గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By PNR
Last Updated : ఆదివారం, 2 నవంబరు 2014 (16:15 IST)

వయస్సు పైబడేకొద్దీ మస్తు నిద్ర ఎందుకు వస్తుంది?

సాధారణంగా వయస్సు పైబడేకొద్దీ మస్తు నిద్ర వస్తుంది. నిజానికి వృద్ధులకు కంటినిండా సరిగా కునుకే పట్టదని మన దేశంలోనే కాదు ప్రపంచమంతా అనుకుంటుంది. అయితే, ఇది కేవలం భ్రమ మాత్రమేనని, ఆ మాటకొస్తే వారు నిద్రపోయినంతగా మిగిలిన వారు పడుకోనే పడుకోరని పరిశోధకులు తేల్చి చెపుతున్నారు. మన నిద్రలోని నాణ్యతనేది క్రమంగా మన వయసుతోపాటే పెరుగుతూ వస్తుందని వారి పరిశోధనలో తేలింది.
 
సాధారణంగా, ఏదైనా మానసిక ఒత్తిడితో ఉన్నపుడో, ఆరోగ్య సమస్యలు ఉన్నపుడో ఎవరికయినా నిద్ర సరిగా పట్టకపోవడమనేది మామూలు విషయమేనని ఇందుకు వృద్ధులు కూడా అతీతులు కారని చెప్పారు. అయితే, వయసు పెరిగేకొద్ది నిద్ర నాణ్యత గురించి ఫిర్యాదులు తగ్గుతూ వస్తాయన్నారు.
 
పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందిన స్లీప్ అండ్ సిర్కాడియన్ నాడీ జీవ శాస్త్ర విభాగం పరిశోధకులు 150,000 మంది పెద్దలపై తమ సర్వేను నిర్వహించారు. 40 ఏళ్లు దాటిన తర్వాత ఆయా వ్యక్తుల్లో నిద్రించే స్థాయిలు పెరుగుతాయని వారు కనుగొన్నారు. 80 సంవత్సరాల వయసు రాగానే అంతకుముందు జీవితంలో ఎన్నడూ ఎరగనంత చక్కని నిద్ర పోగలుగుతున్నారని వారి పరిశోధనలో తేలింది. 
 
వృద్ధులకు అసలు నిద్రపట్టదనేదానిలో నిజానిజాలు నిగ్గుతేల్చాలనే ఉద్దేశంతో జరిపిన ఈ సర్వేకు డాక్టర్ మైకేల్ గ్రాండనర్ నేతృత్వం వహించారు. వృద్ధులు నిద్రించే సమయం, వారి నిద్రలోని నాణ్యత విషయాన్ని పరిశీలించేందుకు, పరిశోధకులు ఆయా రకాల ఆర్ధిక, సామాజిక స్థాయిలున్న వారిని ఎంచుకున్నారు. వ్యక్తుల జాతి నేపథ్యం, విద్య, ఆరోగ్యం, మానసిక స్థితిగతులు కూడా పరిగణనలోకి తీసుకున్నారు. అన్నింటినీ పోల్చిచూశారు.