శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By CVR
Last Updated : శనివారం, 18 అక్టోబరు 2014 (16:52 IST)

వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

వర్షాకాలం వచ్చిందంటే రోడ్డు పక్క... చెట్ల క్రింద... వేడి వేడి ఏమైనా తినాలనిపిస్తుంది. అయితే ఏం తినాలో తెలియని అయోమయం. త్వరగా అంటు వ్యాధులు ప్రబలే ఈ కాలంలో జిహ్వకోరే రుచులనే కాదు.. ఆరోగ్యాన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. 
 
వానలో తడుస్తూ ముందుకెళుతున్నప్పుడు రోడ్డు పక్కన పకోడీల బండీ కనిపిస్తే ఆగి తినేయొద్దు. ఈ కాలంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుండంతో జీర్ణ వ్యవస్థ మందగిస్తుంది. బాగా వేయించిన, నూనె ఎక్కువగా వాడిన పదార్థాలు తింటే అవి త్వరగా పొట్టని పాడుచేస్తాయి. జీర్ణం కావడం కూడా కష్టమే.
 
అంతేకాకుండా ఆ దుకాణాలలో ఎటువంటి నూనె వాడారో తెలియదు. అన్ని అంశాలనూ దృష్టిలో పెట్టకుని నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తారన్న నమ్మకం కలిగితే తినొచ్చు. అదీ తరచూ కాదు. ఇక, చాట్ కనబడితే చాలు. ఒకే ఒక్క ప్లేట్ అంటూ మనసు తినమని తొందర చేస్తుంది. చాట్, పానీపూరీల్లో వాడే పదార్థాలు నీటితో చేసినవే. వర్షాకాలంలో వచ్చే చాలా అనారోగ్యాలకు నీళ్లే కారణం. కనుక వాటికీ కాస్త దూరంగా ఉండడం మంచిదే. 
 
వర్షాకాలంలో కృత్రిమ రంగులూ, టేస్టింగ్ సాల్ట్, అజినోమోటో వంటివి ఎక్కువగా వాడే చైనీస్ వంట కాలకూ దూరంగా ఉండటమే మంచిది. వానాకాలంలో ఆకు కూరలపై మురికీ మట్టీ ఎక్కువగా చేరతాయి. ఏ మాత్రం సరిగ్గా శుభ్రం చేయకుండా వండినా డయేరియా సోకడం ఖాయం.

ఇక రొయ్యలూ, చేపలూ వంటివి తీసుకొనేప్పుడు కూడా మితం పాటించడం, పదార్థాలు తజాగా ఉన్నాయో లేవో సరి చూసుకోవడం తప్పనిసరి. కొంత మందికి కాలం ఏదైనా శీతలపానీయాలను తరచూ తాగే అలావాటు ఉంటుంది. 
 
ఇవి ఎంజైముల చర్యలని అడ్డుకొంటాయి. జీవ క్రియలు నెమ్మదిగా సాగే ఈ కాలంలో ఎంజైమ్‌ల చర్య కూడా మందగిస్తే శరీరంలో వ్యాధినిరోధక శక్తి తగ్గుతుంది. ఆరోగ్య సమస్యలబారిన పడే ప్రమాదం ఉంది.