బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 23 నవంబరు 2015 (16:37 IST)

అల్సర్‌కు మంచి మందులా పనిచేసే సీతాఫలం

కేవలం శీతాకాలం(చలి)లోనే లభ్యమయ్యే పండు సీతాఫలం. దీన్నే షుగర్ ఆపిల్ లేదా కస్టర్డ్ ఆపిల్ అని కూడా అంటారు. ఇందులో విటమిన్లు, లవణాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులోని మీగడలాంటి గుజ్జుతో, ప్రత్యేక రుచితో అందరి నోళ్లలోనూ నీళ్లూరిస్తుంది. ఈ పండును సీజన్‌లో ఎపుడో ఒకటి కాకుండా సీజన్ ముగిసేంత వరకు ప్రతిరోజూ తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి మంచి చేయటమే కాకుండా ఎన్నో పోషక విలువలను శరీరానికి అందిస్తుంది.
 
ముఖ్యంగా, ఈ ఫలంలో కొవ్వు ఏ మాత్రం ఉండదు. ఒక్కో సీతాఫలంలో శక్తి, కార్బొహైడ్రేట్లు, ఫైబర్, విటమిన్ సి, కాల్షియం, ఐరన్ తగిన మోతాదుల్లో ఉంటాయి. నీరసంగా ఉన్నప్పుడు ఈ పండ్లను ఒకటి లేదా రెండు తిన్నట్లయితే శరీరానికి కావాల్సినంత గ్లూకోజ్ లభిస్తుంది. 
 
అంతేకాదు కండరాలను బలోపేతం చేస్తుంది. బలహీనత, సాధారణ అలసటను సైతం దూరం చేస్తుంది. వాంతులు, తలనొప్పికి విరుగుడుగా పనిచేస్తుంది. చర్మవ్యాధులకు మంచి మందుగా పనిచేస్తుంది. ఇందులోని మెత్తని గుజ్జు పిల్లల ఎదుగుదలకు సహకరిస్తుంది. ఎదిగే పిల్లలకు ఎముకల పుష్టిని కలిగిస్తుంది.
 
గుండె సమస్యలకు చెక్ పెడుతుంది. పేగుల్లో ఉండే నులిపురుగుల నివారణలో సీతాఫలం ప్రభావంతంగా పనిచేస్తుంది. ఈ పండు గుజ్జు అల్సర్‌పై చక్కటి మందులాగా ఉపశమనాన్నిస్తుంది. ఆస్తమా ఉన్నవారు, మధుమేహం ఉన్నవారు సీతాఫలాన్ని తినకూడదు. లివర్, మూత్రపిండాల వ్యాధితో బాధపడేవారు సైతం సీతాఫలానికి దూరంగా ఉండాలి.