గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By PNR
Last Updated : గురువారం, 17 జులై 2014 (13:18 IST)

చక్కెర - ప్రొస్టేట్ కేన్సర్‌కు చెక్ పెట్టే జామకాయ!

పచ్చిగా, దోరగా, పండుగా ఎలా ఉన్నా అమితయిష్టంగా తినగలిగే కాయ.. జామకాయ. ఇది ఉష్ణమండల ప్రాంతమైన ఆసియా దేశాలలో ఎక్కువగా పండుతుంది. ఆకుపచ్చ రంగు తోలు కలిగి ఉంటుంది. బాగా పండినప్పుడు పండు పసుపు వర్ణంలోకి మారుతుంది. తొక్కలోపల కండ గులాబీరంగులో కానీ, తెలుపురంగులోకానీ, ఎరుపులో కానీ ఉంటుంది. జామకాయ లేదా పండును ఆరగించడం వల్ల అనేక ఆరోగ్య లాభాలు ఉన్నాయి. 
 
ప్రధానంగా జామకాయలో విటమిన్‌లు, పీచు, మినరల్స్‌ పుష్కలంగా ఉన్నాయి. ఈ కాయల్లోని పీచు కారణంగా కొలెస్ట్రాల్‌, బీపీ తగ్గుతాయి. బరువు తగ్గడానికి జామ, దోహదపడుతుంది. ఇందులోని కార్బొహైడ్రేట్లు జీర్ణం కావడానికి సమయం పడుతుంది. దాంతో పొట్ట త్వరగా నిండిపోతుంది. ఆకలి వేయడానికీ సమయం పడుతుంది. రోజూ ఓ దోర జామపండు తింటే డయాబెటిస్‌, ప్రొస్టేట్‌ కేన్సర్‌ వంటి మరెన్నో వ్యాధులు రాకుండా నివారించుకోవచ్చు. 
 
పేగుల్లోని అధికంగా ఉన్న మ్యూకస్‌పొరను తొలగించి రక్తవిరేచనాలు తగ్గిస్తుంది. జీవక్రియలో జనించే స్వేచ్ఛాకణాలతో పోరాడి వయసుతో పాటు వచ్చే అల్జీమర్స్‌ వ్యాధి, శుక్లాలు, కీళ్లవాపులు రాకుండా ఆపుతుంది. మలబద్ధకంతో బాధపడేవారికి, జామకాయలోని ఎక్కువగా ఉండే పీచుపదార్థాల వల్ల ఉపశమనం లభిస్తుంది. జీర్ణవ్యవస్థను బలంగా చేస్తుంది. అంతేకాక కడుపులోని మలినాలను, అంటువ్యాధులను కలిగించే జీవులను తొలగిస్తుంది. 
 
బరువు తగ్గాలనుకునేవారికి, పీచు, కొవ్వు లేకపోవటం, తక్కువ కార్బొహైడ్రేట్‌లు కలిగిన జామకాయ తినటం ఎంతో ఉపయోగకరం. జామ చర్మపు రంగును మెరుగుపరుస్తుంది. చర్మవ్యాధులు రాకుండా కాపాడుతుంది. దీనికోసం పచ్చిజామకాయలను తినాలి లేదా జామ పిందెలు, ఆకులు కలిపి తయారుచేసిన మిశ్రమంతో చర్మంపై రుద్దుకోవాలి. పచ్చిపిందెలు, ఆకుల డికాషన్‌, పచ్చికాయరసం, జలుబు నుండి, దగ్గు నుండి ఉపశమనాన్ని ఇస్తాయి. 
 
జామలోని విటమిన్‌ 'సి, కెరోటినాయిడ్స్‌, ఆఫ్‌ఎనోనాయిడ్స్‌, పాలీఫెనాల్స్‌ మొదలైన ఫైటో న్యూట్రియంట్స్‌ దీనిని మంచి యాంటీ ఆక్సిడెంట్‌గా చేశాయి. దానివల్ల పంటినొప్పి, రక్తంలో ఆమ్లం ఎక్కువ అవటం, బ్యాక్టీరియా వల్ల వచ్చే అంటు వ్యాధులు, మ్యూకస్‌ పొర వాపు వల్ల వచ్చే రోగాలు, ఊపిరితిత్తుల్లో రక్తం అధికం కావటం, కండరాలు వంకరపోవటం, మూర్ఛ, అధిక రక్తపోటు, చిగుళ్లవాపు, ఊబకాయం, నోటిలో పుండ్లు, రక్తప్రసరణ సరిగా లేకపోవడం వంటి వాటికి చెక్ పెడుతుంది. అందుకే ఈ పండును పేదల ఆపిల్ పండుగా కూడా వైద్యులు పేర్కొంటారు.