శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: గురువారం, 27 ఆగస్టు 2015 (18:34 IST)

ఆమె కళ్లు నాకోసమే వెతుకుతున్నాయి... నా ఫ్లాట్ వైపు చూస్తుంది... నేనామెను దొంగచాటుగా...

నిజంగా ఇది ఎవరికైనా జరుగుతుందో, జరిగి ఉంటుందో తెలియదు కానీ నాకు మాత్రం జరిగింది. నగరంలో మంచి ఉద్యోగంలో సెటిల్ అయ్యాను. భగవంతుడి దయ వల్ల ఓ బాబు కూడా పుట్టాడు. నేను, నా భార్య, మా బాబుతో హేపీగా ఉంటున్నాము. రోజూ స్కూల్లో మా బాబును నేనే కారులో దిగబెట్టి వస్తుంటాను. ఓ రోజు మా ఎదురింటి ఫ్లాటులో ఉంటున్న కుటుంబం, తమ కుమార్తె... ఎంబీఎ చదివే అమ్మాయి కాలేజీకి అర్జెంటుగా వెళ్లాలి, అభ్యంతరం లేకపోతే నా కారులో దిగబెట్టమని అడిగారు. నా భార్య కూడా ఒత్తిడి చేసింది. సరేనని ఆమెను కారులో ఎక్కించుకున్నాను. 
 
ఆమె వయసు 22. నా వయసు 45. కారులో జస్ట్ హలో అనుకున్నాం. ఐతే మరుసటి రోజు నుంచి ఆమె నా కారులో ఎక్కేందుకు రోడ్డుపై వెయిట్ చేయడం మొదలుపెట్టింది. అలా నా కారులో ఆమె జర్నీ చేయడం మొదలుపెట్టింది. ఇలావుంటుండగా ఓ రోజు రాత్రివేళ నాకు ఫోన్ చేసింది. తనకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని చెప్పింది. తనకు ఇష్టం లేదని ఏడుస్తోంది. నేను ఆమెను ఓదార్చాను. వెంటనే బయట గార్డెన్ లోకి రమ్మంది. వెళ్లాను. అక్కడికి వచ్చి మరిన్ని విషయాలు చెప్పి చాలాసేపు రోదించింది. 
 
తనకు ఆ పెళ్లి ఇష్టం లేదని చెప్పింది. ఆ విషయాన్ని మీ పేరెంట్సుకు చెప్పమని అన్నాను. ఇంటికి వెళ్లిపోయిన ఆమె నాకు ఆ రాత్రంతా మెసేజ్‌లు పెడుతూనే ఉంది. మీలాంటి మంచివారు నాకు ఇంతవరకూ కనబడలేదని మెసేజ్ చేసింది. నాక్కూడా ఏదోలా అనిపించింది. నాకామె పట్ల ఇష్టం పెరిగిందేమోనని డౌట్ వచ్చింది. రెండ్రోజులు పూర్తిగా అవైడ్ చేశాను. కానీ నావల్ల కాలేదు. ఆమెతో నేను మాట్లాడలేకుండా ఉండలేకపోతున్నాను. 
 
ఈ విషయం నా భార్యకు చెప్పాను. ఆమె షాకయ్యింది. వెంటనే ఆమెను, నన్ను పిలిచి ఒకచోట కూర్చోపెట్టి కౌన్సిలింగ్ చేసింది. ఆ తర్వాత ఆమె నాతో మాట్లాడింది లేదు. పెద్దలు చూసిన సంబంధాన్నే అంగీకరించి పెళ్లి చేసేసుకుంది. ఐతే ఇటీవల ఆమె భర్త విదేశాలకు వెళితే తిరిగి వారి పుట్టింటికి వచ్చింది. వచ్చిన దగ్గర్నుంచి ఆమె వీలున్నప్పుడల్లా మా ఫ్లాట్ వంకే చూస్తూ ఉంది. నేను కూడా ఆమె కనబడిన దగ్గర్నుంచి ఆమెనే దొంగచాటుగా చూస్తున్నాను. 
 
ఏదో ఒకరోజు ఆమె ఇంట్లోకి వెళ్లిపోతానేమోనని భయంగా కూడా ఉంది. ఆమె కళ్లు నాకోసమే వెతుకుతున్నాయి. నేను ఆమెను ఎంత మర్చిపోదామన్నా మర్చిపోలేకపోతున్నాను. ఏం చేయాలి... ఆమె వయసు నాలో సగం. చిన్న పిల్ల. ఈ వయసులో నాకు లవ్వేంటో అర్థం కావడంలేదు. మనసును ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా వల్లకావడం లేదు. ఏంటి మార్గం...?
 
ప్రేమకు వయసుతో సంబంధం లేదు. ఐతే మీరు ఇప్పటివరకూ చాలా విజ్ఞతతోనే ఉన్నారు. ఇకముందు కూడా అలాగే ఉండండి. ఆమె మీ మంచితనాన్ని ప్రేమిస్తుంది. పైగా టీనేజ్ ఆకర్షణ సరేసరి. మనసువిప్పి మాట్లాడుకోగలిగేందుకు మీరు దొరికారు. కాబట్టి అన్ని విషయాలు మీతో చర్చించింది. ఇప్పుడు పెళ్లి చేసుకున్నది. మీ ఫ్లాట్ వంక చూడటం వెనుక వేరే ఉద్దేశ్యం ఏమీ ఉండకపోవచ్చు. మీరెలా ఉన్నారో చూద్దామని అనుకుంటూ ఉండవచ్చు. మీ భార్య చొరవతో మంచి జరిగింది. ఆమెను మీరనుకునే ఊహల్లో నుంచి డిలిట్ చేయక తప్పదు. వేరే విషయాలపైకి దృష్టి మరల్చండి. వీలుంటే మీ భార్యతో కలిసి ఆమె ఇంటికి వెళ్లి తొలిసారిగా వచ్చింది కనుక ఏదయినా మంచి బహుమతి ఇచ్చి ఆశీర్వదించి రండి. ప్రేమికురాలిగా కాక వాత్సల్యంతో ఆమెను చూడండి.