గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By pyr
Last Updated : బుధవారం, 29 జులై 2015 (17:14 IST)

స్మార్ట్ ఇండియా.. సెల్‌తోనే సంసారం..! 79 శాతం మంది నిద్రలోనూ పక్కనే..!?

స్మార్ట్ ఇండియా.. డిజిటల్ ఇండియా అనే పేర్లను మన కేంద్ర ప్రభుత్వం ఏ ఉద్దేశ్యంతో అంటోందో తెలియదు. కానీ మనవాళ్ళు మాత్రం స్మార్ట్ ఫోన్ పక్కలో లేనిదే నిద్ర రాదంటున్నారు. అనడమే కాదు. చాలా మంది తన జీవితభాగస్వామి, పిల్లలు పక్కనే ఉన్నా.. స్మార్ట్ ఫోన్ లేనిదే నిద్రపట్టదంటున్నారు. ఇది నిజం. భారతదేశంలో 74 శాతం మంది స్మార్ట్ ఫోన్ బెడ్‌పై లేనిదే నిద్రపోవడం లేదట. ఈ జాఢ్యం ప్రపంచాన్నంతటిని పట్టి పీడిస్తోందట. 
 
స్మార్ట్ ఫోన్ వినియోగంపై ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ మోటరోలా సర్వే వివరాలను వెల్లడించింది. ఈ సంస్థను లెనోవో సంస్థ ఇటీవల సొంతం చేసుకుంది. అమెరికా, బ్రిటన్‌, బ్రెజిల్‌, చైనా, స్పెయిన్‌, మెక్సికో, ఇండియా దేశాల్లోని 7,112 మందితో కేఆర్‌సీ పరిశోధన బృందం ఆన్‌లైన్‌ సర్వే నిర్వహించింది. ఆ సర్వే వివరాల్ని తెలుసుకుంటే మతిపోతుంది. 
 
74శాతం మంది భారతీయులు, 70శాతం మంది చైనీయులు తమ ఫోన్లను పట్టుకునే పడుకుంటున్నారట. పక్కనే భాగస్వామి ఉన్నా... పిల్లలున్నా.. వారిని పక్కన పెట్టి నిద్ర పట్టేంత వరకూ స్మార్టు ఫోన్‌తో గడిపి.. ఆపై పక్కనే పెట్టుకుని ఏ అర్ధరాత్రో.. అపరాత్రో నిద్రకు ఉపక్రమిస్తున్నారట. ఇంకా విచిత్రమేమిటంటే ప్రతి ఆరుగురిలో ఒకరు స్నానం చేసేటప్పుడు కూడా ఫోన్‌ వాడుతున్నారట.
 
40శాతం మంది తన దగ్గరి మిత్రుడికి కూడా చెప్పుకోని వ్యక్తిగత రహస్యాల్ని సైతం ఫోన్‌లో భద్రపరుచుకుంటారట. 39శాతం మంది తమ స్మార్ట్‌ ఫోన్లతో తామెంతో ఆనందంగా ఉన్నామని చెబితే 79 శాతం మంది మాత్రం తమ ఫోన్లపై అసంతృప్తిని వ్యక్తం చేశారట.  ఏది ఏమైనా స్మార్ట్ ఇండియా అంటే స్మార్ట్ ఫోన్‌ను బెడ్‌పై పెట్టుకుని పడుకోవడమేమో...!