శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By CVR
Last Updated : సోమవారం, 20 అక్టోబరు 2014 (16:17 IST)

వేళతప్పి భోజనం చేస్తున్నారా?

నేటి పోటీ ప్రపంచంలో ఇంటింట అందాల పోటీలు రోజూ జరుగుతూనే ఉంటాయి. నా ముఖం అందం చూడు, నా నడుమందం చూడా అంటూ అమ్మాయిలు తమ అందాన్ని అద్దంలో చూసుకుని తెగ మురిసిపోతుంటారు. అయితే ఒక్కో సారి అందవిహీనంగా మారిపోతుంటారు. అందుకు ముఖ్య కారణం వేళతప్పి భోజనం చేయడం. శరీర సౌష్టత, అందంతో ఆకర్షణీయంగా కనిపించాలంటే సరైన వేళల్లో ఆరోగ్యకరమైన ఆహారం తిసుకోవాలి.
 
అందానికి ఆహారం చాలా ముఖ్యం. అదే ఆహారం వేళ కాని వేళల్లో తింటే అధిక బరువుకు కారణం అవుతుందని అంటున్నారు నిపుణులు. ప్రతి రోజూ రాత్రి భోజనం నిద్రపోవడానికి కనీసం రెండు.. మూడు గంటల ముందే కానిస్తే మంచిది. అందులోనూ రాత్రి ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర మధ్య భోజనం చేస్తే ఇంకా మేలు. రాత్రిపూట ఎక్కువగా తినేసి వెంటనే నిద్రపోతే శరీరంలో కొవ్వు చేరిపోవడమే కాదు, నిద్ర కూడా అరకొరగానే పడుతుంది. 
 
సాధారణంగా ఎవరికైనా సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల మధ్య బాగా ఆకలేస్తుంది. ఆ సమయంలో ఏవో చిరుతిళ్లు తినేయడం వల్ల రాత్రి ఆహారం ఎనిమిదికల్లా తినం. కనుక సాయంత్రం వేళల్లో మిర్చీలూ, బజ్జీలూ, పకోడీల్లాంటివి ఎక్కువగా తినేయకుండా చాలా తేలికపాటి అల్పాహారాన్ని తీసుకోవాలి.

ఒక యాపిల్ పండు లేదా గుప్పెడు నట్స్ తింటే మంచిది. పని ఒత్తిడితో నిద్రపోవడానికి కాస్త ముందే భోజనం చేయాల్సి వస్తే మితంగా తినే ప్రయత్నం చేయాలి. లేదంటే నిద్రపోయాక జీర్ణక్రియ చాలా మందకొడిగా సాగుతుంది. అజీర్తి సమస్యలు ఎదురవుతాయి. ఇటువంటి చిన్న చిన్న సూత్రాలను పాటించినట్లైతే అందంగా కళకళలాడతారు.