గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chitra
Last Updated : శనివారం, 6 ఫిబ్రవరి 2016 (09:16 IST)

వేసవిలో పుచ్చకాయతో మేలైన ఆరోగ్యం!!

శివ శివా అంటూ శివరాత్రి చలి నెమ్మదిగా దూరం అయిపోయింది. సూర్యుడు తన ప్రతాపాన్ని చూపడం ప్రారంభించాడు. నిన్న మొన్నటి వరకు హాయిగా బయటికి వెళ్లిపోయిన వాళ్ళు ఇప్పుడు బయటికి వెళ్లాలంటే  సతమతమవుతున్నారు. కొబ్బరినీళ్లు, పళ్లరసాలు సేద తీర్చడానికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా ఈ పండ్లు, పళ్ల రసాలు ఎంతో మేలు చేస్తాయి.
 
ప్రకృతిలో సహజంగా దొరికే పళ్ళలో విటమిన్లు, ఖనిజలకణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవిశరీరం ఆరోగ్యంగా ఉండటానికి ఎంతో అవసరం. పళ్ళల్లో సహజంగా ఉండే చక్కెర శరీరానికి శక్తినిస్తుంది. శరీరంలో పేరుకుపోయే వ్యాధికారకమయిన విషపదార్ధాలని బయటికి పంపేస్తాయి. ప్రతి రోజు ఏదో ఒక రకం పండు తినే అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు ఈ సీజన్‌లో దొరికే  పుచ్చకాయ, అనాస పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. 
 
అనాసలో అనేక పోషక విలువలు, ఆరోగ్యరక్షణకి అవసరమయిన విటమిన్‌ సి ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. రక్తనాళాలలో రక్తం గడ్డకట్టకుండా రక్షణ ఇస్తుంది నెలసరి సక్రమంగా వచ్చేందుకు తోడ్పడుతుంది. పండిన అనాస తింటూంటే పళ్ళ నుండి రక్తంకారే స్కర్వీ వ్యాధి రాకుండా రక్షణ కలుగుతుంది. పూర్తిగా పండని అనాసరసం తీసుకుంటే కడుపులో పురుగులు పోతాయి. జ్వరం, కామెర్ల వంటి అనారోగ్యాలలో ఉన్న వారికి అనాస రసం ఇవ్వడం మంచిది. అనాసపండులో ఉండే కొన్ని పదార్థాలు శరీరంలో క్యాన్సర్‌ కారకమయిన పదార్థాలు తయారు కాకుండానూ, పేరుకోకుండానూ రక్షణ ఇస్తాయి.
 
వేసవి అంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది పుచ్చకాయ. తీవ్రమైన ఎండల నుండి తట్టుకోవడానికి, దాహం నుంచి సేద తీరడానికి పుచ్చకాయ ఉపయోగపడుతుంది. బాగా పండిన పుచ్చకాయలో 60 శాతం పదార్థం తినడానికి వస్తుంది. 100 గ్రా పదార్థంలో 95 శాతం నీరు వుంటుంది. 15 క్యాలరీల శక్తి, విటమిన సి 17 మి.గ్రా, 32 గ్రా కాల్షియం వుంటుంది.