శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pyr
Last Updated : శనివారం, 29 ఆగస్టు 2015 (08:19 IST)

భక్తులకు 100 గ్రాముల ఉచిత లడ్డూ... టీటీడీ పరిశీలన

శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే ప్రతి భక్తునికి 100 గ్రాముల లడ్డూ ఉచితంగా అందించే ప్రతిపాదనపై అధ్యయనం చేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి చెప్పారు. శ్రీవారి ఆలయంలో స్వామివారికి నివేదించే అన్నప్రసాదాలను కూడా అన్నప్రసాదం వివతణ కేంద్రంలో భక్తులకు వడ్డించే అంశంపై పరిశీలన చేస్తున్నామన్నారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తరువాత అమలుపై నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. 
 
నారాయణాద్రి ఉద్యానవనంలో వేయికాళ్ల మండపం తిరిగి నిర్మించాలనే ప్రతిపాదనపై అధికారులు అధ్యయనం చేస్తున్నారని చదలవాడ కృష్ణమూర్తి పేర్కొన్నారు. భక్తులకు శ్రీవారి దర్శనం, బస, అన్నప్రసాదం, కల్యాణకట్ట తదితర విభాగాల్లో అందిస్తున్న సేవలను మరింత మెరుగుపర్చడానికిఈవో డాక్టరు డి.సాంబశివరావు అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు.
 
తిరుమలలో భక్తులను మోసగిస్తున్న దళారీ వ్యవస్థను రూపమాపడానికి, హింసను ప్సోత్సహిస్తున్నవారికి అరికట్టడానికి తమ పాలక మండలి కట్టుబడి ఉందని తితిదే ఛైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి పేర్కొన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని తిరుమలలో ఉన్న దళారులు, నిబంధనలకు వ్యతిరేకంగా వ్యాపారాల సముదాయాలు నిర్వహించేవారు స్వచ్ఛందంగా తమ కార్యకలాపాలకు స్వస్తిపలకాలన్నారు. 
 
తితిదే ఉద్యోగుల ఇళ్ల స్థలాల సమస్యల పరిష్కారానికి రెవెన్యూ అధికారులతో చర్చించి పటిష్టచర్యలు తీసుకోనున్నామని చదలవాడ కృష్ణమూర్తి పేర్కొన్నారు. సంస్థలో పనిభారానికి అనుగుణంగా తితిదేలో ఉన్న ఖాళీల భర్తీకి ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నామని చెప్పారు. తితిదే విక్రయిస్తున్న తలనీలాలకు చైనా, జపాన్‌ కంపెనీల ప్రతినిధులతో సంప్రదించేందుకు తమ కమిటీ నిర్ణయం తీసుకుందన్నారు.