒక దగ్గు మందును గొంతులో పోసేసుకుంటారు చాలామంది. నిజానికి ఈ దగ్గు మందును ఎలాబడితే అలా వాడకూడదంటున్నారు వైద్యులు. దగ్గు మందు తాగే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. దగ్గు మందు తాగడానికి జాగ్రత్తలా అనుకునేరు. ఈ దగ్గు మందులు సామాన్యమైనవి కావండీ బాబు.
 
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే... 
 
యాంటిడిప్రేసంట్స్... అంటే మనోవ్యాకులతను పోగొట్టేందుకు కొందరు మందులు తీసుకుంటుంటారు. అటువంటివారు ఎట్టి పరిస్థితుల్లో దగ్గు మందును సేవించరాదు. అలా సేవిస్తే ప్రాణానికే అపాయం కలుగవచ్చంటున్నారు వైద్యులు. సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తడం వల్ల ఇలాంటి ప్రమాదకర పరిణామాలు సంభవించవచ్చు.
 
దగ్గు మందు తీసుకునేటపుడు దానితోపాటు ఇతర దగ్గు మందులు కానీ, ఎలర్జీ సంబంధిత మందులు లేదంటే నిద్ర పట్టేందుకు ఉపయోగించే ఔషధాలు కూడా వాడరాదు. ఇలా తీసుకోవడం వల్ల అది మానసిక పరిస్థితిపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ఇలాంటి వాటిని తీసుకోరాదు. 
 
అంతేకాదు దగ్గు మందు తాగేసి ఆ తర్వాత మద్యం సేవించకూడదు. ఎందుకంటే మద్యం తీసుకోవడం వల్ల దగ్గు మందుపై అది ప్రభావం చూపి సైడ్ ఎఫెక్ట్ కలిగే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని రకాలైన దగ్గు మందులు తాగినప్పుడు తల తిరగడం, కళ్లు తిరిగినట్లుగా ఉండటం, తలనొప్పి, చూపు మందగించడం, కళ్లు మూతలు పడిపోవడం, వాంతులు వచ్చినట్లు ఉండటం వంటి లక్షణాలు కనబడితే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.
 
కొన్ని దగ్గు మందులను తీసుకున్నప్పుడు గాలి పీల్చడంలో సమస్య తలెత్తవచ్చు. అలాగే గుండె కొట్టుకోవడంలో వేగం పెరగవచ్చు. ఇంకా శరీరంపై చిన్నచిన్న దద్దుర్లు కూడా కనబడవచ్చు. ఇలాంటి స్థితికి కారణం దగ్గు మందును తీసుకోవాల్సిన డోస్ కంటే అధికంగా తీసుకున్నట్లు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దగ్గు మందు తీసుకున్నవారు వాహనాలను నడిపకుండా ఉండటం మంచిది. ఎందుకంటే మందు తీసుకున్నవారిలో కాస్త మత్తుగా ఉన్నట్లు అనిపిస్తుంది.
 
ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, దగ్గు మందుల్లో చాలామటుకు పేరాసిటమాల్ కూడా కలిసి ఉంటుంది. అందువల్ల దగ్గు తగ్గుతుందని అదేపనిగా మందు తీసుకుంటే కాలేయంపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా అది దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది.