గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 29 నవంబరు 2015 (17:09 IST)

బేరియాట్రిక్ సర్జరీతో ఊబకాయానికి చెక్: స్వచ్ఛభారత్‌పై నాజర్ ప్రశంసలు..!

నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన ఫోర్టిస్ మలర్ ఆస్పత్రిలో కోయంబత్తూరుకు చెందిన జెమ్ ఆస్పత్రి సహకారంతో బేరియాట్రిక్ సర్జరీ విభాగాన్ని తొలిసారి ఏర్పాటు చేశారు. ఈ విభాగాన్ని ప్రముఖ సినీ నటుడు తెన్ ఇండియా నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్యపరిభాషలో బేరియాట్రిక్ సర్జరీ అంటే తనకు పెద్ద అవగాహన లేదన్నారు. 
 
అయితే ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతపై దృష్టి సారిస్తే చక్కెర వ్యాధి, ఊబకాయం బారినపడకుండా మరికొన్ని రోజులు ఆయురారోగ్యాలతో జీవించవచ్చన్నారు. అందువల్ల పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ తమ విధిగా భావించి పాటించాలన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం అద్భుతమైనదని నాజర్ కొనియాడారు. ఈ మిషన్ విజయవంతమయ్యేందుకు ప్రతి పౌరుడు తమ విధిగా భావించి కృషి చేయాలని పిలుపు నిచ్చారు. 
 
ఆ తర్వాత బేరియాట్రిక్ సర్జరీ విభాగం అధిపతి డాక్టర్ ప్రవీణ్ రాజ్ మాట్లాడుతూ.. భారీ ఊబకాయంతో బాధపడేవారికి చిన్నపాటి సర్జరీతో సాధారణ బరువుకు తీసుకొచ్చే విధానమే బేరియాట్రిక్ సర్జరీ అని చెప్పారు. దీనివల్ల దుష్పరిణామాలు ఉండవన్నారు. 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు వారు ఈ సర్జరీకి అర్హులని వివరించారు. ఆ పైబడిన వయసువారికి కూడా ఈ సర్జరీని చేయవచ్చునని.. అయితే బేరియాట్రిక్ సర్జరీ రోగి ఫిట్ కాదా అనే విషయాన్ని వైద్యులు నిర్ధారించాల్సి వుందన్నారు. 
 
ప్రస్తుతం ఈ తరహా విభాగం దక్షిణ భారత్‌లో కేవలం కోయంబత్తూరులోని జెమ్ ఆస్పత్రిలో ఉందని భారీ ఊబకాయంతో బాధపడేవారు అక్కడుకు వచ్చి బేరియాట్రిక్ సర్జరీ చేయించుకోవడానికి కష్టసాధ్యంగా ఉందన్నారు. అందుకే ఫోర్టిస్ మలర్, జెమ్ ఆస్పత్రిలు కలిసి ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుని చెన్నైలో ఈ విభాగాన్ని తొలిసారి ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు. ఊబకాయం వ్యక్తి వ్యాధి నిర్ధారతను ఆధారంగా చేసుకుని సర్జరీ ఖర్చులను వసూలు చేస్తామన్నారు. 
 
ఆ తర్వాత మలర్ ఆస్పత్రి మినిమమ్ యాక్సస్ కన్సల్టెంట్ డాక్టర్ దీపక్ సుబ్రహ్మణ్యన్ మాట్లాడుతూ.. చక్కెర వ్యాధితో బాధపడేవారి సంఖ్య చైనా తర్వాత భారత్‌లోనే అధికంగా ఉన్నారని, డయాబెటిస్ కారణంగా శరీరంలో చాలా అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. డయాబెటిస్, ఒబిసిటీలకు మధ్య అంతర్గత సంబంధాలున్న విషయాన్ని ఓ ఒక్కరు గ్రహించలేకపోతున్నారని చెప్పారు. 
 
ప్రస్తుతం తాము జెమ్ ఆస్పత్రి మరియు పరిశోధనా కేంద్రంతో కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందం వల్ల నగరంలో ఊబకాయంతో బాధపడే అన్ని వర్గాల ప్రజలకు పరిష్కార మార్గం లభించిందన్నారు. కాగా ఈ కార్యక్రమంలో 100-130 కేజీల బరువుతో బాధపడుతూ బేరియాట్రిక్ సర్జరీ ద్వారా సాధారణ స్థాయికి చేరుకున్న పలువురు రోగులు కూడా పాల్గొన్నారు. వీరంతా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా జీవిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.