బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pyr
Last Modified: సోమవారం, 30 మార్చి 2015 (10:38 IST)

ఆకలే అర్హత... తిరుమల నిత్యాన్నదాన ట్రస్టుకు 30 యేళ్లు

ఆకలే అర్హత అనే నినాదంతో తిరుమల తిరుపతి దేవస్థానం చేపట్టిన నిత్యాన్నదాన ప్రసాద ట్రస్టుకు మూడు దశాబ్దాలు పూర్తి కావస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు ప్రవేశపెట్టిన ఈ పథకం రోజు కనీసం 40 వేల మందికి కడుపు నింపుతోంది. వందల కోట్ల రూపాయలను దాతలు విరాళంగా ఇచ్చారు. తిరుమలలో ఇదో ఉద్యమంలా నడుస్తోంది. వివరాలిలా ఉన్నాయి. 
 
తిరుమల తిరుపతి దేవస్థానం ఆకలే అర్హతగా ఉచితంగా అన్న ప్రసాదాలు అందించేందుకు 1985 ఏప్రిల్ 6న రెండు వేల మందితో ఈ ట్రస్టు ప్రారంభమైంది. స్వామి వారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే పేద భక్తుల కడుపు నింపడం కోసం అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీరామారావు ఈ పథకాన్ని ప్రతిపాదించారు. నాటి ఆ ట్రస్టు నేడు రోజుకు 1.16 లక్షల మందికి అన్న ప్రసాదాలు వడ్డిస్తున్నారు. వారాంతంలో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. 
 
ఇప్పటి వరకూ ఈ ట్రస్టుకు రూ.585 కోట్ల వరకు భక్తుల నుంచి విరాళాల రూపంలో అందాయి. రూ.వెయ్యి నుంచి రూ.కోట్లలో విరాళాలు ఇచ్చిన 3.3 లక్షలకు పైగా దాతలు ఈ ట్రస్టుకు వెన్నుదన్నుగా నిలిచారు. తిరుమలలోని తరిగొండ నిత్యాన్న ప్రసాద భవనం, క్యూలైన్లు, యాత్రి సదన్లతో పాటు తిరుపతిలోని రుయా ఆస్పత్రి, బర్డ్, ప్రసూతి వైద్యశాల, విష్ణు నివాసం, శ్రీనివాసం, తిరుచానూరులో రెండు పూటలా అన్నప్రసాదాలు అందిస్తున్నారు.
 
కొన్ని వందల మంది కార్మికులు ఇందో పని చేస్తుంటారు. ప్రత్యేక నిధిని కూడా ఏర్పాటు చేసుకున్న అన్నదానం రోజు రోజుకు పెరుగుతోందే తప్ప తరుగుదల లేదు. విరాళాలుగా అందిన రూ.585 కోట్లు అందాయి. దాని వడ్డీ రూపంలో రూ.40 కోట్లు లభిస్తోంది. మిగిలిన మొత్తాన్ని టీటీడీ సాధారణ నిధుల నుంచి గ్రాంటుగా అందుతోంది. ఇది కాక కూరగాయలు, ఇతర సరుకులను విరాళంగా ఇచ్చే దాతలు ఎందరో ఉన్నారు.