శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By PNR
Last Updated : బుధవారం, 1 జులై 2015 (16:31 IST)

వర్షాకాలంలో చర్మ సంరక్షణ ఎలా?.. ఇవిగో కొన్ని చిట్కాలు....

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఆహ్లాదకరమైన చిరు జల్లుల వాతావరణాన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తున్నారు. అదేసమయంలో ఈ చల్లని వాతావరణం చర్మసంబంధ సమస్యలను, అనేక అనారోగ్యాలను కూడా తెచ్చిపెడుతుంది. వానలు కురిసే సమయంలో నీటి కాలుష్యం, అపరిశుభ్ర వాతావారణం, రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల ఏ వయసువారికైనా ఆరోగ్య సమస్యలు తప్పవు. 
 
ముఖ్యంగా వాతావరణంలో తేమ పెరగడంతో చర్మ, శ్వాస సంబంధ సమస్యలు దరిచేరుతాయి. ముఖ్యంగా ఇంటిపనులతో తలమునకలయ్యే గృహిణులు, ఇంటాబయటా ఒత్తిడితో పనిచేసే ఉద్యోగినులు చర్మ సంరక్షణ పట్ల ఇపుడు మరింత అప్రమత్తంగా ఉండాలి. వైరల్, బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లకు గురైనపుడు వ్యాధుల బారిన పడడమే కాకుండా, శారీరక సౌందర్యం కూడా దెబ్బతినే ప్రమాదం లేకపోలేదు. 
 
వానాకాలంలో ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ముందు జాగ్రత్త చర్యలు అవసరం. చర్మసంరక్షణ పట్ల మరింత శ్రద్ధ వహించాలి. ప్రస్తుత సీజన్‌లో తేమ వాతావరణం, దుమ్ము, ధూళి కారణంగా చర్మం కాంతివిహీనమవుతుంది. ఇలాంటి చర్మ సంబంధిత సమస్యల నుంచి గట్టెక్కేందుకు కొన్ని చిట్కాలు. 
 
* వర్షాకాలంలో ముఖానికి మితిమీరిన మేకప్ చేసుకోవడం తగ్గించాలి. ఒకవేళ మేకప్ వేసుకున్నా సులువుగా, నీటితో కడిగితే తొలగిపోయేలా జాగ్రత్తపడాలి.
* ముఖచర్మం మంచి నిగారింపుతో, మృదువుగా ఉండాలంటే ఉదయం, సాయంత్రం వీలైనన్ని ఎక్కువ సార్లు చన్నీటితో శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల ముఖంపై జిడ్డుదనం పోతుంది. 
* నాణ్యమైన లోషన్లు, మాయిశ్చరైజర్లను వాడితే ముఖచర్మం మృదుత్వాన్ని సంతరించుకుంటుంది. అయితే, వైద్య నిపుణుల సలహా మేరకు మాత్రమే ఈ క్రీమ్‌లు, లోషన్లు వాడితే మంచిది.
* బ్లీచింగ్, ఫేషియల్స్‌కు వానాకాలం అనుకూలం కాదు. వీటి వల్ల ముఖచర్మానికి మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంది.