గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 23 నవంబరు 2015 (18:16 IST)

గ్రీన్ టీ తాగితే దంతాలకు ఏమవుతుంది...?

ప్రతి రోజు ఓ యాపిల్ పండు తీసుకుంటే వైద్యుడ్ని సంప్రదించాల్సిన అవసరం లేదనేది ఇంగ్లీషు నానుడి. ఐతే ఇప్పుడు తీసుకోవాల్సిన ఆపిల్ పండ్లను చెక్ చేసుకుని మరీ తినాల్సిన పరిస్థితి ఏర్పడిందనుకోండి. ఇకపోతే ప్రతిరోజు గ్రీన్ టీ సేవిస్తుంటే దంతవైద్యుడ్ని సంప్రదించాల్సిన అవసరం లేదంటున్నారు పరిశోధకులు.
 
గ్రీన్ టీ సేవించడం వలన అందులోనున్న యాంటీమైక్రోబైయాల్ మాలెక్యూల్స్ దంతాలను పరిరక్షిస్తాయని పరిశోధకులు తెలిపారు. అదికూడా పంచదార కలుపుకోకుండా మాత్రమే సేవించాలంటున్నారు న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఆల్ఫ్రెడో మొరాబియా. 
 
తరచూ కాఫీ, టీలలో పంచదార కలుపుకుని సేవిస్తుంటారు. పంచదారలో హానికరమైన పదార్థాలుంటాయని, ఇవి దంతాలను పాడుచేస్తున్నాయని తమ పరిశోధనల్లో తేలినట్లు ఆయన తెలిపారు. పంచదార కలుపుకోకుండా కాఫీ, టీ, పాలు సేవిస్తే దంతాలకు ఎలాంటి హానీ కలగదని ఆయన తెలిపారు. 
 
తాము నిర్వహించిన పరిశోధనల్లో దాదాపు 25,000 మందిని భాగస్వాములను చేసామని, వీరిలో రోజుకు ఒకసారి గ్రీన్ టీ సేవించిన వారిలో జ్ఞాన దంతాలతోపాటు ఇరవై దంతాలు సురక్షితంగానున్నాయని, అదే గ్రీన్ టీ సేవించక సాధారణమైన టీలో పంచదార కలుపుకుని సేవించిన వారిలో మాత్రం దంతాలు పాడైపోయాయని ఆయన తెలిపారు.